వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా భారీ బహిరంగ సభలతో దూసుకుపోతోంది. భీమిలి, దెందులూరు నియోజకవర్గాల్లో జరిగిన 'సిద్ధం' సభల అనంతరం.. సీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటోంది! ఇందుకు తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట అనదగ్గ రాప్తాడు నియోజకవర్గాన్ని వేదికగా తీసుకోవడం గమనార్హం!
రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరసగా రెండు సార్లూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. రాప్తాడు నియోజకవర్గంలో మెజారిటీ భాగం గతంలో పెనుకొండ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజనలో పెనుకొండలోకి కొంత గోరంట్ల నియోజకవర్గం కలవగా, పెనుకొండ నియోజకవర్గంలో ఉండిన ప్రధానమండలాలు రాప్తాడుకు మారాయి. పరిటాల కుటుంబం హవా ఉంటుందన్న రామగిరి మండలం కూడా రాప్తాడులోనే భాగంగా ఉంది.
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడే సీమలో తొలి సిద్ధం సభను నిర్వహిస్తోంది. భారీ ఎత్తున జనసమీకరణ చేసి తమ రాజకీయ శక్తి ఇసుమంత అయినా తగ్గలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాటుకోదలిచింది. అనంతపురం, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాలు రాప్తాడుతో సరిహద్దును పంచుకుంటాయి. కొంత మేర పుట్టపర్తి నియోజకవర్గం కూడా రాప్తాడుతో సరిహద్దును కలిగి ఉంటుంది. అయితే పుట్టపర్తి కి రాప్తాడు దూరమే!
ఇలా పలు నియోజకవర్గాలకు క్రాస్ రోడ్స్ లో ఉండే రాప్తాడులో సుమారు 250 ఎకరాల ప్రాంగణంలో సభకు ఏర్పాటు చేసుకుంది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఇప్పటి వరకూ ఎన్నికల సమరానికి ఇంకా తర్జనభర్జనల్లో ఉంటూ క్లారిటీ ఇవ్వలేని అధినేత చంద్రబాబు పట్ల అసహనంతో ఉన్న టీడీపీ నేతలకు గట్టిగానే దడ పుట్టించాలనే ధోరణితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అయినట్టుగా ఉంది!