హీరోగా రవితేజ ప్రస్తుతం వరుసగా ఫెయిల్యూర్స్ ఇస్తున్నాడు. అయితే అతడు అప్పుడప్పుడు హిట్స్ కూడా ఇస్తుంటాడు. కానీ నిర్మాతగా మాత్రం రవితేజ ఇప్పటివరకు అన్నీ ఫ్లాపులు మాత్రమే ఇస్తూ వస్తున్నాడు. ఈ కోణంలో అతడు పూర్తిస్థాయిలో ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది.
రవితేజ నిర్మాతగా మారి చాలా కాలమైంది. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ స్థాపించాడు. తన సినిమాలకు అప్పుడప్పుడు కో-ప్రొడ్యూసర్ గా ఈ బ్యానర్ పేరు వేసుకుంటూనే, మరోవైపు ఇతరులతో కలిసి సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. అలా నిర్మించిన సినిమాలేవీ క్లిక్ అవ్వడం లేదు.
విష్ణు విశాల్ తో మట్టి కుస్తీ సినిమా నిర్మించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఛాంగురే బంగారు రాజా అనే సినిమా తీశాడు. అది కూడా క్లిక్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా సుందరం మాస్టర్ అనే సినిమా వచ్చింది. ఇది కూడా ఆకట్టుకోలేదు.
మధ్యలో తనే హీరోగా నటించిన రావణాసుర అనే సినిమాకు కూడా సహ-నిర్మాతగా వ్యవహరించాడు రవితేజ. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా కూడా ఆడలేదు. అలా ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మెరవలేదు.
మంచి కాన్సెప్టులు ఎంచుకుంటోంది ఆర్టీ టీమ్ వర్క్స్. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతోంది. ప్రమోషన్ వినూత్నంగా చేస్తోంది కానీ సరైన రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేకపోతోంది. ఈ బ్యానర్ ఎప్పుడు సక్సెస్ చూస్తుందో ఏంటో..?