తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేరులోనే చంద్రుడున్నాడు. ఈ చంద్రుడు ఆ చంద్రుడిలానే స్వయం ప్రకాశకుడు కాదు! సొంతంగా ఏనాడూ చంద్రబాబు నాయుడు అధికారాన్ని సంపాదించుకున్న నేపథ్యాన్ని కలిగి లేరు! ఆ విషయం ఆయనకు కూడా తెలుసు! అందుకే ఎప్పుడూ వాళ్లనూ వీళ్లను పట్టుకుని తను గద్దెనెక్కాలనే తత్వంతో తన 40 యేళ్ల రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సొంతంగా పోటీ చేశారో అప్పుడు చిత్తయ్యారు. అది కూడా సొంతంగా పోటీ చేసింది 2019లో ఒక్కసారే! అధికారం చేతిలో ఉంచుకుని ఎన్నికలకు వెళితే అప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయి ఓటమిని ఎదుర్కొంది. చిత్తయ్యింది. ఈ అనుభవాలతో చంద్రబాబు నాయుడు అతి సమీపంలోని ఎన్నికలను ఎదుర్కొనడానికి పొత్తులను కూడగట్టడంలో కష్టపడుతున్నారు. అయితే ఒకవైపు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఎత్తులు ఇంకా తేలకపోవడం గమనార్హం!
ఏప్రిల్ రెండో వారంలో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ఉండవచ్చు. మరి ఇప్పుడు ఫిబ్రవరి మూడో వారం నడుస్తోంది. గట్టిగా పోలింగ్ కు మిగిలింది ఆరేడు వారాలు మాత్రమే! ఇలాంటి నేపథ్యంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా పొత్తులనే తేల్చుకోలేకపోతోంది. ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది, బీజేపీ- జనసేనలకు ఏ సీట్లు కేటాయిస్తుందో క్లారిటీ లేదు! ఈ క్లారిటీ ఎప్పటికి వస్తుందో కూడా ఎవ్వరికీ తెలీదు! చివరకు చంద్రబాబు కూడా ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఉందో లేదో మరి! ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాల్ ను బీజేపీ కోర్టులోకి నెట్టారు.
తనే పొత్తు కావాలనే ప్రతిపాదనలను పంపడంతో.. బీజేపీకి మంచి అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నారు. ఆ పార్టీ ఆచితూచి స్పందించినా, లేదా భారీ స్థాయిలో సీట్లను డిమాండ్ చేసినా.. నష్టం మాత్రం తెలుగుదేశం పార్టీకే అని వేరే చెప్పనక్కర్లేదు!ఒకవేళ బీజేపీ కోరినన్ని సీట్లను ఇవ్వకుండా తను చేసిన పొత్తు ప్రతిపాదనను తనే వెనక్కు తీసుకుంటే చంద్రబాబు నాయుడు కమలం పార్టీతో కోరి కొత్త వైరం పెట్టుకున్నట్టే! గతంలోనే బీజేపీతో సున్నం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ కోరినన్ని సీట్లను ఇవ్వకపోతే మాత్రం ఆ పార్టీ చంద్రబాబుకు చుక్కలు చూపవచ్చు! ఎందుకంటే ఎలాగూ కేంద్రంలో వచ్చేసారి కూడా కమలం పార్టీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలే ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో బీజేపీతో ఆటలంటే మాటలు కాదు! ప్రత్యేకించి ఇప్పటికే కేసుల ఉచ్చుల చిక్కుకున్న చంద్రబాబుకు. కాబట్టి బీజేపీ కోరినన్ని సీట్లను కేటాయించి అది చెప్పినట్టుగా చేయడమే తప్ప చంద్రబాబుకు మరో మార్గం లేదు! ఒకవేళ పొత్తు అంటూ బీజేపీ పంచకు చంద్రబాబు నాయుడు చేరకుండా ఉండి ఉంటే అదో లెక్క! అయితే చంద్రబాబే ఈ ప్రతిపాదనలను పదే పదే పంపాడు కాబట్టి..బీజేపీ ఏదో గట్టి ప్రతిపాదన చేసింది కాబట్టి.. చంద్రబాబు ఇప్పుడు కిక్కురుమనే పరిస్థితుల్లో లేరు!
ఇక జనసేనను ఎలాగూ చంద్రబాబు నాయుడు మడతపెట్టుకోగలరు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించడం, ఎక్కడ కేటాయించడం, జనసేన తరఫున ఎవరిని అభ్యర్థులుగా నిలపడం అంతా చంద్రబాబు చిత్తానికే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన విషయంలో చంద్రబాబుకు టెన్షన్ లేదు! ఒకవేళ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లిపోయి ఉంటే.. ఈ పాటికి సీట్ల లెక్కలు కూడా తేల్చుకునే వారు చంద్రబాబు అయితే బీజేపీ కోర్టులోకి బంతి వేసి చంద్రబాబు నాయుడు చేజేతులారా చిత్తయ్యే పరిస్థితిని తెచ్చుకున్నట్టుగా ఉన్నారు!
చంద్రబాబు నాయుడు ఘనంగా చెప్పుకునే 14 సంవత్సరాల సీఎం పదవి ఆయనకు దక్కింది పొత్తుల వల్లనే! తొలిసారి సీఎం అయ్యింది ఎన్టీఆర్ ను ప్రజలు ఎన్నుకుంటే ఈయన సీఎం అయ్యారు. రెండోసారి కార్గిల్ యుద్ద విజయంతో కమలం పార్టీకి ఉన్న ఊపు కలిసి వచ్చింది. 2014లో మోడీ గాలి చంద్రబాబు పాలిట సానుకూలంగా మారి ఒకటిన్నర శాతం ఓట్ల విజయంతో అధికారం దక్కింది!
ఇలాంటి విజయాలే ఉన్నాయి చంద్రబాబు ఖాతాలో! అయితే ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు గాలి లేకపోతే అప్పుడు అపజయాలే తప్పలేదు. 2004లో కమలం పార్టీ గాలి లేకపోవడం, 2009లో కమ్యూనిస్టులు, కేసీఆర్ ను ప్రజలు ఖాతరు చేయకపోవడంతో చంద్రబాబు చిత్తయ్యారు. మరి ఇప్పుడు పొత్తుల చిచ్చులో ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు చిత్తవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.