బాబుపై పేలిన జ‌’గ‌న్‌’!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబునాయుడిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో చెల‌రేగిపోతున్నారు. సామాన్య జ‌నానికి కూడా అర్థ‌మ‌య్యే రీతిలో బాబు నిజ స్వ‌రూపాన్ని కళ్ల‌కు క‌ట్టేలా మంచీచెడులు జ‌గ‌న్ వివ‌రిస్తున్నారు.…

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబునాయుడిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో చెల‌రేగిపోతున్నారు. సామాన్య జ‌నానికి కూడా అర్థ‌మ‌య్యే రీతిలో బాబు నిజ స్వ‌రూపాన్ని కళ్ల‌కు క‌ట్టేలా మంచీచెడులు జ‌గ‌న్ వివ‌రిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాప్తాడులో నిర్వ‌హించిన సిద్ధం మూడో స‌భ …ముందు జ‌రిగిన రెండు స‌భ‌ల‌కంటే రెట్టింపు స్థాయిలో స‌క్సెస్ అయ్యింది.

ఈ స‌భ  జ‌న స‌ముద్రాన్ని త‌ల‌పించింది. యుద్ధానికి మీరు సిద్ధ‌మా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించిన‌ప్పుడ‌ల్లా… జ‌నం పిడికిలి బిగించి సిద్ధ‌మంటూ స‌భా ప్రాంగ‌ణాన్ని హోరెత్తించారు. త‌న ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జానికానికి జ‌రిగిన మంచి గురించి వివ‌రిస్తూనే, మూడు ద‌శ‌ల్లో 14 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేసిన చంద్ర‌బాబునాయుడు, త‌న మార్క్ అంటూ ఫ‌లానా అని చెప్పుకోలేని దుర్మార్గ పాల‌న సాగించార‌ని విరుచుకుప‌డ్డారు.

రానున్న రోజుల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు ఎవ‌రెవ‌రి మ‌ధ్య అనే విష‌యాన్ని మేధావుల‌కే కాదు, సామాన్యుల‌కు కూడా అర్థ‌మ‌య్యే రీతిలో జ‌గ‌న్ వివ‌రించిన తీరు ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ ఎన్నిక‌లు కేవ‌లం ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ఎన్నుకునేందుకు మాత్ర‌మే కాద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ ఎన్నిక‌లు రెండు సిద్ధాంతాల మ‌ధ్య జ‌రుగుతున్న‌వ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఐదేళ్ల‌లో త‌న ప్ర‌భుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి.. ఈ ప‌థ‌కాల‌న్నీ ఇలాగే కొన‌సాగాల‌ని అడుగులు వేసే మ‌న‌కు, అటువైపు వ‌ద్ద‌ని అడ్డుకునే డ్రామాలాడుతున్న చంద్ర‌బాబుకు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంగా జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధ‌మా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌డం… జ‌నం నుంచి సిద్ధ‌మంటూ రెట్టించిన ఉత్సాహంతో రీసౌండ్ రావ‌డం విశేషం.

ఇంకా యుద్ధం ఎవ‌రెవ‌రి మ‌ధ్య జ‌రుగుతున్న‌దో జ‌గ‌న్ క‌వితాత్మ‌కంగా చెప్పారు. పేద‌లు, పెత్తందారుల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధానికి మీరు సిద్ధ‌మా? మాట నిల‌బెట్టుకున్న మ‌న‌కు, అటు వైపు మాట త‌ప్ప‌డ‌మే అలవాటుగా ఉన్న పెత్తందారుల‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. అలాగే విశ్వ‌స‌నీయ‌త‌కు, వంచ‌న‌కు, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్‌కు, ఇక్క‌డే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే మ‌న‌కు యుద్ధ‌మంటూ వైసీపీ శ్రేణుల్లో స‌మ‌రోత్సాహాన్ని నింప‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు.

14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబుకు జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. మీ పేరు చెబితే రైతులు, అక్క‌చెల్లెమ్మ‌ల‌కైనా, విద్యార్థుల‌కైనా, అవ్వాతాత‌ల‌కైనా… ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు గుర్తొచ్చే ఒక్క‌టంటే ఒక్క ప‌థ‌క‌మైనా వుందా? అని జ‌గ‌న్ నిల‌దీశారు. 1995, 1999, 2014ల‌లో ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబునాయుడు ఏనాడైనా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో క‌నీసం 10 శాతం అమ‌లు చేశారా? అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటు, మోసాలే అంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిపై విమ‌ర్శ‌ల తూటాలు జ‌”గ‌న్” పేల్చింది.