మళ్లీ గెలిచే వ్యూహంపై ఇప్పుడే కసరత్తు!

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా సహజం. కానీ.. అంతే ఈజీగా.. ముఖ్యమంత్రిగా తాను కూటములు మార్చేస్తూ దేశవ్యాప్తంగా సదా చర్చల్లో ఉండే నాయకుడు…

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా సహజం. కానీ.. అంతే ఈజీగా.. ముఖ్యమంత్రిగా తాను కూటములు మార్చేస్తూ దేశవ్యాప్తంగా సదా చర్చల్లో ఉండే నాయకుడు నితీశ్ కుమార్. తనకు అండగా ఏ కూటమి ఉన్నా పరవాలేదు.. ముఖ్యమంత్రిగా తాను ఉండడమే ముఖ్యం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో దూసుకుపోతూఉండే నేత ఆయన. తాజాగా కమలం కూటమిలో ఉన్న నితీశ్, ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన ప్రారంభించారు. ఒక నిర్దిష్టమైన స్కెచ్ ప్రకారం ఆయన ముందుకు వెళుతున్నారు.

బీహార్ రాజకీయ ఎప్పుడూ రసకందాయంలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి నితీశే అంతటికీ కేంద్ర బిందువు. గత ఎన్నికల్లో భాజపా పొత్తులతో గెలిచి.. భాజపాకు మెజారిటీ సీట్లు వచ్చినా కూడా.. నితీశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. కొన్నాళ్లకే ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసి.. లాలూప్రసాద్ కుచెందిన ఆర్జేడీతో చేతులు కలిపారు. లాలూ కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి.. ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

అప్పటినుంచి మోడీ వ్యతిరేక పార్టీలకు నితీశ్ తాను కూడా ఒక పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇండియా కూటమి ప్రాణం పోసుకోవడానికి ఆయన ప్రధానమైన కారకుడిగా నిలిచారు. రాజీవ్ ని ప్రధాని చేయాల్సిన బాధ్యత అందరిమీద ఉన్నదని పదేపదే ప్రకటించారు. మోడీకి వ్యతిరేకంగా బలమైన దళాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పార్టీల నాయకుల వద్దకు తాను స్వయంగా తిరిగారు. మొత్తానికి ఇండియా కూటమి ఏర్పడింది. ఇంకా వారి మధ్య సర్దుబాటు చర్చలు కూడా ప్రారంభం కాకముందే ఆయన ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆర్జేడీ ఆయన మీద నిప్పులు చెరుగుతోంది.

నితీశ్ ఈ రకంగా తాను ముఖ్యమంత్రిగా కలకాలం ఉండడానికి కూటముల్ని మార్చేస్తూ ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతి. ఆ రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆర్జేడీ ప్రధానంగా ఆ అంశం మీదనే ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టవచ్చు. అందుకేనేమో నితీశ్ ముందే జాగ్రత్త పడుతున్నారు. మొన్నటిదాకా ఉన్న తన ప్రభుత్వంలో ఆర్జేడీ తరఫున మంత్రులుగా పనిచేసిన వారిపై ఇప్పుడు విచారణ ప్రారంభిస్తున్నారు. ఆర్జేడీ కి చెందిన మంత్రులు నిర్వహించిన శాఖల్లో  అవినీతి జరిగిందిట. అందుకని అప్పటి మంత్రులు తీసుకున్న నిర్ణయాలమీద ఇప్పుడు సమీక్ష జరపబోతున్నారట.

ఇలా మంత్రిగా నిర్ణయాలపై సమీక్షను ఎదుర్కోబోతున్న వారిలో అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ఈ విషయం ఆయనే ప్రకటించారు. ఇలాంటి సమీక్షల ద్వారా.. ఆర్జేడీ మంత్రులందరూ అవినీతిపరులు అని ముద్ర వేసేస్తే.. తన ప్రభుత్వం మీద ఆ పార్టీ చేసే ఆరోపణలకు ప్రజల్లో విలువ ఉండదని నితీశ్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కూటములను మార్చడమే కాదు.. నితీశ్ ఎత్తుగడలు కూడా బాగానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.