సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకూ ప్రకటించింది. అలా ప్రకటించిన వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఆ వెంటనే మార్పులు చేసింది. కొత్త ఇన్ చార్జిలుగా నియమితం అయిన వారికి దాదాపుగా అభ్యర్థిత్వాలు ఖరారు అనే అభిప్రాయాలే సర్వత్రా ఉన్నాయి. అలా ఇన్ చార్జిలుగా నియమితం అయిన వారిలో చాలా మంది ఇప్పటికే ప్రచార పర్వాన్ని కూడా మొదలుపెట్టేశారు. నియోజకవర్గంలో తిరుగుతూ వారు పాత పరిచయాలకు పదును పెట్టుకుంటున్నారు!
ఆ సంగతలా ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పుల పర్వం ముగిసినట్టేనా అనేది ఆసక్తిదాయకంగా మారింది. 175 అసెంబ్లీ నియోకవర్గాల్లో గత ఎన్నికల్లో ఈ పార్టీ 151 సీట్లను నెగ్గింది. అలా సిట్టింగులు ఉన్న చోటే ఇప్పటి వరకూ ప్రధానంగా జరిగాయి. 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 61 సీట్లకు మార్పుచేర్పులు జరిగాయి. అంటే మిగిలింది 90 అసెంబ్లీ నియోజకవర్గాలు.
ఇవిగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గత ఎన్నికల్లో ఓటమి పాలైన సీట్లు 24 ఉన్నాయి. వాటిల్లో రెండు మూడు చోట్ల గెలిచిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో మార్పులు లేవని స్పష్టం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలైన చోట్లకు సంబంధించి ఇన్ చార్జిల మార్పు పెద్దగా లేదు. బహుశా ఐదేళ్లుగా ఇన్ చార్జి హోదాలో కొనసాగుతున్న వారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఖరారు చేయవచ్చు.
అలాగే సుమారు 90 మంది సిట్టింగుల మార్పుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రస్తావన లేదు. దాదాపు అరవై చోట్ల మార్పులు చేసినా.. 90 చోట్ల మార్పుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నింపాదిగా ఉండటం గమనార్హం. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 90 సీట్లలో విజయం సొంతం చేసుకోవాలి! సరిగ్గా అలాంటి నంబర్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీలో ఈ స్థాయిలో మార్పుచేర్పులు మామూలు విషయం కాదు. అటుఇటుగా యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పలువురు ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది. ఇది తెలుగు రాజకీయాలకు పూర్తి కొత్త. ఈ స్థాయిలో ప్రయోగాలు చేసిన పార్టీ చరిత్రలో లేదు ఏపీలో! సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలుగు రాజకీయాల్లో చాలా విలువ ఉంటుంది!
ఒక్కసారి గెలిచిన వారు కూడా ఆ తర్వాత నియోజకవర్గంలో పెద్ద నేతలుగా చలామణి అయిన దాఖలాలు బోలెడు. రెండోసారి వారికి టికెట్ ను నిరాకరించడం అంటే మాటలు కాదు. ఒకవేళ అలాంటి సందర్భాలు వస్తే.. అలాంటి వారు మరో ఆలోచన లేకుండా ఇండిపెండెంట్ లుగా రంగంలోకి దిగేవారు. కాంగ్రెస్, తెలుగుదేశం రాజకీయాల్లో అలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ఖాతరు చేయకుండా 50 మందికి పైగా సిట్టింగులను ఇప్పుడు ఇంట్లో కూర్చోబెడుతోంది.
ఇప్పటి వరకూ అభ్యర్థుల ప్రకటనలో పేర్లు లేని నియోజకవర్గాల విషయంలో ఇప్పుడు సిట్టింగులకు సీట్లు ఖరారే అనే భావన నెమ్మదిగా బలపడుతోంది. ఇప్పటి వరకూ మార్పు జరగలేదంటే ఇక మార్పు ఉండదని, ఇంక ఎంచక్కా ప్రచారం ప్రారంభించుకోవచ్చని పలువురు సిట్టింగులు ఇప్పటికే బయల్దేరారు. కొందరు సీనియర్లు, ఒకే నియోజకవర్గం నుంచి వరసగా రెండు మూడు సార్లు గెలిచిన వారు కూడా ఈ ధీమాతో కనిపిస్తూ ఉన్నారు. మార్పులు ముగిసినట్టేనని, ఇక ధీమాగా పని చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఈ మేరకు పలు చోట్ల ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. అధిష్టానం నుంచి తమకు అంతర్గతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మాట వారి నుంచి వినిపిస్తోంది.