జ‌గ‌న్ మ్యానిఫెస్టోపై ప్ర‌తిప‌క్షాల్లో టెన్ష‌న్‌!

ఏ రాజ‌కీయ పార్టీ విజ‌యంలోనైనా మ్యానిఫెస్టో కీల‌క పాత్ర పోషిస్తుంది. 2014లో టీడీపీ, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి ఆ పార్టీల హామీలే ప్ర‌ధానం. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చడంలో…

ఏ రాజ‌కీయ పార్టీ విజ‌యంలోనైనా మ్యానిఫెస్టో కీల‌క పాత్ర పోషిస్తుంది. 2014లో టీడీపీ, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి ఆ పార్టీల హామీలే ప్ర‌ధానం. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చడంలో విశ్వ‌సనీయ‌త అనేది అత్యంత ముఖ్య‌మైంది. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాభిమానాన్ని చూర‌గొన్నారు. చంద్ర‌బాబు మాత్రం ఎప్ప‌ట్లాగే ప్ర‌జ‌ల‌ను వంచించార‌న్న చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకున్నారు.

అలాగ‌ని వైఎస్ జ‌గ‌న్ వంద‌శాతం త‌న హామీల‌ను నెర‌వేర్చ‌లేదు. మ‌ద్య‌పాన నిషేధం, సీపీఎస్ ర‌ద్దు, ప్ర‌త్యేక హోదా సాధ‌న త‌దిత‌ర అంశాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌చ్చ తేచ్చేవే. అయితే మెజార్టీ హామీల‌ను నెర‌వేర్చ‌డంలో మాత్రం జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. అందుకే జ‌గ‌న్ చెబితే, సాధ్య‌మైనంత వ‌ర‌కు నెర‌వేరుస్తార‌నే న‌మ్మ‌కాన్ని సామాన్య ప్ర‌జ‌ల్లో సంపాదించుకున్నారు. చంద్ర‌బాబు త‌న పాల‌న‌లో ఫెయిల్యూర్ అయ్యింది కూడా ఇక్క‌డే.

ముఖ్యంగా రైతుల రుణ‌మాఫీ, బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్టిన బంగారు ఇంటికి తెప్పించ‌డంలో చంద్ర‌బాబు అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. అలాగే యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు, వారికి నిరుద్యోగ భృతి ఇవ్వ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దారుణ‌మైన వంచ‌న‌కు పాల్ప‌డింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాన‌ని చెప్పి, తీరా ఎన్నిల‌క స‌మ‌యంలో ప‌సుపు, కుంకుమ కింద రూ.10 వేల‌తో త‌న మోసాన్ని మ‌రిపించొచ్చ‌ని ఎత్తుగ‌డ వేశారు.

అయితే ప్ర‌జ‌లు చాలా తెలివిప‌రులు. ఎవ‌రి పాల‌న ఎలా వుందో ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషించుకుంటుంటారు. ఎన్నిక‌ల రోజు త‌మ నిర్ణ‌యాన్ని ఈవీఎంల‌లో చూపుతుంటారు. ఇప్పుడు మ‌రోసారి త‌మ తీర్పు వెలువ‌రించ‌డానికి ప్ర‌జానీకం సిద్ధంగా వుంది. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాల కంటే, ఏమిస్తారో అని ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. 2019లో త‌న‌కు అధికారం ఇస్తే, న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసి, ప్ర‌తి ఇంటికి ల‌క్ష‌లాది రూపాయ‌లు ల‌బ్ధి క‌లిగిస్తాన‌ని జ‌గ‌న్ హామీలిచ్చారు.

జ‌గ‌న్‌కు అధికారం ద‌క్కింది. అందుకు ప్ర‌తిఫ‌లంగా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ల‌క్ష‌లాది రూపాయ‌లు ల‌బ్ధి చేకూర్చారు. ఈ ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ ఎలాంటి మాస్ట‌ర్ ప్లాన్ వేస్తారో అనే అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ నిర్వ‌హించే రాప్తాడు స‌భ‌లో వైసీపీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ప్ర‌క‌టించ‌నుంది. సీఎం జ‌గ‌న్ ఇచ్చే హామీల‌పై ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షాల్లో టెన్ష‌న్ నెల‌కుంది.

ముఖ్యంగా జ‌గ‌న్ రైతు రుణ‌మాఫీ ప్ర‌క‌టిస్తే మాత్రం ఎన్ని పార్టీలు కలిసినా, వైసీపీ విజ‌యాన్ని అడ్డుకోలేర‌నే ప్ర‌చారం బ‌లంగా ఉంది. ఇప్ప‌టికే టీడీపీ సూప‌ర్ సిక్స్ అంటూ వైసీపీ, కాంగ్రెస్ సంక్షేమ ప‌థ‌కాల‌ను క‌లిపి త‌న ప‌థ‌కాలుగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వీటికి పెద్ద‌గా జ‌నాద‌ర‌ణ కూడా క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ చెబితే చేస్తాడ‌నే న‌మ్మ‌కం వుండ‌డం వ‌ల్ల, రైతు రుణ‌మాఫీ ప్ర‌క‌టిస్తే మాత్రం ఏపీ రాజ‌కీయం పూర్తిగా వైసీపీ వైపు ట‌ర్న్ అవుతుంద‌న‌డంలో సందేహం లేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.