తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మాయచేసి బురిడీ కొట్టించే వ్యూహంతో ఉన్నారా? ప్రభుత్వం మీద భారం పడగల కార్యక్రమాలను కొద్దికొద్దిగా వెనక్కు నెడుతూ.. పార్లమెంటు ఎన్నికల తర్వాత అమలుచేసేలా ఆలోచిస్తున్నారా? కొన్ని సంక్షేమ పథకాల వరాలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ.. మరి కొన్నింటిని అమలు చేయడం ఆలస్యం అవువతుందా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.
ఆరు హామీల అమలు విషయంలో ఇన్నాళ్లుగా గులాబీ దళాలు సాగిస్తున్న ప్రచారమే నిజం అవవుతుందేమో అనే అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. రైతుబంధు విషయంలో రేవంత్ రెడ్డి ఈ జాగ్రత్త చూపిస్తున్నారేమో అనిపిస్తోంది.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాతి నుంచి ప్రతిపక్షం గులాబీ దళానికి చెందిన నాయకులు, మాజీ మంత్రులు అందరూ కూడా.. ప్రభుత్వం మీద ఒకటే విమర్శ కురిపిస్తున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం ఈ ప్రభుత్వానికి చేత కాదు. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కాలయాపన చేసి ఆ తరువాత నెమ్మదిగా నీరుగారుస్తారని అంటూ వస్తున్నారు. ఇదే గ్యారంటీల పేరు చెప్పి.. పార్లమెంటు ఎన్నికల్లో కూడా లబ్ధి పొందుతారని.. ఎన్నికల తర్వాత రిక్తహస్తం చూపిస్తారని అంటూన్నారు. అయితే ఈ విమర్శలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నాయకులు తిప్పికొడుతూ వచ్చారు.
ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. వారి విమర్శలే నిజమయ్యేలా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తేదీ దగ్గరపడింది. మార్చి 12న నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ తరువాత కొత్త పథకాలను ప్రారంభించడం ఎటూ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కోస్గిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాలను తెల్లరేషన్ కార్డుల వారికి వారం రోజుల్లోగా అమలు చేస్తాం అని ప్రకటించారు.
అంటే.. కీలకమైన ఈ రెండు హామీలను కూడా వెంటనే అమలు చేయకపోతే.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలు తమను బజార్న పడేస్తాయి గనుక.. ఆ విషయం మాత్రం సెలవిచ్చారు. అదే రైతుబంధు విషయానికి వచ్చేసరికి. మార్చి 15 లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం అంటున్నారు. ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసే అవకాశాలే ఎక్కువ.
రైతుబంధును ఇప్పట్లో ఇచ్చే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదేమో అనిపిస్తోంది. 12న నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకుంటుండగా.. రైతుబంధు పంపిణీకి గడువు మార్చి 15 అని ఆయన అనడం కేవలం డ్రామా మాత్రమేనా అని పలువురు భావిస్తున్నారు. రైతు బంధు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి అనుమానాలకు గురికాకుండా ఉండాలంటే.. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా.. ఆ నిధులు కూడా విడుదల కావాలని అంటున్నారు.