పవన్ అంటే ఇష్టం.. అందుకే నాకు కోపం.. !

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన వ్యూహం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అందులో పవన్ పాత్ర, అతడి పార్టీ ప్రస్తావన తదితర అంశాలపై సూటిగా స్పందించాడు. తనకు పవన్ అంటే ఇష్టమని,…

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన వ్యూహం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అందులో పవన్ పాత్ర, అతడి పార్టీ ప్రస్తావన తదితర అంశాలపై సూటిగా స్పందించాడు. తనకు పవన్ అంటే ఇష్టమని, అందుకే అతడు చేసే పనులు చూస్తుంటే కోపం వస్తుందని అంటున్నాడు ఆర్జీవీ.

“పవన్ కల్యాణ్ అంటే ఓ వ్యక్తిగా నాకు చాలా ఇష్టం. జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన్ను నేను లైక్ చేశాను. కానీ తన రాజకీయ ప్రస్థానంలో కనివినీ ఎరుగని అస్థిరతను నేను గమనించాను. జనసేన పార్టీని నడిపే తీరు, ఆయన ఎజెండా, సినిమాటిక్ పేర్లు పెట్టుకొని ఆయన చేసే వ్యవహారాలు మొత్తం అనిశ్చితిలో ఉంటాయి. దాన్ని నేను విమర్శిస్తాను.”

చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టే పవన్ ను విమర్శిస్తున్నాడనే కామెంట్స్ ను తిప్పికొట్టాడు వర్మ. జగన్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ, పవన్ వ్యవహార శైలి నచ్చకపోతే కచ్చితంగా వ్యతిరేకించేవాడినని అన్నాడు.

“పవన్ కల్యాణ్, జగన్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ నేను ఇలానే విమర్శించేవాడ్ని. ఎందుకంటే, గతంలో నేను వైసీపీని విమర్శించాను. టికెట్ రేట్ల విషయంలో నేను వైసీపీని వ్యతిరేకించాను. జగన్ తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. కానీ నాకు నచ్చని విషయాన్ని నేను వ్యతిరేకిస్తాను.”

వ్యూహం సినిమాలో చాలా సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు బలయ్యాయనే వాదనను వర్మ అంగీకరించడం లేదు. చాలా తక్కువ కట్స్ పడ్డాయంటున్నాడు. కొన్ని మ్యూట్స్ కూడా ఉన్నాయని తెలిపాడు. అలా కట్ అయిన సన్నివేశాలు, మ్యూట్ అయిన సీన్స్ అన్నింటినీ రిలీజ్ తర్వాత యూట్యూబ్ లో పెడతానని స్పష్టం చేశాడు.