తప్పక గెలిచే వాళ్లను పోగొట్టుకునేంత అమాయకత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేరు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకరిద్దరు మంచి నాయకుల్ని జగన్ పోగొట్టుకోవడం వాస్తవమే. ఇందుకు ఉదాహరణగా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. టీడీపీకి వీళ్లిద్దరు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు బలమైన నాయకులు అంటే బాగా డబ్బున్న వాళ్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఓడిపోతారని భావించి, సిటింగ్ స్థానాల్ని మార్చడమో, లేక అసలు టికెట్ ఇవ్వకుండా పక్కన పెడుతున్న వైసీపీ నాయకులను చంద్రబాబు నెత్తికెత్తుకోవడం చర్చనీయాంశమైంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీలో చేర్చుకోవడం ఆ పార్టీ నాయకులెవరికీ ఇష్టం లేదు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాంను టీడీపీ చేర్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆలూరులో అధికారాన్ని అడ్డు పెట్టుకుని జయరాం, ఆయన సోదరుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని ఇంత కాలం టీడీపీ అనుకూల మీడియానే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా ఆలూరులో గుమ్మనూరు జయరాంకు మరోసారి టికెట్ ఇస్తే, గెలవలేరని జగన్ గుర్తించారు. దీంతో ఆయన్ను కర్నూలు ఎంపీగా బరిలో దింపాలని నిర్ణయించారు. ఆలూరు ఇన్‌చార్జ్‌గా విరూపాక్షిని నియమించారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి గుమ్మనూరు జయరాం ససేమిరా అంటున్నారు. పలు దఫాలు సీఎం జగన్‌ను కలిసి, ఆలూరు సీటే కావాలని వేడుకున్నారు. కుదరదని సీఎం తేల్చి చెప్పారు. దీంతో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై వేట మొదలు పెట్టారు.
గుమ్మనూరుకు ఉన్న గొప్ప పేరు దృష్ట్యా కర్నూలు టీడీపీ నాయకులెవరూ ఆయన్ను పార్టీలో చేర్చుకోడానికి ఆసక్తి చూపలేదు. కర్నాటక మంత్రుల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆలూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తామని గుమ్మనూరు సోదరుడు ప్రకటించారు. ఆలూరు వీలు కాకపోతే గుంతకల్లు అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది.
వైసీపీ చెత్తగా భావించి, పక్కన పడేయాలని భావిస్తే, దాన్ని తన నెత్తిన వేసుకోడానికి సిద్ధపడిన చంద్రబాబును చూస్తే జాలిపడాలో లేక కోప్పడాలో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు.