ఇప్పటి రాజకీయాల్లో ఆదర్శాలు పనికిరావు. సిద్ధాంతాలు వల్లిస్తే ప్రయోజనం ఉండదు. ఇలాటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ప్రతిక్షణం గెలుపే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా సాగే ప్రస్తుత రాజకీయాల్లో జీరో పాలిటిక్స్ చేయడం అంటే డబ్భు ఖర్చు చేయకుండా ఎన్నికల రాజకీయాలు చేయడం అసాధ్యం. ఈ సత్యాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తించాడు.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఆదర్శానికి తిలోదకాలు ఇచ్చాడు. జనసేన అధినేత గత ఎన్నికల సమయంలో అదేపనిగా ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలకు ఆ పార్టీ స్వస్తి పలికేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కోట్లు ఖర్చు చేయకపోతే జనం ఓట్లు వేయరనే కఠోర వాస్తవాన్ని జనసేన ఎట్టకేలకు గుర్తించింది. పొత్తులో భాగంగా గణనీయమైన సీట్లతో గట్టిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న జనసేన ఇప్పడు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆర్థికంగా కాస్త పటిష్టంగా ఉన్న వారికే సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది.
మొహమాటంతో ఉద్యమకారులకో, సామాజిక వేత్తలకో సీట్లు ఇచ్చి డబ్బు ఖర్చు చేయకపోతే ఉపయోగం ఉండదనే భావనకు ఆ పార్టీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో సీట్లు ఆశిస్తున్న నేతలు అందుకు సరిపడా నగదు సిద్ధం చేసుకొని సీటు కోరాలనే మెసేజ్‌ను జనసేన అధిష్టానం ఇప్పటికే పంపించింది.
ఇప్పుడు ఎవరైనా సీటు కావాలని అడుగుతుంటే నిర్మొహమాటంగా మీరు ఎంత ఖర్చు చేయగలుగుతారు..? అని అధిష్టానం ఎదురు ప్రశ్న వేస్తోంది. నియోజకవర్గాన్ని బట్టి ఖర్చు ఉంటుందని దానికి తగ్గట్టుగా అభ్యర్థులు సిద్ధం కావాలని స్ఫష్టం చేస్తోంది. జనసేన పార్టీ నుంచి ఒక్కపైసా కూడా అభ్యర్థులకు ఇచ్చే పరిస్థితి లేదు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేసినప్పుడు బయట నుంచి చందాలు తీసుకోకుండా సంబంధిత జిల్లాల నేతలే ఆ ఖర్చు భరించారు. పార్టీలో నిధుల నిల్వ లేకపోవడం వల్లే ఇటీవల విశాఖ జిల్లా నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా పవన్ తన వంతుగా పార్టీకి పది కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను కేవలం పార్టీ నిర్వహణకే వినియోగిస్తారు.
‘నా సేన.. నా వంతు’ అనే నినాదంతో కార్యకర్తల నుంచి పార్టీ నిర్వహణ కోసం జనసేన చందాలు తీసుకొంటోంది. మిగిలిన పార్టీల మాదిరిగా రహస్యంగా గాక బహిరంగంగానే చందాలు వసూలు చేస్తుంది. ఆన్‌లైన్‌లో స్కాన్ కోడ్ ద్వారా పది రూపాయల నుంచి చందాలు ఇవ్వవచ్చు. కొన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల అద్దెలను కూడా పార్టీనే చెల్లిస్తోంది.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో రాజకీయాల్లో జంపర్స్ ని జోకర్స్ ని తీసుకోబోమని , డబ్బు ప్రభావం లేకుండా రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని ప్రకటించేవాడు. 2014లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి బీజేపీకి, చంద్రబాబుకి బహిరంగంగా మద్దతు ప్రకటించి తన పార్టీని మాత్రం ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా ఉంచాడు.
ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇస్తున్న హామీలకి నాదీ పూచీ అంటూ చంద్రబాబుని, ఆయన హామీలని భుజాన మోస్తూ ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు. తీరా ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ప్రజలని మోసం చేసిన పక్షంలో, పూచి నాది అన్న పవన్ కళ్యాణ్ – మొహం చాటేసి తిరగడం మొదలుపెట్టాడు.
ఇక్కడే పవన్ కళ్యాణ్ పై సామాన్యలు ఏర్పర్చుకున్న సదభిప్రాయం పోయి. చంద్రబాబు జేబులో మనిషే ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక నిశ్చయానికి వచ్చారు సామాన్య ప్రజలు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ దారుణ ఓటమి.
2014లో చెప్పినట్టు జంపర్స్ కి జోకర్స్ కి తన పార్టీలో చోటు లేదంటూనే చంద్రబాబు చెప్పిన అభ్యర్ధులకే 2019లో సీట్లు ప్రకటించడంతో జనసేన సిద్ధాంతాలు మొత్తం ఒట్టి మాటలే, కేవలం ప్రజలని మభ్యపెట్టే సినిమా డైలాగులు మాత్రమే అని తేలిపోయింది. చంద్రబాబే అనుకుంటే చంద్రబాబుని మించి పవన్ కళ్యాణ్ మాటలు మార్చడం చూసిన ప్రజలు ఏవగింపు కలిగింది.
ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోకపోగా ఇంకో అడుగు ముందుకేసిన పవన్ కళ్యాణ్ భీమవరంలో మాట్లాడుతూ తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎక్కడా చెప్పలేదని రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ జనసేన క్యాడర్ కి షాక్ ఇచ్చాడు.
ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, భోజనాలకైనా పెట్టుకోపోతే ఎలా? ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం, ఓట్లు కొనాలా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి అంటూ మాట్లాడి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేశాడు.
ఇన్నిరోజులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తారు మా అధినేత, అందుకే నాగబాబు డోనేషన్ కలక్షన్ అంటూ కబుర్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకున్న పవన్ అభిమానులు ఆయన పేల్చిన ఈ బాంబుతో ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.