జనసేనాని పవన్‌కల్యాణ్ జిల్లాల పర్యటనల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అయితే అధికారికంగా ఆయన బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ, నేరుగా నాయకులకే హామీ ఇస్తున్నారు. ఇటీవల విశాఖ, తాజాగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖలో ఒక లోక్‌సభ, నాలుగైదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో జనసేన అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టికెట్‌పై కూడా స్పష్టత ఇచ్చారు. గత నెలలో ఇదే జిల్లాకు సంబంధించి రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. రాజోలు, రాజానగరం అభ్యర్థులపై స్పష్టత ఇవ్వకపోయినా, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని పవన్ తేల్చి చెప్పారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనలో టీడీపీ నాయకుల్ని పవన్‌కల్యాణ్ కలిశారు. పొత్తులో భాగంగా ఉమ్మడి ఉభ్యర్థిగా భీమవరం నుంచి పోటీ చేస్తానని, సహకరించాలని ఆయన కోరారు. భీమవరంలో పోటీ చేస్తున్నట్టు పవన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ, టీడీపీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పవన్‌కల్యాణ్ తమ అభ్యర్థులకు స్పష్టత ఇవ్వడంపై ఎల్లో మీడియా ఎందుకనో మౌనం పాటిస్తోంది.
భీమవరంలో టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కోరారాయన. అయినప్పటికీ ఎల్లో మీడియా మాత్రం పవన్ పోటీపై ఏమీ తెలియనట్టు సెలైంట్‌గా వుండడం గమనార్హం. భీమవరంలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని …అది కూడా ఎల్లో మీడియా జిల్లా సంచికల్లో మొక్కుబడిగా రాశాయి.
జనసేన అభ్యర్థులపై పవన్ స్పష్టత ఇచ్చారని రాస్తే టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందనే భయం ఏదో వెంటాడుతున్నట్టుంది. మరోవైపు జనసేనాని ఎక్కడికక్కడ సీట్లపై స్పష్టత ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.