జనసేనాని పవన్‌కల్యాణ్ వెండితెరపై అగ్రహీరో. పవర్‌స్టార్ అని ఆయన్ను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. సినీ గ్లామర్ తప్ప, ఆయనకు పొలిటికల్‌గా ఎలాంటి ఇమేజ్ లేదు. పదేళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించి… పొలిటికల్‌గా ఆయన ఇంత వరకూ ఎలాంటి ముద్ర వేయలేకపోయారు. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్ప, గెలుపు బావుటా ఎగురవేస్తానని ప్రకటించలేని దయనీయ స్థితి పవన్‌ది.
అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుని రిలాక్ష్ అవుతున్న భావన కలుగుతోంది. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు పవన్‌కల్యాణ్ పర్యటిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. హెలీకాప్టర్ ల్యాండ్ కావడానికి ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి నిరాకరించారని ఏకంగా పర్యటనే రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత మంగళగిరిలో ఆయన పర్యటించాలనుకున్న నియోజకవర్గాల నాయకులతో సమావేశం అవుతారని చెప్పారు. అది కూడా జరిగినట్టు లేదు.
ఈ గ్యాప్‌లో పవన్‌కల్యాణ్ ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆయన విశాఖలో వాలిపోయారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. మరోవైపు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ జనంలోకి వెళ్లారు. జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌కల్యాణ్ మాత్రం క్షేత్రస్థాయి పర్యటనలకు గుడ్ బై చెప్పి, కసరత్తు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు.
తమకిచ్చే సీట్లు 20 లేదా 25కి మించి వుండవనే క్లారిటీ వల్లే… తిరిగేదేముందిలే అని పవన్ అనుకుంటున్నారా? అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. మరోవైపు పవన్ జనంలోకి వెళితే లోకేశ్ పర్యటన తేలిపోతుందనే భయంతో టీడీపీ వద్దని చెప్పిందా? అనే అనుమానం కూడా లేకపోలేదు. వెండితెరపై అగ్రహీరోగా విశేషంగా అభిమానుల్ని సంపాదించుకున్న పవన్‌కల్యాణ్, రాజకీయ తెరపై మాత్రం పాత్ర ఏంటో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు యాక్టీవ్‌గా తిరుగుతుంటే, పవన్‌కు ఏమైంది? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
రాజకీయ తెరపై పవన్‌ను విలన్‌గా, కమెడియన్‌గా, గెస్ట్ ఆర్టిస్ట్‌గా చూస్తున్నారనేది నిజం. ఆయా సందర్భాలను బట్టి పవన్ పాత్ర మారుతూ వుంటుంది. పవన్ రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. ఆ విషయం తెలిసి, కనీసం తానైనా గెలిస్తే చాలని పరిమితంగా ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారా? అనే చర్చకు తెరలేచింది. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో సీరియస్ పొలిటీషియన్ చేయాల్సిన పని మాత్రం ఆయన చేయలేదన్నది నిజం.