టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాస్‌రావుకు చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాజా ప్రకటించిన 94 మంది జాబితాలో వాళ్లిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. గంటా శ్రీనివాస్‌కు చెక్ పెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజమండ్రి రూరల్ సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వీర సైనికుడు. 77 ఏళ్ల బుచ్చయ్య చౌదరి చివరి సారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించారు.
అయితే బుచ్చయ్య చౌదరి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. బుచ్చయ్యపై చంద్రబాబు మొదటి నుంచి సవతి ప్రేమ చూపుతున్నారనే సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును జనసేన ఆశిస్తోంది. రాజమండ్రి రూరల్ జనసేన ఇన్చార్జ్ కందుల దుర్గేష్‌కు పవన్ కల్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని మీడియాతో కందుల దుర్గేష్ ఇటీవల చెప్పారు. రాజమండ్రిలో జనసేన శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి.
అయితే రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని, తనకే చంద్రబాబు ప్రకటిస్తారని ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. టీడీపీ శ్రేణులు భావోద్వేగానికి గురి కావద్దని ఆయన సూచించారు. ఇవాళ టీడీపీ 94 మందితో జాబితా విడుదలైంది. ఇందులో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, గంటాకు మినహాయిస్తే అందరికీ సీట్లు దక్కాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త వాసుకు ఇచ్చారు.
అయితే పవన్‌కల్యాణ్ ప్రకటించిన ఐదుగురి జాబితాలో రాజమండ్రి రూరల్ లేదు. అలాగని రేపు బుచ్చయ్య చౌదరికి సీటు ఇస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో రాజమండ్రి రూరల్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గంటా శ్రీనివాస్‌ను విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. ఇందుకు ఆయన ససేమిరా అన్నట్టు తెలిసింది. సీట్లు దక్కే అవకాశం లేని పరిస్థితిలో ఇద్దరు టీడీపీ సిటింగ్‌ల భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చర్చనీయాంశమైంది.