నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ 'సిద్ధం' సభ జరగనుంది. ఉత్తరాంధ్రలోని భీమిలి నుంచి సీఎం వైఎస్ జగన్ వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ సభలో జగన్ తన శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సిద్ధం చేసేందుకు…తాను అభిమన్యుడుని కాదని, అర్జునుడిని అంటూ ఊపు తెప్పించే ప్రసంగం చేశారు. భీమిలి సభ సక్సెస్‌తో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో రెండోసభ చేపట్టారు. దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండు సభలు వైసీపీ శ్రేణుల్లో మళ్లీ అధికారంపై భరోసా నింపాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడో సభ అనంతపురం జిల్లా రాప్తాడులో …ఆ రెండింటికంటే మిన్నగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలను భారీగా తరలిస్తున్నారు దాదాపు 250 ఎకరాల మైదానంలో సభ నిర్వహిస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నడంతో ఆయన ప్రసంగంపైనే అంత దృష్టి ఉంది. ఇవాళ సభలో ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి కీలక అంశాలు ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రైతుల రుణాలు మాఫీపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
రాయలసీమ వైసీపీకి కంచుకోట. అందుకే రాప్తాడు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభకు అనంతపురం, ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణుల్ని తరలించేందుకు నాయకులు తలమునకలయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో 10 లక్షల మందితో సభను అత్యద్భుతంగా నిర్వహించి, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఇవాళ సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.20 గంటలకు రాప్తాడు సభకు చేరుకుంటారు. దాదాపు రెండు గంటల పాటు కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.