విశాఖ తూర్పులో యాదవులకు టికెట్ ఇవ్వొచ్చుగా?

యాదవులు అంటే తమకు అమితమైన ప్రేమాభిమానాలు అంటూ విశాఖ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా  పోటీ చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ఇదే అంటున్నారు. ఈ…

యాదవులు అంటే తమకు అమితమైన ప్రేమాభిమానాలు అంటూ విశాఖ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా  పోటీ చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ఇదే అంటున్నారు. ఈ ఇద్దరూ ఓసీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. బీసీలను వెలగపూడి తొక్కేశారు అని ఎంవీవీ ఆరోపిస్తే బీసీలను తొక్కేసింది మీరే అని వెలగపూడి ఫైర్ అవుతున్నారు.

యాదవులకు పెద్ద పీట వేసింది మేమంటే మేమే అని ఇద్దరు నేతలూ అంటున్నారు. రెండు పార్టీలలో తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది మాత్రం ఓసీలు. బీసీలు నూటికి తొంబై శాతం ఉన్న విశాఖ తూర్పులో బీసీ నేతకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అంటే రెండు పార్టీల జవాబు లేదు.

తనకు ఎంవీవీ టికెట్ రాకుండా అన్యాయం చేశారు అని ఆరోపిస్తున్న యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అయిన ఓసీని గెలిపిస్తాను అని అంటున్నారు. ఆయన జనసేనలో చేరారు. వైసీపీ బీసీలకు అన్యాయం చేస్తే జనసేన టికెట్ ఇచ్చి న్యాయం చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

వెలగపూడి ఎంవీవీల వెనక ఉన్న యాదవ నాయకులు ఆయా పార్టీలకు చెందిన నేతలు అయితే తమ నాయకులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. దీనిని చూసిన యాదవ సామాజిక వర్గం పెద్దలు యాదవులు బలంగా ఉన్న చోట టికెట్ సాధించకుండా ఇలా రాజకీయాల్లో రచ్చ చేసుకోవడమేంటి అని విస్తుబోతున్నారు.

యాదవులకు టికెట్ ఎప్పుడూ తూర్పులో ఏదో ఒక పార్టీ నుంచి అయినా దక్కుతోంది. 2009లో కాంగ్రెస్ ప్రజారాజ్యం టికెట్లు ఇచ్చాయి. 2014, 2019లలో వైసీపీ ఇచ్చింది. 2024లో మాత్రం ప్రధాన పార్టీలు ఓసీల కొమ్ము కాయడంతో తమకు బలమునా వీగిపోతున్నామని యాదవ సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.