డబ్బింగ్ ఆమెదే.. డైరక్షన్ బాబుది!

చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. పత్రికల పతాక శీర్షికలలోకి ఎక్కే ప్రకటన చేశారు. అధికార పక్షం నుంచి విపక్షాల నుంచి కూడా నాయకులు అందరూ…

చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. పత్రికల పతాక శీర్షికలలోకి ఎక్కే ప్రకటన చేశారు. అధికార పక్షం నుంచి విపక్షాల నుంచి కూడా నాయకులు అందరూ డైరెక్టుగాను ఇండైరెక్టుగాను తన మాటల గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితిని ఆమె కల్పించారు.

కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడుని తప్పించి ఈసారి రాబోయే ఎన్నికలలో తానే పోటీ చేయాలని అనుకుంటున్నారు. నారా భువనేశ్వరి చేసిన ప్రకటన తాజా రాజకీయాలలో అతిపెద్ద సంచలనాంశం అవుతోంది. అయితే పురందేశ్వరి నోటిమాటగా ఈ సంగతి బయటకు వచ్చినప్పటికీ.. ఇదంతా కూడా చంద్రబాబునాయుడు స్కెచ్ మాత్రమేనని, ఆయన డైరెక్షన్ లోనే ఆమె ఈ ప్రకటన చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తాను ఏడుసార్లు గెలిచిన కుప్పం నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేయడానికి చంద్రబాబునాయుడు జంకుతున్న మాట నిజం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎదురైన పరాభవాలు ఆయనకు గుర్తున్నాయి.

కుప్పం మునిసిపాలిటీని కోల్పోయిన సంగతి కూడా గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కుప్పంలో తన ప్రజాదరణ గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదనే సంగతి కూడా నలభయ్యేళ్ల ఇండస్ట్రీ సీనియర్ చంద్రబాబుకు అర్థం కాకపోలేదు. అందుకే ఆయన ఈసారి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కుప్పం నుంచి తాను పోటీచేయకుండా.. భార్యను పోటీచేయించాలని అనుకుంటున్నారు.

చంద్రబాబునాయుడుకు ఒక అలవాటు ఉంది. తాను ఏదైనా తేడాగా ఉన్న నిర్ణయం తీసుకునేప్పుడు.. ముందుగా దానిని ప్రజల్లోకి లీక్ చేయిస్తారు. ఎవరో ఒకరి ద్వారా లీక్ చేయించి.. ప్రజలు ఆ నిర్ణయం గురించి ఏం అనుకుంటున్నారో..  వారి స్పందన ఎలా ఉన్నదో గమనిస్తారు. దానిని బట్టి తుది నిర్ణయం తీసుకుని, అప్పుడు తాను ప్రకటిస్తారు. ఇది ప్రజలకు ఎప్పటినుంచో అలావటైపోయిన చంద్రబాబు టెక్నిక్.

ఇప్పుడు కుప్పంలో పోటీచేయడానికి భయపడుతున్న చంద్రబాబు మళ్లీ అదే పనిచేశారు. కుప్పంలో నారా భువనేశ్వరి పోటీచేస్తే ఎలా ఉంటుందో.. ప్రజల స్పందన ఏమిటో, కార్యకర్తలు ఎలా స్వీకరిస్తారో గమనించడానికి ఆమెతోనే అలాంటి ప్రకటన చేయించారు.

‘చంద్రబాబు గారికి రెస్టు ఇవ్వాలి. ఈసారి నేనే పోటీచేద్దామనుకుంటున్నాను’ అని ప్రకటించిన భువనేశ్వరి, తర్వాత ‘ఏదో సరదాగా అన్నట్టుగా’ మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు గాక.. కానీ కుప్పం కార్యకర్తల పల్స్ గమనించడానికి అది చంద్రస్కెచ్ అనే అందరూ భావిస్తున్నారు. కుప్పంలో ఓటమి భయంతో పారిపోతున్న చంద్రబాబు.. పెనమలూరు నుంచి పోటీచేయాలని అనుకుంటున్నట్టుగా కూడా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.