నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి సెట్స్ పైకి వెళ్లకముందే గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాలో హీరోకు శనివారానికి ఏదో లింక్ ఉందని చెప్పారు. అది చూస్తే హీరోకు ఏదో అతీంద్రియ శక్తులున్నట్టు చాలామందికి అనిపించింది.
ఈరోజు ఈ సినిమాకు సంబంధించి ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు. 'సరిపోదా శనివారం' సినిమాలో హీరో పాత్ర పేరు సూర్య. అతడికో వింత లక్షణం ఉంది. కోపాన్ని అందరూ ప్రదర్శిస్తారు. కానీ సూర్య మాత్రం దాచుకుంటాడు.
“కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా ఒక రోజు మాత్రమే వాడే పిచ్చినాకొడుకును ఎవరైనా చూశారా..” అనే డైలాగ్ ఈ సినిమా స్టోరీలైన్ ను చెప్పకనే చెబుతోంది. వారమంతా కోపాన్ని దాచుకొని శనివారం మాత్రమే దాన్ని పైకి ప్రదర్శించే వ్యక్తిగా నాని ఇందులో కనిపించబోతున్నాడు. దీని వెనక లాజిక్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
వివేక్ ఆత్రేయ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటి ప్రత్యేక చిత్రమే, కాకపోతే ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో నిండిన చిత్రంగా కనిపిస్తోంది.
ఎస్ జే సూర్య పాత్రతో నానికి ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. గ్లింప్స్ లో పోలీస్ గెటప్ లో ఎస్ జే సూర్య మాత్రమే మాట్లాడతాడు, నానికి ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా బాగుంది.
గ్లింప్స్ తో నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆగస్ట్ 29న సినిమా థియేటర్లలోకి వస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.