Advertisement

Advertisement


Home > Politics - Opinion

గులాబీ షో డౌన్!

గులాబీ షో డౌన్!

రాజకీయాల్లో చారిత్రక తప్పిదాల గురించి మాట్లాడుతూ ఉండడం ఒక అలవాటు. నాయకులు కూడా చాలా సందర్భాల్లో పొరబాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.. అలాంటి వాటికి మూల్యం చెల్లించుకుని.. అధికారానికి దూరం అవుతారు. పొరబాట్లను దిద్దుకుంటూ మరోసారి గద్దె ఎక్కడానికి సిద్ధమవుతూ వుంటారు. చాలా అరుదుగా మాత్రమే దిద్దుకోలేని.. దిద్దుకుంటే మరింతగా నష్టం జరిగే పొరబాట్లు జరుగుతాయి. అలాంటివి వారి ‘షో డౌన్’ను శాసిస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో (భారత దేశంలో అని చెప్పుకునేంత అవసరం ఇంకా మిగిలుందా?) భారత రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితి అదే.

తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో అందుకోసం కొట్లాడుతున్న ఒక పెద్ద పార్టీకి నేత అయినందుకు.. తనను ‘తెలంగాణ జాతిపిత’గా ప్రకటింపజేసుకుని చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోవాలని అనుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైభవం.. పదేళ్ల అధికారంతోనే చరమావస్థకు చేరుకున్నదా? ప్రస్తుత రాజకీయ వావతావరణాన్ని గమనిస్తోంటే అలాగే అనిపిస్తోంది! ఎందుకు? అలా జరిగితే.. అందుకు దారితీయగల కారణాలు ఏంటి? తిరిగి నిలబడేలా- దిద్దుకునే అవకాశం ఉన్నదా? ఈ అంశాల విశ్లేషణే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘గులాబీ షోడౌన్!’

ఫుట్ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి అనేక ఆటలకు- క్రికెట్ కు ఒక ప్రధానమైన తేడా ఉంటుంది. ఆ ఆటల్లో ఆటగాడు ఒకసారి పొరబాటు చేసినా సరే.. తన ప్రతిభను ప్రదర్శించడానికి మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఒకసారి గోల్ మిస్సయితే.. మళ్లీ ప్రయత్నించవచ్చు. ఒకసారి ఏస్ సంధించలేకపోతే, మళ్లీ కష్టపడొచ్చు. కానీ- క్రికెట్ సంగతి వేరు! ఒక బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోతే.. బ్యాటర్ కథ ముగిసిపోతుంది. ఎంతటి ప్రతిభావంతుడైనా కావొచ్చు గాక.. ఆ ఆటలో ఇక అతనికి తెరపడినట్టే!

రాజకీయాలు ఫుట్ బాల్ వంటివా లేదా, క్రికెట్ వంటివా అనే ప్రశ్న వేసుకుంటే ఎవరైనా సరే చాలా సులభంగా సమాధానం చెబుతారు. రాజకీయం ఫుట్ బాల్ లాంటి ఆట మాత్రమే అంటారు. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ మిస్సయినా మళ్లీ చాన్స్ వస్తుంది. ఒకసారి ఓడినా మరోసారి అధికారం దక్కుతుంది. నాయకులు కూడా దీనికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయి ఉంటారు. ఓడిపోయిన సందర్భాలలో వెకేషన్ తీసుకున్నట్లుగా హాయిగా గడుపుతారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త దృశ్యం సాక్షాత్కరిస్తున్నది. గులాబీ దళం రాజకీయం- క్రికెట్ క్రీడలాగా కనిపిస్తున్నది. ఒక నిర్ణయం పొరపాటు అంచనాతో చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి. గులాబీ రాజకీయం షో డౌన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు.

పది సంవత్సరాల పాటు ఏకఛత్రంగా రాజ్యాధికారం వెలగబెట్టారు. ఇప్పుడు ఓటమి తటస్థించింది. అంతమాత్రాన కొంపలు మునిగిపోయినట్లు కాదు కదా.. తిరిగి పునరుజ్జీవం కాగల సత్తా తమకు ఉంది కదా.. అని పార్టీ శ్రేణులు అనుకోవచ్చు గాక! కానీ తాజా పరిస్థితులలో అందుతున్న సంకేతాలను గమనిస్తే.. ఇప్పుడు పడిన పార్టీ తిరిగి లేవడం అంత సులువు కాదు అని మనకు అర్థమవుతుంది.

