ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ గారాల పట్టీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మోడికేస్తోంది. ఇదివరకు పాడిన పాటే మళ్ళీ పాడుతోంది. ఈ కేసులో సీబీఐ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటివరకూ ఈ కేసులో సాక్షిగానే పరిగణించి విచారించిన సీబీఐ చార్జీషీటులో ఆమె పేరును నిందితురాలిగా పేర్కొనడం సంచలనంగా మారింది. సెక్షన్ 41 ఏ కింద కవితకు నోటీసులు జారీ చేస్తూ ఈనెల 26న తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
ఈవిషయమై కవిత స్పందిస్తూ, నోటీసులు.. విచారణ తీరుపై సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగులో ఉన్నందున తాను విచారణకు హాజరు కాబోనని చెప్పింది. సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చేంతవరకు తాను సీబీఐ విచారణకు వెళ్లేదిలేదని తేల్చి చెప్పింది. ఈవిషయమై ఆమె రెండురోజులుగా న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ కవిత గడువు కోరే అవకాశం ఉందని వారంటున్నారు.
లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన మాగంటి రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లు ఇచ్చిన సమాచారం మేరకే సీబీఐ కవితకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కవిత పీఏ కౌశిక్ న్యాయమూర్తి ముందు ఈ కేసుకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందజేసినట్టుగా కౌశిక్ జడ్జి ఎదుట స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కవితతో పాటు కౌశిక్ ని కూడా సీబీఐ నిందితులుగా పరిగణిస్తోంది. ఈడీ కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కవిత వేసిన కేసు ఈనెల 28న విచారణకు రానుంది.
అప్పటి వరకూ కవిత సీబీఐ విచారణకు హాజరుకానని స్పష్టం చేయడంతో ఈ కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆమె విచారణకు హాజరైతే.. సీబీఐ తాజాగా సేకరించిన సమాచారం మేరకు ఆమెను విచారించి అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ఆమె కోర్టును ఆశ్రయించడమే తక్షణ కర్తవ్యమని వారంటున్నారు. ఈవిషయంలో న్యాయనిపుణులు ఇచ్చే సలహా మేరకు కవిత ఏ స్టెప్ తీసుకుంటారో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అప్పుడు చేసిన దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది. లిక్కర్ కేసులో సీబీఐ హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆమెను విచారణ చేసి.. ఆమె స్టేట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కొన్నిసార్లు కవితను ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఆహ్వానించి ప్రశ్నించింది. ఆఖరుసారి గత ఏడాది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణకు పిలవడాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పెండింగ్లో ఉన్నందున కవిత తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఎలాంటి సమాధానం రాలేదు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై మళ్లీ ఈ నెల 28న విచారణ జరుగుతుంది.