నారా లోకేశ్ తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకుంటుంటారు. కానీ ఆయనలో రెండో కోణం కూడా వుంది. ఆ రెండో కోణమే హాస్య చతురత. కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా వుందంటే… అది తెలుగుదేశం పార్టీనే అని ఆయన గతంలో నొక్కి మరీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే సంకారావం అంటూ తనదైన కామెడీని ఆయన పండించడంపై సోషల్ మీడియా పండుగ చేసుకుంటోంది.
తాజాగా జగన్‌పై ఆయన కామెడీ డైలాగ్‌లు చెప్పారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ ఆస్తుల్ని జప్తు చేస్తామని ఆయన నవ్వులు పూయించారు. లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేసి ఏర్పాటు చేసిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రజలదే అన్నారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయన్నారు. ప్రజలతో డబ్బుతో ఏర్పాటు చేసిన టీవీ, పేపర్, సిమెంట్ కంపెనీ, ప్యాలెస్‌లు అన్నీ మనవే అని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జప్తు చేస్తామని లోకేశ్ చెప్పడం నవ్వు తెప్పించక, ఏం చేస్తుంది?
2014 నుంచి 19 వరకూ తమ ప్రభుత్వమే వుందని లోకేశ్ చాలా సులువుగా మరిచిపోతుంటారు. ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చినట్టు భావించి ఆయన ఏవేవో మాట్లాడుతుంటారు. 2024లో టీడీపీకి అవకాశం ఇస్తే… ఏపీ సమాజ రూపు రేఖలు పూర్తిగా మారుస్తామని ఆయన నమ్మబలుకుతుంటారు. గత ఐదేళ్ల పాలనలో ఏం చేశారయ్యా అంటే చెప్పుకోడానికి ఏమీ లేదు.
ఎన్డీఏలో భాగస్వామిగా వుంటూ, నాడు జగన్ ఆస్తుల్ని జప్తు చేసి, ఎందుకు ఆయన్ను జైలుకు పంపలేదో లోకేశ్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు మళ్లీ అధికారం ఇస్తే మాత్రం నాడు చేయని పనులన్నీ చేస్తామని చెప్పడం లోకేశ్‌కే చెల్లింది. లోకేశ్ కామెంట్స్ టీడీపీని, ఆయన్ను అభాసుపాలు చేసేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కమెడియన్‌గా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను చూస్తారు. బహుశా పాల్‌తో లోకేశ్ పోటీ పడాలని తహతహలాడుతున్నట్టున్నారు. అందుకే ఆ ప్రగల్భాలేమో!