ఏ చిన్న అవకాశం దొరికినా తన అల్లుడు చంద్రబాబు నైజం గురించి లోకానికి చెప్పడానికి నందమూరి లక్ష్మీపార్వతి సిద్ధంగా వుంటారు. తనను అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్‌ను గద్దె దించడాన్ని ఆమె జీర్ణించుకోలేకున్నారు. ఎన్టీఆర్‌ను చివరి రోజుల్లో చంద్రబాబు, ఆయన కోటరీ మానసికంగా వేధించడం వల్లే ప్రాణాలు కోల్పోయారనేది లక్ష్మీపార్వతి వాదన. కొన్నేళ్లుగా చంద్రబాబుపై అలుపెరగని పోరాటాన్ని లక్ష్మీపార్వతి కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి చంద్రబాబుపై ఆమె విరుచుకుపడ్డారు. ఒక సదస్సులో లక్ష్మీపార్వతి ప్రసంగిస్తూ ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపారన్నారు. జగన్ మహిళా సంస్కర్తగా ఆమె అభివర్ణించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ నెలకొల్పారన్నారు.
ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్సార్ అని ఆమె అన్నారు. ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్న సీఎంలలో దేశంలోనే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని లక్ష్మీపార్వతి ప్రశంసలతో ముంచెత్తారు. జగన్మోహన్రెడ్డి ఒక వ్యవస్థ అని ఆమె అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.
అల్లుడు చంద్రబాబు బాగోతం గురించి అత్తగా తనకే బాగా తెలుసన్నారు. బాబు పాలనలో రూ.6 లక్షల కోట్లు లూటీ జరిగిందని ఆమె ఆరోపించారు. బాబు పనై పోయిందని ఆమె విమర్శించారు. బాబు ముసులోడు అయ్యాడని, మూడు కాళ్లొచ్చాయని ఎద్దేవా చేశారు. తన కుమారుడు లోకేశ్‌ను సీఎం చేయడానికి బాబు తపిస్తున్నారని ఆమె అన్నారు. బాబు బాధితుల్లో తాను, తన భర్త ఎన్టీఆర్ మొదటి వరుసలో వుంటామని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లంటే చంద్రబాబు అసహ్యమని ఆమె అన్నారు.