బీజేపీపై పొత్తు సంగతి ఒకట్రెండు రోజుల్లో తేలనుంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. అయితే సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. బీజేపీతో పొత్తుపై ఏదో ఒకటి తెగితే, జనసేన సీట్లపై నిర్ణయం వెలువడుతుందనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో జనసేనకు రెబల్ గుబులు పట్టుకుంది.
ఉదాహరణకు జనసేనకు 30 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ ఇచ్చిందని అనుకుందాం. ప్రధానంగా ఎమ్మెల్యే సీట్లకు పోటీ వుంది. దీంతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆచితూచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోనే అభ్యర్థుల ఎంపికపై గొడవ మొదలైంది. ఇక జనసేనకు సీట్లు కేటాయిస్తే, టీడీపీ నేతలు సహకరిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఈ సందర్భంగా 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, చివరి నిమిషంలో టీడీపీ షాక్ ఇచ్చిన వైనాన్ని జనసేన నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. 2014లో పొత్తులో భాగంగా 13 అసెంబ్లీ సీట్లను బీజేపీకి టీడీపీ కేటాయించింది. బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో ఇచ్ఛాపురం, విశాఖపట్నం నార్త్, పాడేరు (ఎస్టీ), రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, కైకలూరు, నరసారావుపేట, నెల్లూరు, సంతనూతలపాడు (ఎస్సీ), మదనపల్లె, కడప, కోడుమూరు (ఎస్సీ) ఉన్నాయి.
వీటిలో నాలుగైదు చోట్ల తమ అభ్యర్థులను చంద్రబాబు బరిలో నిలిపారు. ఇచ్ఛాపురం, కడప, నెల్లూరు తదితర నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే… అక్కడ బీజేపీకి అంత సీన్ లేదని, అందుకే గెలుపు గుర్రాలైన తమ అభ్యర్థుల్నే నిలిపామని టీడీపీ ప్రకటించింది. రానున్న రోజుల్లో జనసేన విషయంలోనూ అదే రిపీట్ అవుతుందనే చర్చకు తెరలేచింది.
జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా, కనీసం 10-15 చోట్ల టీడీపీ తన అభ్యర్థుల్ని నిలపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జనసేనకు బలమైన అభ్యర్థులు లేరనే సాకు చూపి, ఎప్పట్లాగే టీడీపీ తన మార్క్ వెన్నుపోటు రాజకీయానికి తెరలేపుతుందని చెబుతున్నారు. టీడీపీ రెబల్ అభ్యర్థుల్ని నిలిపినా, జనసేన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వుంటుందని పలువురు అంటున్నారు.
టీడీపీతో పొత్తు ఇట్లే వుంటుందని చెప్పేవాళ్లే ఎక్కువ. ఉత్తి పుణ్యానికే జనసేనకు సీట్లు అప్పగించడానికి టీడీపీ సిద్ధంగా ఉండదనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ ప్రమాద పరిణామాలను జనసేన ముందే ఊహిస్తోంది. అందుకే సీట్ల కేటాయింపు కంటే, అక్కడి ఆశిస్తున్న టీడీపీ నేతల్ని ఏ మేరకు చంద్రబాబు కట్టడి చేస్తారనే విషయమై జనసేన ఆలోచిస్తోంది.