పొత్తులో భాగంగా సీట్లపై కొంత స్పష్టత వచ్చింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. బీజేపీతో పొత్తు కుదిరితే కొన్ని సీట్లను వారికి ఇవ్వొచ్చు. ఇవాళ 94 మంది టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. అయితే బాబు ప్రకటనపై ఆయన సొంత జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌ల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది.
తాజా జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు స్థానాలపై స్పష్టత లభించింది. తంబళ్లపల్లె (జయచంద్రారెడ్డి), పీలేరు (నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి), నగరి (గాలి భానుప్రకాశ్), జీడీనెల్లూరు (థామస్), చిత్తూరు (గురజాల జగన్మోహన్), పలమనేరు (అమర్నాథ్రెడ్డి), కుప్పం (చంద్రబాబునాయుడు) నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ఏడింటిలో ముగ్గురు కమ్మ నేతలు చంద్రబాబునాయుడు, గాలి భానుప్రకాశ్, గురజాల జగన్మోహన్లకు టికెట్లు దక్కాయి. మిగిలిన ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం.
ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. ఇంకా పుంగనూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడు, తిరుపతి, మదనపల్లె నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. మదనపల్లె మినహా మిగిలిన నియోజకవర్గాలకు ఇప్పటికే ఇన్చార్జ్లున్నారు. పుంగనూరు-చల్లా బాబు, శ్రీకాళహస్తి-బొజ్జల సుధీర్‌రెడ్డి, పూతలపట్టు-మురళి, సత్యవేడు-హెలెన్, తిరుపతి-సుగుణమ్మ, చంద్రగిరి-పులివర్తి నాని టీడీపీ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. మదనపల్లెలో కార్యక్రమాల్ని దొమ్మలపాటి రమేశ్ పర్యవేక్షిస్తున్నారు.
తమకు టికెట్లు ఇవ్వకపోవడంతో ముఖ్యంగా శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడు, తిరుపతి ఇన్‌చార్జ్‌లు షాక్‌కు గురయ్యారు. అధికారం లేనప్పటికీ టీడీపీ జెండాను మోస్తున్న నాయకులు వీరు. తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె సీట్లను జనసేన ఆశిస్తోంది. తిరుపతి సీటును జనసేనకు ఇచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయని తాజా ఉదంతాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
శ్రీకాళహస్తి, చంద్రగిరిలో అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తాజా రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. ఇంతకాలం తమతో పని చేయించుకుని, ఎన్నికల్లో పోటీ విషయానికి వచ్చే సరికి పక్కన పెడతారనే భయం టీడీపీ ఇన్‌చార్జ్‌ల్లో వుంది.