జనసేనాని పవన్‌కల్యాణ్‌ను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే పవన్ చాలా భయపడిపోతున్నారు. పవన్ ఏ స్థాయిలో భయపడుతున్నారంటే… చివరికి తాను పోటీ చేసే నియోజకవర్గంపై కూడా స్పష్టత ఇవ్వలేని స్థితికి దిగజారారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కలిసి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేపట్టారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీన్ని బట్టి చంద్రబాబు బాగా కసరత్తు చేశారని అర్థమైంది. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రం పవన్‌కల్యాణ్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. అభ్యర్థుల ప్రకటనపై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. చంద్రబాబు తన అభ్యర్థులందరినీ ప్రకటిస్తారని తెలిసినప్పుడు, తాను కూడా అదే రీతిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జనంలోకి వెళ్లేలా చేయాలని పవన్‌కు ఆలోచన ఎందుకు కలగలేదో అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
కనీసం తాను పోటీ చేయాలని అనుకుంటున్న భీమవరంపై కూడా ఆయన రహస్యాన్ని పాటించడం విశేషం. పవన్ ఇవాళ ప్రకటించిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలిలా ఉన్నాయి. తెనాలిలో నాదెండ్ల మనోహర్, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం- బలరామకృష్ణుడు, కాకినాడ రూరల్ – నానాజీ, నెల్లిమర్ల – లోకం మాధవి పోటీ చేస్తారని పవన్ వివరించారు.
ఇంత కాలం మంగళగిరి జనసేన కార్యాలయంలో రాత్రింబవళ్లు పవన్ కల్యాణ్ ఏం కసరత్తు చేశారో ఆయనకే తెలియాలి. ఒకవైపు చంద్రబాబునాయుడు ఎంతో జాగ్రత్తగా అభ్యర్థులపై పకడ్బందీగా కసరత్తు చేసినట్టు ఆయన ఎంపిక చెబుతోంది. కుప్పం, మంగళగిరిలలో తను, లోకేశ్ పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. అసలు తన సీటు విషయమై పవన్ ఎందుకంత గోప్యత పాటిస్తున్నారో అంతుచిక్కని రహస్యమైంది.