రాజకీయ స్నేహాలు కనీసం కొంత కాలమైనా పదిలంగా ఉంటాయి. తమను తాము స్నేహితులుగానే ప్రకటించుకుంటూ.. స్నేహధర్మం నిరూపణ అయ్యేలా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించకుండా ఉండేవాళ్లూ ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు కలిసినట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తారు. కానీ, మరో ఎన్నికల సమయానికి స్నేహం అవసరం లేదని బయటకు గెంటేస్తారు. ఇలా రకరకాల రూపాల్లో నడుస్తూ ఉంటే గనుక.. దానిని స్నేహధర్మం అని కాదు, అవకాశవాదం అని అనాలి. ఇప్పుడు తెలంగాణ కమల రాజకీయంలో అదే కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ తనను తాను ఎన్డీయేలో భాగస్వామిగా ప్రకటించుకుంటారు. కానీ తెలంగాణలో ఎన్నడూ బిజెపితో కలిసి ఆయన సింగిల్ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. బిజెపి కూడా జనసేనను అంటరాని పార్టీలాగా దూరం పెట్టింది. ఆ పొత్తులు ఏపీ వరకే పరిమితం అని కమలనాయకులు తెలంగాణలో చాలా సందర్భాల్లో ప్రకటించారు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి హఠాత్తుగా వారికి పొత్తులు గుర్తొచ్చాయి. పవన్ తో కలిసి పోటీచేశారు. ఆయనకు ఎనిమిది సీట్లు కేటాయించారు. తమ పార్టీకోసం కొన్నిచోట్ల ప్రచారం చేయించుకున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ ను ఇప్పుడు వాళ్లు పొత్తు ధర్మం నుంచి బయటకు గెంటేస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగా మాత్రమే పోటీచేస్తుందని, ఎవ్వరితోనూ పొత్తులు ఉండబోవని వారు ప్రకటించేవారు. ఈ మేరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చెప్పారు.
పవన్ తో పొత్తుల వలన పార్టీకి ఒరిగిన ప్రయోజనం సున్నా అని కమలనాయకులు చాలా తొందరగానే గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ వలన తమకు పెద్దగా ఉపయోగం లేకపోగా.. జనసేన కూడా వారికి కేటాయించిన 8 సీట్లలో కనీసం ఒక్కచోటనైనా డిపాజిట్ కూడా తెచ్చుకోలేకుండా చతికిలపడడం వారికి మరింత చులకన భావాన్ని పుట్టించినట్టుంది.
పవన్ ప్రచారం చేస్తే ఏదో జరిగిపోతుందనే భానవ కూడా తొలగిపోయింది. ఆయనతో పొత్తు పెట్టుకుంటే.. కనీసం ఒక్క సీటు అయినా కేటాయించాల్సి వస్తుంది. ఒక్కటి కేటాయించినా కూడా దానిని చేజేతులా చెడగొట్టుకున్నట్టే అని తెలంగాణ బిజెపి భావిస్తోంది. అందుకే ఆయనతో దోస్తీకి రాం రాం చెప్పాలని భావిస్తున్నారు.
అదే సమయంలో, ఏపీలో పవన్ మీద వారికి ఏమాత్రం నమ్మకం, గౌరవం ఉన్నదో ఇంకా తేలడం లేదు. తాను ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాను.. అనే కనీస ధర్మాన్ని పట్టించుకోకుండా.. తనంతట తాను తెలుగుదేశంతో బంధం కలిపేసుకున్నారు. ఇప్పుడు బిజెపి కూడా అదే జట్టులోకి రావాలని వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ యూజ్ లెస్ అని గుర్తించిన బిజెపి ఏపీలో మాత్రం ఆయన స్కెచ్ కు తగ్గట్టుగా జట్టులోకి వెళ్లే నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాలి.