తేదేపాకు ఇటు జనసేన కావాలి, అటు భాజపా కావాలి. అలాగే జనసేనకు ఇటు తేదేపా కావాలి. అటు జనసేన కూడా కావాలి. భాజపాకు నిజానికి ఇద్దరు తోడు వున్నా లేకున్నా ఒకటే. కానీ భాజపా మాత్రం ఈ అనాసక్తిని కాస్త ఆసక్తిగా మార్చి పెద్ద గేమ్ ప్లాన్ ఆడుతోంది. ఈ గేమ్ ప్లాన్ లో ఎవరు నష్టపోబోతున్నారు అంటే అచ్చంగా.. పవన్ స్టార్.. పవన్ కళ్యాణ్ మాత్రమే.
భాజపాను కాదని తేదేపాతో వెళ్లడం పవన్ కు ఇష్టం లేదు. భాజపా తోడు లేకుంటే జగన్ ను కొట్టలేమో అన్న అనుమానం ఆయనకు వుంది. ఆయనను అన్ని విధాలా గైడ్ చేసే చంద్రబాబుకూ వుంది. ఈ సంగతి బాగా తెలిసింది ఎవరికి అంటే భాజపాకే.
నిజానికి భాజపాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు. పొత్తు వున్నా పొడిచేసేది లేదు. బాబు, జగన్ ఎవరు గెలిచినా మోడీ ముందు మోకరిల్లాల్సిందే. కానీ ఆంధ్రలో కాస్తయినా భాజపా ఉనికిని నిలెబట్టాలి. అదీ అసలు సిసలు గేమ్ ప్లాన్. అందుకే రమ్మని కబురు చేసింది బాబుకే. ఎందుకంటే జగన్ బయట నుంచి ఎన్ని మద్దతులు అయినా ఇస్తారు కానీ ఎన్ డి ఎ లో చేరరు. ఇక మిగిలిన ఆప్షన్ బాబు పార్టీ తెలుగుదేశమే. కాంగ్రెస్ కు ఏ రాష్ట్రంలో కూడా చిన్న పాటి పొత్తు లేకుండా చేయాలన్న ప్రణాళిక అమలులో భాగంగా బాబుకు పిలుపు వచ్చింది.
దాని కోసమే చూస్తున్న చంద్రబాబు ఎగిరి గంతేసారు. అంతే అక్కడే భాజపా తాళం వేసేసింది. కనీసం పాతిక ఎమ్మెల్యే సీట్లు, దానికి అనుగుణంగా ఎంపీ సీట్లు ఇస్తే తప్ప పొత్తు కుదరదు అనే మంత్రం వేసింది. నిజానికి అది అసాధ్యం అని భాజపాకు తెలుసు. ఆ రేంజ్ లో బేరం మొదలుపెడితే కనీసం 10 సీట్లు అన్నా వస్తాయి కదా అన్నది ప్లాన్.
ఎంపీ సీట్లతో సమస్య లేదు. ఎన్ని కావాలంటే అన్నీ ఇవ్వడానికి బాబు రెడీ. ఎందుకుంటే మోడీ హయాంలో ఎంపీ పదవి అన్నది కేవలం అలంకార ప్రాయం అయిపోయింది. అలాంటి దాని కోసం ఓ యాభై, అరవై కోట్లు ఖర్చు చేయడం అన్నది పిచ్చి పని అని చాలా మంది రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
మొత్తానికి భాజపా గేలానికి తేదేపా-జనసేన రెండూ చిక్కాయి. ఇప్పుడు పొత్తును వికటించేలా చేసుకోలేరు. అలా అని చంద్రబాబు తక్కువ తినలేదు. ఆయన లెక్కలు ఆయనకు వున్నాయి. 145 నుంచి 150 సీట్లలో పోటీ చేయాలన్నది బాబు ప్లాన్. ఆ పై పాతిక-ముఫై సీట్లు ఇవ్వడానికి రెడీ అది జనసేనకు అయినా, భాజపాకు అయినా, లేదా ఆ రెండింటికి కలిపి అయినా.
భాజపా లొంగదు. కనీసంలో కనీసం ఏడెనిమిది సీట్లు దగ్గర భీష్మించుకు కూర్చుంటుంది. ఎంపీలుగా తేదేపా అనుకూల మైన భాజపా నేత పురందేశ్వరి లాంటి వాళ్లు వున్నారు. పార్టీ మారితే రఘురామ కృష్ణం రాజు వుండనే వున్నారు. అందువల్ల ఇప్పుడు ఏతా వాతా ఏం చేయాలి అంటే జనసేనకు ఇవ్వదలిచిన వాటిలో కోత పెట్టాలి.
పవన్ 32 అడిగారని, 24 ఇస్తామనన్నారని, కావాలంటే మరో రెండు అదనం అని గ్యాసిప్ లు బయటకు వదిలారు. ఇప్పుడు భాజపాకు ఆరేడు ఇస్తే పవన్ పార్టీకి ఇచ్చేది పాతిక సీట్లు మించవు. ఏమైనా సరే 32 సీట్లకు మించి చంద్రబాబు రిస్క్ చేయరు. అందువల్ల ఒప్పుకు తీరాల్సింది, కేడర్ ను ఒప్పించాల్సింది పవన్ నే. ఎలా ఒప్పిస్తారో? ఏం చేస్తారో? యాభై సీట్లు పాయె.. నలభై లేదాయె.. ముఫై అయిదు.. ముఫై.. ఇప్పుడు పాతికకు వచ్చేలా వుంది వ్యవహారం చూస్తుంటే.