చంద్ర‌ధ‌ర్మంః సీమ‌లో గెల‌వ‌లేని సీట్ల‌న్నీ మిత్రుల‌కే!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పొత్తుల విష‌యంలో చేసే రాజ‌కీయం ఎలా ఉంటుందో చ‌రిత్ర‌కు తెలుసు! చంద్ర‌బాబుతో పొత్తు అంటే అది దృత‌రాష్ట్ర కౌగిలి అని ఆయ‌న గ‌త మిత్రులు ఎవ్వ‌రిని అడిగినా చెబుతారు!…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పొత్తుల విష‌యంలో చేసే రాజ‌కీయం ఎలా ఉంటుందో చ‌రిత్ర‌కు తెలుసు! చంద్ర‌బాబుతో పొత్తు అంటే అది దృత‌రాష్ట్ర కౌగిలి అని ఆయ‌న గ‌త మిత్రులు ఎవ్వ‌రిని అడిగినా చెబుతారు! ఈ విష‌యం కేసీఆర్ కు అనుభ‌వం, క‌మ్యూనిస్టుల‌కు తెలుసు, బీజేపీకి కూడా తెలుసు! మ‌రి అన్నీ తెలిసిన బీజేపీ ఇప్పుడు చంద్ర‌బాబుతో ఏ స్థాయిలో బేరం పెడుతుంద‌నేది ప్ర‌స్తుతానికి మిస్ట‌రీ!

ఇప్పుడు చంద్ర‌బాబు సై అంటే క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు పొత్తుకు సై అంటాయి. ఆ పార్టీలకు ఎలాగూ దిక్కులేదు! కాబ‌ట్టి చంద్ర‌బాబు ఎంత ముష్టి విసిరినా అదే వాటికి ప‌ర‌మాన్నం! చంద్ర‌బాబు ఓకే చెప్పాలి కానీ.. ఆ పార్టీలు ఒక‌టీ రెండు సీట్లు కేటాయించినా.. జై తెలుగుదేశం అనే ప‌రిస్థితుల్లో ఉన్నాయి!

అయితే చంద్ర‌బాబుకు ఇప్ప‌డు క‌మ్యూనిస్టుల మీద‌, కాంగ్రెస్ మీద ఆస‌క్తి లేన‌ట్టుగా ఉంది. ఆయ‌న చూపు ఇప్పుడు క‌మ‌లం పార్టీ మీద ఉంది!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఒక‌వేళ బీజేపీ, జ‌న‌సేన‌లు పూర్తిగా చంద్ర‌బాబు చెప్పిన ష‌ర‌తుల‌కు లోబ‌డి పొత్తుకు ఓకే అని చెప్పినా.. చంద్ర‌బాబు నాయుడు వారికి ఏ సీట్లు కేటాయిస్తార‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఏరికోరి చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ ఎక్క‌డైతే గెలిచే అవ‌కాశం లేదో వాటినే మిత్ర‌ప‌క్షాల‌కు కేటాయిస్తార‌నేది తేలిక‌గా అర్థ‌మ‌య్యే విష‌యం.

తెలుగుదేశం పార్టీకి ఠికానా లేని, గెలుపుకు ఏ మాత్రం అవ‌కాశం లేని.. చోట్ల చంద్ర‌బాబు నాయుడు త‌న మిత్ర‌ప‌క్షాల‌కు అవ‌కాశం ఇస్తారు. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో చంద్ర‌బాబు నాయుడు కేటాయింపులు పూర్తిగా త‌న పార్టీకి విజ‌య‌వాకాశాలు ఏమాత్రం లేనివే ఉంటాయి. వీటిని చంద్ర‌బాబు నాయుడు ధైర్యంగా మిత్ర‌ప‌క్షాల‌కు కేటాయిస్తారు!

రాజంపేట ఎంపీ సీటు.. ఇది త్యాగం జాబితాలో ముందు ఉంటుంది! గ‌తంలో కూడా బీజేపీకి కేటాయించారు ఈ సీటును. ఇక్క‌డ నుంచి పురందేశ్వ‌రి బీజేపీ త‌ర‌ఫు నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. మోడీ గాల్లో కూడా ల‌క్ష‌ల ఓట్ల తేడాతో ఆమె ఓట‌మి పాల‌య్యారు  తెలుగుదేశం మద్ద‌తుతో! ఇప్పుడు కూడా ఈ సీట‌ను క‌చ్చితంగా చంద్ర‌బాబు నాయుడు త‌న మిత్ర‌ప‌క్షాల‌కు త్యాగం చేస్తార‌ని స్ప‌ష్టం అవుతోంది.

అలాగే క‌దిరి అసెంబ్లీ నియోక‌వ‌ర్గం. ఈ సీటు కూడా చంద్ర‌బాబు నాయుడు బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఉచితంగా ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్ర‌మంతా తెలుగుదేశం గాలి వీచిన క‌దిరిలో టీడీపీ గెల‌వ‌లేదు. ఈ అనుభ‌వాల నేప‌థ్యంలో క‌దిరిని చంద్ర‌బాబు నాయుడు మిత్రుల‌కే ఇవ్వ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు! క‌ర్నూలు, క‌డ‌ప, చిత్తూరు జిల్లాల్లో కూడా త‌మ‌కు విజ‌యావ‌కాశాలు ఏ మాత్రం లేని వాటిని ఎంపిక చేసి చంద్ర‌బాబు నాయుడు మిత్రుల‌కు కేటాయిస్తార‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

ఒక‌వేళ ఎక్క‌డైనా ఒక‌టీ రెండు చోట్ల మిత్ర‌ప‌క్షాల కోరిక‌ను మ‌న్నించినా అది కాసేపే కావొచ్చు! మొద‌ట మిత్రుల‌కు సీట్ల‌ను కేటాయించిన‌ట్టుగా ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆ త‌ర్వాత అక్క‌డ టీడీపీ రెబ‌ల్ పోటీకి దిగ‌డం, చివ‌ర‌కు ఆ రెబ‌ల్ అభ్య‌ర్థికి టీడీపీ బీఫారాన్ని ఇచ్చి.. అధికారికంగా పోటీ చేయించ‌డం.. అదేమంటే మీరు అక్క‌డ గెల‌వ‌లేరు అందుకే అన్న‌ట్టుగా మిత్రుల‌కు త‌న త‌త్వాన్ని రుచి చూప‌డం చంద్ర‌బాబు కొత్త కాదు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే కేవ‌లం జ‌గ‌న్ ను దించాల‌నే అహంభావ‌క ధోర‌ణితో మాత్ర‌మే ఉన్నారు కాబ‌ట్టి చంద్ర‌బాబు ఏం చూపించినా అది రుచిగానే ఉంటుంది, ఆయ‌న‌కు అంత‌కు మించిన సీన్ లేదు. ఎటొచ్చీ బీజేపీ ఇప్పుడు య‌థారీతిన చంద్ర‌బాబు రాజ‌కీయానికి మ‌రోసారి బ‌ల‌వుతుందా, లేక వెన్నెముక‌తో నిల‌బ‌డుతుందో!