లోకేష్ ముందు గంటా తిట్టలేదు.. అయ్యన్న తిట్టారు!

నారా లోకేష్ తెలుగుదేశం యువ నాయకుడు. టీడీపీ పెట్టాక అధికారంలోకి వచ్చాక పుట్టిన లోకేష్ ఇపుడు పార్టీలో అరేడు పదులు దాటిన సీనియర్లకు కూడా లీడర్ అయిపోయారు. కేరాఫ్ చంద్రబాబు అన్న ట్యాగ్ తో…

నారా లోకేష్ తెలుగుదేశం యువ నాయకుడు. టీడీపీ పెట్టాక అధికారంలోకి వచ్చాక పుట్టిన లోకేష్ ఇపుడు పార్టీలో అరేడు పదులు దాటిన సీనియర్లకు కూడా లీడర్ అయిపోయారు. కేరాఫ్ చంద్రబాబు అన్న ట్యాగ్ తో టీడీపీకి లోకేష్ భావి నాయకుడి హోదాను సంపాదించుకున్నారు. బాబుతో పాటు లోకేష్ బాబు గుడ్ లుక్స్ కూడా తమ మీద పడాలని సీనియర్ల నుంచి జూనియర్ల దాకా నేతలు అంతా కోరుకుంటున్నారు.

ఇకపోతే శంఖారావం పేరుతో లోకేష్ ఉత్తరాంధ్రాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు మాజీ మంత్రుల నియోజకవర్గాలలో శంఖారావాన్ని నిర్వహించారు. షరా మామూలుగా ఈ సభలలో ఇద్దరు మాజీ మంత్రులు కీలక ప్రసంగాలు చేశారు.

జగన్ ని వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారా పట్టారు. గంటా సిట్టింగ్ సీటు అయిన ఉత్తరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ తిట్లు అయితే అందులో లేవు. అసభ్య పదజాలం అంతకంటే లేదు. సాధారణంగా గంటా హుందాగానే మాట్లాడుతారు. ముఖ్యమంత్రి గారూ అని ఎక్కడా అగౌరవ పదజాలంతో కాకుండానే గంటా మాట్లాడారు.

మాకు సీట్లు వస్తాయి మేము గెలుస్తామని చెప్పుకోవడంతో పాటు విశాఖకు ఉత్తరాంధ్రాకు వైసీపీ ఏమీ చేయలేదు అని గంటా నిశిత విమర్శలు మాత్రమే చేశారు. గంటా ప్రసంగం ఇలా ఉంటే అక్కడ నుంచి నర్శీపట్నం వెళ్ళిన లోకేష్ కి పెద్దాయన అయ్యన్నపాత్రుడు ప్రసంగం కూడా వినే భాగ్యం దక్కింది.

అయ్యన్న అయితే దిగజారిన భాషతో జగన్ మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు. నా కొడకా అంటూ అసభ్య పదజాలమే వాడేశారు. వేదిక మీద ఉన్న లోకేష్ అయితే బాగానే ఎంజాయ్ చేశారు అని అంటున్నారు. ఆయన అలా వింటూంటే పెద్దాయన ఇంకా బూతులు మాట్లాడుతూ జగన్ మీద మహిళ అని చూడకుండా రోజా మీద విరుచుకుపడిపోయారు.

విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్రా ముగింపు సభలో రోజా కబడ్డి కాసేపు ఆడారు. దాని మీద కూడా అయ్యన్న పచ్చిగానే మాట్లాడారు. రోజా ఆడుతూంటే బలిసిన అడవి పంది ఆడినట్లుగా ఉందని జోకేశారు. అలాగే జగన్ మీద తిట్ల పురాణం లంకించుకుంటే చినబాబు సహా అంతా ఫైర్ బ్రాండ్ అంటే అయ్యన్నే అనుకున్నారు. ఏడు పదుల వయసులో ఆయన తగ్గలేదని అంటున్నారు.

కొడుకుకి అనకాపల్లి ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్న అయ్యన్న లోకేష్ బాబు మెప్పు కోసమే ఇలా తమ పార్టీ అధినాయకుడి మీద మహిళా మంత్రి అని చూడకుండా రోజా మీద దుర్భాషలు ఆడారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రులు మాట్లాడిన దాంటో చూస్తే తిట్లలో అయ్యన్న ఫస్ట్ మార్క్ కొట్టేశారు అని అంటున్నారు. అందుకే ఆయనకు పదవసారి టికెట్ ఇస్తున్నారని కూడా సెటైర్లు పేల్చుతున్నారు.