చారిత్రక తప్పిదం ఏంటంటే..

తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ తెలంగాణ ఆవిర్భావం కోసమే పుట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి తమ మౌనిక లక్ష్యం అని చాటుకుంటూ అస్తిత్వాన్ని స్థిరపరచుకుంది. ఎప్పుడైతే జాతీయ రాజకీయాలలో తమ ముద్ర చూపిస్తాం అని ఆర్భాటపు మాటలతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారో ఆనాడే తెలంగాణ పౌర సమాజంతో ఉన్న గాఢమైన మార్మికమైన అనుబంధాన్ని ఆ పార్టీ తెంచేసుకుంది. దేశం మొత్తానికి కూడా తెలంగాణ మోడల్ అభివృద్ధిని రుచి చూపిస్తాం అనే ప్రకటనలతో కేసీఆర్ హడావుడి చేయాలని అనుకున్నారు కానీ ప్రయత్నం  బెడిసికొట్టింది. ఆయన చెప్పుకుంటున్న తెలంగాణ అభివృద్ధిపై ఈ రాష్ట్ర ప్రజలకే నమ్మకం లేదని అసెంబ్లీ ఎన్నికలలో నిరూపణ అయింది. తెలంగాణ ప్రజలతో, సమాజంతో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెగిపోయింది.

జాతీయ రాజకీయాల కోసం భారాస అనే కొత్త పార్టీ పెట్టాలని తొలుత సంకల్పించి.. తర్వాత తెలంగాణ పార్టీకే పేరుమార్చడం అనే అయిడియా ఎవరి బుర్రలో పుట్టినదో తెలియదు. అలాంటి నిర్ణయం తీసుకుంటున్న సమయంలో.. పార్టీలో వారి మధ్య ఎలాంటి చర్చోపచర్చలు నడిచాయో కూడా తెలియదు. కానీ.. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే.. ఆ పార్టీ సీనియర్ నాయికులు ఈ ఎలిమెంట్ ను గుర్తించారు. పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పదం తొలగించడం తమకు చేటుచేసిందని ప్రకటించారు.

ఇంకా ఒక అడుగు ముందుకు వేసి.. కేసీఆర్ వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని కూడా సలహా ఇచ్చారు. ఇదివరకు పార్టీలో ఈ పాటి సలహా ఇవ్వగల, లేదా, అభిప్రాయం చెప్పగల స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. పార్టీ ఓడిపోయిన తర్వాత.. కేసీఆర్ గుత్త పెత్తనానికి కూడా గండిపడడం మొదలైందనడానికి ఇదొక చిన్న ఉదాహరణ.

ఆ పరిస్థితి కేసీఆర్ స్వయంగా కొనితెచ్చుకున్నది. మోడీ మూడో పర్యాయం కూడా విజయం సాధించడం కష్టం అనే అంచనాతో ఆయన జాతీయ రాజకీయాలపై కన్నేశారు. కానీ, ఆ దిశగా ఆయన ప్రయోగించిన పాచికలేవీ సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఎన్డీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇళ్లకు వెళ్లి విందుభేటీలు జరిపినంత మాత్రాన.. మోడీ ప్రత్యామ్నాయ కూటమికి తాను సంధానకర్త కాగలనని ఆయన భ్రమపడ్డారు. వారందరూ చక్కటి విందుభోజనాలు.. తమతమ రాష్ట్రాల్లోని ప్రధాన హిందూ ఆలయాలలో కేసీఆర్ కుటుంబానికి రాజవైభవంతో దర్శన ఏర్పాట్లూ చేశారు తప్ప.. ఆయన రాజకీయ ప్రతిపాదనలకు తలొగ్గలేదు.

అప్పుడే కేసీఆర్ కు కొంత అవగాహన ఏర్పడి ఉండాల్సింది. అదేమీ అంత సులువు కాదని అర్థం చేసుకుని ఉండాల్సింది. తన వెంట వచ్చే వారు లేకపోయేసరికి.. ఆయన అలిగి, కూటమి ఏం ఖర్మ.. తానే జాతీయ పార్టీని ప్రారంభించేయాలని దూకుడు ప్రదర్శించారు. ఫలితం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నదే.

ఒక్క ఓటమితోనే ఎందుకిలా?

