అసలే గందరగోళంలో ఉన్న టీడీపీలో జనసేనాని పవన్‌కల్యాణ్ తాజా ప్రకటన మరింత అలజడి రేపుతోంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌కల్యాణ్ తన పార్టీ నాయకులతో కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. రానున్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందాం అని ఆయన అన్నట్టు జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఈ ప్రకటన టీడీపీ గుండెల్లో గునపం దింపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. మన కూటమి అధికారంలోకి వస్తోంది. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమష్టి గెలుపు కోసమే తొలి నుంచీ నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయి. జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటా. 2019 తరవాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటా. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తరవాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాను. అప్పటికి ఆయన మన పార్టీలోకి రాలేదు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. స్థానిక ఎన్నికల్లో కావచ్చు, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి. మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందాం” అని పవన్‌కల్యాణ్ అన్నారు.
ఇందులో ప్రధానంగా మూడింట పదవులు దక్కించుకుందామనే పవన్ కామెంట్స్ టీడీపీలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని రగిల్చేవే. ఇటీవల పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే సంగతిని బలంగా చెప్పడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారనే చర్చకు తెరలేచింది. పవన్ చెబుతున్నట్టు… రానున్న ఎన్నికల్లో కనీసం 58 సీట్లకు తక్కువ కాకుండా అసెంబ్లీ సీట్లను టీడీపీ ఇవ్వాల్సి వుంటుంది. ఇదే డిమాండ్‌ను కాపు నాయకులు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడింట సీట్లంటే జనసేన హ్యాపీ. ఇదే సందర్భంలో టీడీపీ అన్‌హ్యాపీ.
మరోవైపు టీడీపీ అనుకూల మీడియా మాత్రం జనసేనకు ఇచ్చేది కేవలం 25 సీట్లు లోపే అని ఊదరగొడుతోంది. పవన్ మాటలు చూస్తే, పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.