ఒకవైపు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో తామే దుమ్మెత్తి పోసిన అశోక్ చవాన్ కు కాషాయ తీర్థం ఇచ్చేసి, పవిత్రుడిని చేసేసి.. చేరిన కొన్ని గంటల్లోనే రాజ్యసభకు నామినేట్ చేసేసిన కమలం పార్టీ, ఇప్పుడు మరో బడా కాంగ్రెస్ నేతకు తీర్థం ఇచ్చేయబోతున్నట్టుగా ఉంది. ఇప్పటికే ఉన్న అంచనాల మేరకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన తనయుడు కలిసి కమలం పార్టీ లో చేరబోతున్నారట! యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చేశారు కమల్ నాథ్. అది కూడా కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు!
ఈయన ఆర్థికంగా బిగ్ షాట్ కూడా! మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచారు. అక్కడ ఆ పార్టీకి అధికారం దక్కినప్పుడు జ్యోతిరాదిత్య సింధియాను కాదనుకుని కాంగ్రెస్ పార్టీ ఈయనకే సీఎం సీటు ఇచ్చింది.
ఈ అసంతృప్తితో సింధియా కొన్నాళ్లకు ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ వైపుకు వెళ్లారు! దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్ప కూలింది. ఆ శిథిలాల్లోంచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. సింధియా కమలం పార్టీలో సెటిలయ్యారు. గత ఎన్నికల్లో మళ్లీ అక్కడ బీజేపీనే అధికారం దక్కించుకుంది!
మరి ఇప్పుడు కమల్ నాథ్ కూడా కాషాయ పార్టీలోకి చేరిపోతే.. అది సిసలైన కామెడీ అవుతుంది! తను సీఎం హోదాలో ఉండగా.. ప్రభుత్వాన్ని కూల్చిన వారితో కమల్ నాథ్ కలిసిపోతున్నట్టవుతుంది. అలాగే కాంగ్రెస్ ఉండగా.. తలపడిన సింధియా, కమల్ నాథ్ లు బీజేపీలో మళ్లీ సహచర నేతలయిపోతారు! కాంగ్రెస్ అంటే దుర్మార్గుల పార్టీ అన్నట్టుగా చెప్పే బీజేపీ కాంగ్రెస్ పేరును తప్ప.. ఆ పార్టీ నేతలందరికీ మాత్రం ఆశ్రయం కల్పిస్తూ ఆ విధంగా దేశాన్ని బాగు చేసేస్తోందనమాట!