మామూలుగా అయితే.. ఒక్క ఓటమి ఎన్నడూ కూడా ఏ పార్టీ యొక్క పతనాన్నీ నిర్దేశించదు. భారతీయ జనతా పార్టీ ఎలాంటి దారుణమైన స్థితి నుంచి ఇప్పుడున్న స్థితికి వచ్చిందో మనం చూశాం. ప్రాంతీయ పార్టీలకు ఎగుడుదిగుడులు చాలా సహజంగా ఉంటుంటాయి. కానీ.. భారాస పరిస్థితి ఇప్పుడున్న తరహా వేరు. ఇప్పటిదాకా.. భారాస ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకోవడానికి.. ఆ రకంగా తమ ప్రధాన ప్రత్యర్థిని బలహీన పరచడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ ప్రారంభించలేదు. అంతమాత్రాన.. ఆపార్టీ చాలా దృఢంగా ఉన్నదని అనుకుంటే పొరబాటు.

ఇతరస్థాయిల్లో ఆ పార్టీని కాంగ్రెస్ నెమ్మదిగా బలహీన పరుస్తూ వస్తోంది. చాలా వరకు మునిసిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ వశం అయ్యాయి. ఒక ఎంపీ కూడా వారి జట్టులో చేరారు. ఎమ్మెల్యేలు చాలామంది టచ్ లో ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఏదో ఒకనాడు భారాస సౌధం ఒక్కసారిగా కుప్పకూలుతుందేమో అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.

ఎందుకంటే- కేసీఆర్ దానిని బలమైన పునాదుల మీద నిర్మించలేదు. డొల్ల పునాదులను తయారుచేశారు. నిజానికి తెలంగాణ సాధన అనే సింగిల్ ఎజెండాతో పోరాడిన పార్టీ గనుక వారి పునాది చాలా పటిష్టంగా ఉండి ఉండాల్సింది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమతో సమానంగా రాష్ట్రసాధన కోసం పోరాడిన చాలా మందిని ఆయన పక్కన పెట్టారు. ఆ రకంగా పునాదుల మీద జనంలో కాస్త అనుమానం పొడసూపి ఉండొచ్చు. అదే సమయంలో.. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నుంచి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకోవడం ద్వారా.. తన సొంత పార్టీ పునాదులను ఆయన కలుషితం చేసేశారు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకున్నప్పటికీ కూడా.. ఆయన ఏమీ సాధించలేకపోయారు. కాంగ్రెస్ బలహీనపడలేదు సరికదా.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి.. అధికారంలోకి కూడా వచ్చింది. 

వారసత్వంపై అత్యాశ చేటు చేసిందా?

భారాస రూపంలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడమూ.. అందుకోసం తెలంగాణ పార్టీకి పేరు మార్చడమూ మాత్రమే కాదు. జాతీయ రాజకీయాల్లో తమ భవితవ్యం ఎలా ఉంటుందో సరైన అంచనాకు రాకుండానే.. కొడుకును వారసత్వంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ఉత్సాహంతో కేసీఆర్ వడివడిగా అడుగులు వేశారు. పార్టీలో అంతర్గతంగా వారసత్వపు స్థానం కోసం ఉన్న పోరును ఆయన సమర్థంగానే తొక్కేశారు. కేటీఆర్ ను పార్టీలో ఎదురులేని స్థితికి తీసుకువచ్చారు.

డీఫ్యాక్టో ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రజలు అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది. పైగా కేసీఆర్ మంత్రులకు కూడా అందుబాటులో ఉండరని, మంత్రులందరూ కూడా.. కేటీఆర్ ను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారని.. ప్రజాబాహుళ్యంలోకి ప్రచారం బాగా జరిగింది. ఇదంతా ప్రజలకు కాస్త వెగటు పుట్టించింది. కొడుకును ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేసేసి.. జాతీయ రాజకీయాల్లో వీలైనంత మేర చక్రం తిప్పుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రిత్వానికీ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తూ కొడుకుకు పునాది పదిలంగా వేయాలని ఆయన అనుకున్నారు. స్కెచ్ బాగానే ఉంది. ఇతర రాష్ట్రాల్లో తమ బలం గురించి అంచనాలు వేసుకోలేదు. జాతీయ రాజకీయం ముసుగులో కేటీఆర్ కు పగ్గాలివ్వడమే ధ్యేయంగా చేసిన ప్రయత్నం వికటించింది. 

అవకాశవాదుల్ని చేరదీసిన ఫలితం!

