మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటె కూడా.. కులమే ముఖ్యమని డిసైడ్ అయ్యారు. ఇన్నాళ్లూ గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నారు. మరో రెండురోజుల్లోగా చేరుతారని తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేం పార్టీ కి ముసలంగా మారి దెబ్బ కొడతాడా? లేదా, త్యాగమూర్తిగా నిలుస్తాడా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
మైలవరం ఎమ్మెల్యే స్థానానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్ చేతిలో దాదాపు 13 వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. గెలిచినా సరే.. వసంత అక్కడ పెద్ద యాక్టివ్ గా పనిచేసింది లేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గడపగడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఎమ్మెల్యేలు అందరికీ పురమాయించినప్పుడు.. తీసికట్టుగా చేసిన నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఉంది. పార్టీ కార్యక్రమాలను ధిక్కరిస్తూ, పెడసరంగా, అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు.
జోగి రమేష్ తో తనకు ఉన్న విభేదాలను ఆయన భూతద్దంలో పెట్టి ప్రచారం చేసుకుంటూ గడిపేవారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని స్వయంగా ఎన్నిసార్లు బుజ్జగించి, సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆయన మెట్టు దిగలేదు. తీరా కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా మెలగుతున్న వసంత తెలుగుదేశంలో చేరబోతున్నారు.
అయితే అక్కడ ఆయనకు టికెట్ దక్కుతుందా? అనేది అనుమానమే. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓడిపోయిన దేవినేని ఉమా.. మళ్లీ పోటీచేయడానికి చాలా కాలంగా పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా వసంత తెరమీదకు రావడం ఆయనకు మింగుడుపడకపోచ్చు. వసంత కృష్ణప్రసాద్ తనకు అక్కడే మళ్లీ టికెట్ కావాలనే పట్టుదలతో టీడీపీలోకి వెళితే గనుక ఆ పార్టీలో ముసలం పుట్టినట్టే. ఆయన చేరిక వవల్ల పార్టీకి ఒరిగేది ఉండదు కదా.. దేవినేని ఉమా అలకతో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి.
అలా కాకపోతే.. వసంత కృష్ణ ప్రసాద్ తనకు టికెట్ వద్దనుకుని తెలుగుదేశానికి పనిచేసి త్యాగమూర్తిగా మిగిలిపోయే మరో ఆప్షన్ ఉంది. టికెట్ వద్దని అనుకోవచ్చు. అయితే.. టికెట్ వద్దనుకున్నంత మాత్రాన.. దేవినేని ఉమా విజయానికి మనస్ఫూర్తిగా సహకరిస్తారా? లేదా, ఉమా ఓడిపోతే భవిష్యత్తులోనైనా తనకు టికెట్ దక్కుతుందని వ్యూహాత్మకంగా ఉంటారా అనేది తెలియడం లేదు.
ఏ రకంగా చూసినా.. తెలుగుదేం పార్టీకి వసంత చేరికతో లాభమా నష్టమా అనేది అంత తేలిగ్గా అంచనా చేయలేకపోతున్నారు.