కాపుల భయమే నిజమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో టీడీపీకి గంపగుత్తగా తమను బలిపెడతారని కాపులు కొంత కాలంగా ఆందోళన చెందుతున్నారు. చివరికి అదే జరిగింది. గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు వుంటుందనే పదేపదే పవన్‌కల్యాణ్ చెబుతూ వచ్చారు. జనసేనకు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న ఆయన సామాజిక వర్గంతో పాటు అభిమానులు కూడా నమ్ముతూ వచ్చారు.
అయితే పవన్‌పై అనుమానంతో కాపు ఉద్యమ కురువృద్ధుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య సీట్లపై హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎల్లో మీడియాలో జనసేనకు ఇచ్చే సీట్లు 20 నుంచి 25 లోపే అంటున్నారని, అదే నిజమైతే ఓట్ల బదిలీ జరగదని హరిరామజోగయ్యతో పాటు కాపు నాయకులు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసింది. ఎట్టకేలకు ఇవాళ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఇస్తున్నట్టు పవన్‌కల్యాణ్ సమక్షంలోనే ఆయన చెప్పారు. నిజానికి ఎల్లో మీడియా ప్రచారం చేసిన దాని కంటే ఇంకా ఒక అసెంబ్లీ సీటు తగ్గడం గమనార్హం. జనసేన, కాపు నాయకులు కనీసం 35 నుంచి 4ఏ సీట్లకు తక్కువ కాకుండా అసెంబ్లీ, నాలుగైదు లోక్‌సభ సీట్లను పవన్ సాధిస్తారని ఆశించారు.
ఆ సంఖ్య అయితేనే జనసేనకు గౌరవం అని భావించారు. చివరికి అందరి ఆశలను అడియాసలు చేస్తూ… కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో పవన్ సర్దుకున్నారు. ఈ సీట్లపై జనసేన, కాపు నేతలు రగిలిపోతున్నారు. రానున్న రోజుల్లో వారి నిర్ణయం ఎలా వుంటుందో చూడాల్సి వుంది.