ఇతర పార్టీల్ని బలహీన పరచడానికి అన్నట్టుగా అవకాశవాదులందరినీ కేసీఆర్ చేరదీశారు. తెలంగాణ ఏర్పడిన తొలిసారి మాత్రమే కాకుండా.. మలిపర్యాయం కూడా అధికారంలోకి రావడం ఆయనకు కలిసి వచ్చింది. ఇతర పార్టీలను ఖాళీ చేసేస్తున్నాం అనుకున్నారు.

కానీ.. ఆయన చెంతకు చేరిన అవకాశవాదులు.. ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం బాగా పార్టీని వాడుకున్నారు. బాగా సంపాదించుకున్నారు. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సామెత చందంగా.. ఓడిపోయిన వెంటనే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అవకాశవాదుల్ని చేరదీసిన ఫలితం ఆయనకు ఇవాళ కనిపిస్తోంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి పబ్బం గడుపుకునే వారందరూ ఇప్పుడు కేసీఆర్ కు దూరం అవుతున్నారు.

వ్యూహాత్మకంగా లేని ప్రతిపక్ష పాత్ర!

భారాస ప్రతిపక్షపాత్ర వ్యూహాత్మకంగా సాగడం లేదు. వారి అంచనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొరుకుడు పడడం లేదు. తొలినాటి నుంచి వారు కేవలం ఆరు హామీలమీదనే విరుచుకు పడుతున్నారు. అవి అమలు కావని.. రేవంత్ కు చేతకాదని.. ఎడాపెడా మాటలు సంధిస్తున్నారు.

అయితే.. అది సరైన వ్యూహం కాదని వారికి అర్థం కావడం లేదు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యేది లేదని ఎంత ఎక్కువగా అంటున్న కొద్దీ.. అంతగా వారు అంతగా పాయింట్ ఆఫ్ నో యూటర్న్ దిశగా వెళ్లిపోతున్నట్టు లెక్క. ఆరు గ్యారంటీలు అమలు చేయలేరు.. అని మాత్రమే చెబుతుండడం వల్ల.. అవి ఒక్కొక్కటిగా అమలైనా నెమ్మదిగా అమలైనా భారాస దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది. ఆరుగ్యారంటీల ఊసు కాకుండా.. పాలనలో వైఫల్యాలు వంటివి గమనించి పోరాడితే.. భారాసకైనా మనుగడ ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. 

ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..

కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ముందు గొయ్యి వెనుక నుయ్యి అనే చందంగా తయారైంది. పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చడం వల్ల దెబ్బతిన్నాం అని ఆయన కూడా ఈ పాటికి గ్రహించి ఉంటారు. అయితే ఇప్పుడు వెనక్కు వెళ్లడం సాధ్యం కాదు. తిరిగి పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చడం అనేది ఆత్మహత్యా సదృశం అవుతుంది. మడమ తిప్పిన కేసీఆర్ అని అందరూ గేలి చేస్తారు. ఇప్పుడు భారాస అనే పేరు ఆయనకు కూడా నచ్చకపోయినా సరే.. గత్యంతరం లేని స్థితిలో ఆ పేరును భరించాల్సిందే. తప్పదు. అలాగని జాతీయ రాజకీయాల్లో అయినా ఆయన దూకుడుగా దూసుకెళ్లగలరా అంటే సందేహమే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మునుపటిలా యాక్టివ్ రోల్ పోషించడం అనేదే సాధ్యం అయ్యేలా లేదు. ఇక జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఊహించలేం. రాష్ట్రం దాటి ఇతర ప్రాంతాల్లో రాజకీయం చేయడానికి బయల్దేరితే.. రాష్ట్రంలో పార్టీ ఇంకెంత దయనీయ స్థితికి దిగజారిపోతుందో అనే భయం వేరొకటి. ఇలాంటి సంకట స్థితిలో కేసీఆర్ మరియు ఆయన గులాబీ దళం ఉన్నారు.

ముందే చెప్పుకున్నట్టు.. ఒక్క విషయంలో తీసుకున్న పొరబాటు నిర్ణయం పార్టీని మొత్తంగా దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. క్రికెట్ ఆటలోలాగా దిద్దుకోలేని తప్పు జరిగిపోయింది. పార్టీ బౌల్డ్ అయింది. ఇంకో అవకాశం ఎలా వస్తుంది. ఎలా దొరకబుచ్చుకుంటారు? ఎప్పటికి? ఇలాంటివన్నీ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నలే.

..ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?