చంద్రబాబు-పవన్ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించారు. వివాదాలు వున్న వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
పెందుర్తి, భీమిలి, రాజమండ్రి రూరల్ లాంటివి పక్కన వుంచారు. పోలా… అదిరిపోలా అనే రేంజ్‌లో ఎల్లో మీడియా సంబరాల రాతలు రాస్తోంది. పొత్తు అంటే ఇదీ, పొత్తు ధర్మం అంటే ఇదీ అంటూ కీర్తనలు పాడుతోంది. జనసేన 24 చోట్ల పోటీ చేస్తుంది. భాజపా కలిసి రాకపోతే మరో ఏడెనిమిది స్థానాలు జనసేనకు దక్కుతాయి.
అయితే ఎల్లో మీడియా సంబరాలు చేస్తున్నంత పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో లేదు. అనకాపల్లి స్థానాన్ని పరుచూరి భాస్కరరావు ఆశిస్తున్నారు. పార్టీని నిర్మించుకుంటూ వచ్చారు. ఆయనను పక్కన పెట్టి కొణతాల రామకృష్ణకు ఇచ్చారు. కొణతాల ఆఖరి నిమిషంలో జనసేన లోకి వచ్చారు.
అటు భాస్కరరావు సంగతి అలా వుంచితే, పీలా గోవిందు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు ఇప్పుడు టికెట్ లేదు. బంధువు రామకృష్ణకు ఇచ్చారు కనుక ఆయన సంతృప్తి చెందుతారని బాబు-పవన్‌ల భావన. కానీ గోవిందుకు ఇస్తారని ఆశగా వున్న ఆయన అనుచరులు మాత్రం కొణతాల వెనుక వెళ్లరు. ఇటీవలే పార్టీలోకి వచ్చి దాడి వీరభద్రరావు వర్గం అసలు వెళ్లదు. కెేవలం నాగబాబు కోసం పవన్ ఈ ప్లాన్ వేసారు. దానికి బాబు ఓకె అన్నారు.
జనసేన ప్రకటించిన అయిదు పేర్లలో కొత్త వింతలేమీ లేవు. ముందు నుంచి వినిపిస్తున్న పేర్లే. ఇదిలా వుంటే తెలుగుదేశం సీట్లలో కూడా పెద్దగా షాక్ లు ఏమీ లేవు. దాదాపు 90 శాతం పాత మొహాలే. పార్టీని ఎప్పటి నుంచో మోస్తున్నవారే. ఒకటి రెండు చోట్ల వారసులకు అవకాశం ఇచ్చారు. విజయనగరం, తునిలో ఇలా చేసారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేయడానికి కోటిన్నర మంది అభిప్రాయాలు సేకరించానని చంద్రబాబు చెప్పడం ఫన్నీగా వుంది. ఎందుకంటే ఈ పాత పేర్లు ప్రకటించేందుకు అంత కసరత్తు అవసరం లేదు. జనసేనకు ఇచ్చే మూడు పార్లమెంట్ సీట్లలో ఒకటి నాగబాబుకు, మరొకటి కాకినాడ, ఇంకొకటి నరసాపురం వుంటాయని వినిపిస్తోంది. ఇవేమీ పెద్ద సమస్య కాబోవు.
విశాఖ జిల్లాలో జనసేన కనీసం మూడు సీట్లు ఆశిస్తోంది. వాటిలో రెండు చోట్ల తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్ధులు వున్నారు. అందుకే ప్రస్తుతానికి ప్రకటించకుండా పక్కన పెట్టారు. రాజమండ్రిని జనసేన వదులుకున్నట్లే. గోరంట్ల బుచ్చయ్య చౌదరికే ఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. మరి అక్కడ పొత్త ధర్మం ఎలా వుంటుందో చూడాలి.
కేవలం 24 సీట్లు అన్నది జనసేన శ్రేణులకు మొదటి షాక్. రెండవది కీలకమైన స్థానాలు వదులుకునే సూచనలు కనిపించడం రెండోషాక్. ఈ షాక్ ల ప్రకంపనులు ఇప్పుడు ఎల్లో మీడియా దాచి పెట్టవచ్చు. కానీ గ్రౌండ్‌లో అలా లేదు. జనసేన వర్గాల్లో అసంతృప్తి మామూలుగా పెల్లుబుకడం లేదు.. ఓ రేంజ్ లో వుంది. దాని ఫలితం ఎన్నికల టైమ్ లో తెలుస్తుంది.