ఎమ్బీయస్‍: బెట్టా? సాధింపా? వ్యూహమా?

ఎమ్బీయస్: కూటమి ప్రసవ వేదన అనే వ్యాసంలో టిడిపి-జనసేన-బిజెపి పొత్తు విషయంలో నెలకొన్న సస్పెన్స్ గురించి రాశాను. అమిత్ షాతో బాబు సమావేశానికి ముందు చూపించిన సమరోత్సాహంతో పోలిస్తే తర్వాత ఎవరూ కిమ్మనకపోవడం చాలా…

ఎమ్బీయస్: కూటమి ప్రసవ వేదన అనే వ్యాసంలో టిడిపి-జనసేన-బిజెపి పొత్తు విషయంలో నెలకొన్న సస్పెన్స్ గురించి రాశాను. అమిత్ షాతో బాబు సమావేశానికి ముందు చూపించిన సమరోత్సాహంతో పోలిస్తే తర్వాత ఎవరూ కిమ్మనకపోవడం చాలా కాంట్రాస్టింగ్‌గా ఉందని ఎత్తి చూపించాను. బిజెపి మౌనానికి కారణమేమిటో అంతు పట్టటం లేదని ముగించాను. పొత్తుల ప్రక్రియ సంక్లిష్టమైనది, మొదలు పెట్టాక సమయం తీసుకునేది, కానీ అసలు మొదలు పెట్టడంలో జాప్యం, యింత గుంభనం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. టిడిపికి యివ్వాలని లేదు, జనసేనకు, బిజెపికి తగ్గాలని లేదు అనేది బహిరంగ రహస్యం. క్షేత్రస్థాయి వాస్తవం గమనించి, పవన్ సర్దుకు పోదామనుకున్నా జనసేన ‘హితైషులు’ మాత్రం ఊదరగొడుతున్నారు. బిజెపి వచ్చి చేరుతూంటే తమ వాటా మరీ తగ్గిపోతుందేమోనని మరింత బెదిరి, జోరు పెంచుతున్నారు. అందుకే పొత్తుల విషయమై ఎవరూ నోరెత్తద్దని హెచ్చరిస్తూ పవన్ తన పార్టీ సహచరులకు బహిరంగ లేఖ రాయాల్సివచ్చింది.

చేగొండి పార్టీకి సంబంధించని వ్యక్తి కాబట్టి తన పాటికి తను లేఖలు గుప్పిస్తూనే ఉన్నారు. లేటెస్టు ఫిగర్ 41-5. ఆయన లాటి మిత్రులుంటే వేరే శత్రువులు అక్కరలేదు. ఊరికే ఎగదోయడానికి తప్ప, చేయూత నివ్వడానికి ముందుకు రాని వాళ్ల పార్టీకి మేలేం జరుగుతుంది? ఈ లేఖల ద్వారా తను యింకా యాక్టివ్‌గానే ఉన్నానని పబ్లిసిటీ యిచ్చుకోవడానికి చేగొండికి, పవన్‌ను ఉడికించడానికి జనసేన ప్రత్యర్థులకు ఉపయోగం ఉంటుంది తప్ప పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేదు. అసలీ పాటికి ముద్రగడ కూడా మరో పక్క తగులుకుని ఉండాలి. బిజెపి తనను చేర్చుకుని కాకినాడ పార్లమెంటు సీటు, కొడుక్కి పిఠాపురం సీటు యిప్పిస్తుందనే ఆశతో సైలెంటుగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇవతల బాబుకి తనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడని విని, జనసేనలో చేరలేదనీ అన్నారు. ఆయనకు, కొడుక్కి, కోడలుకి టిక్కెట్లు దక్కితే కాపు ‘జాతి’ ఉద్ధరించబడినట్లే అనే లెక్క ఆయనది! బిజెపితో పొత్తు ఖరారు కావాలని ఎదురు చూసే వాళ్లలో ఆయనా ఒకడన్నమాట.

అమిత్ షాతో తనకు జరిగిన చర్చల విషయం బాబు పవన్‌కు ప్రత్యక్షంగా చెప్పకపోవడమే కాదు, తన పార్టీ సీనియర్లతో కూడా చెప్పటం లేదనే వార్తలు వస్తున్నాయి కానీ కొందరితోనైనా చెప్పే ఉంటారు. వాళ్ల రియాక్షన్లు నోట్ చేసుకునే ఉంటారు. అమిత్‌తో చర్చలు టిడిపికి అనుకూలంగా, వారి ఆశలకు అనుగుణంగా ఉండి వుంటే యింత తర్జనభర్జన అవసర పడేది కాదు. ఏదోలా యిరకాటంలో పెట్టే ప్రతిపాదన అమిత్ చేసి ఉంటారని అనుకోవాలి. ‘‘గాడ్‌ఫాదర్’’లో డాన్ అంటూంటాడు – ‘ఐ విల్ మేక్ ఏ ప్రపోజల్, విచ్ హీ కాన్ట్ రిఫ్యూజ్’ అని. అలాటిదేదో ఉండి ఉంటుంది. ఎస్ అనడానికి మనసొప్పుకోదు, నో అనడానికి నోరు పెగలదు. అంకెలు ఆమోదించి వుంటే, ‘స్థానాలేవిటి అనేదాని గురించి రాష్ట్ర అధ్యక్షురాలితో ప్రిలిమినరీగా చర్చలు జరపండి, ఫైనల్‌గా మా దగ్గరకు వస్తే తునితగవు చేస్తాం’ అని ఉండేవారు. అంకెలే తేలి ఉండవు.

నిజానికి జగన్ గద్దె నెక్కిన దగ్గర్నుంచి నిరంతరం నోరెట్టుకుని పడుతున్నదీ, మీడియా చేత తిట్టిస్తున్నదీ, ఏళ్ల తరబడి అమరావతి ఉద్యమాలు చేయిస్తున్నదీ టిడిపి. కేసులతో వేగుతున్నది టిడిపి క్యాడర్. జైలుకి వెళ్లి కోర్టుల చుట్టూ తిరిగినదీ, లాయర్లకు కోట్లు ధారపోసినదీ బాబు. పవన్‌దేముంది, ఆర్నెల్లకో సారి మెరుపు వీరుడులా వచ్చి కాసిన్ని ఉరుములు ఉరిమించి పోతున్నారు. వారాహి అమరిస్తే మోజు తగ్గి, ఎక్కడో మూలకు నెట్టేసినట్లున్నారు. పార్టీ తరఫున సభలు పెట్టి నెలలు దాటాయి. ఇక బిజెపి ఆ గుళ్లో రథం, యీ గుళ్లో విగ్రహం అంటూ చాన్నాళ్ల క్రితం కాస్త సందడి చేసి ఊరుకుంది. ఇదీ వాళ్ల ప్రిపరేషన్. ఇప్పుడు ఎన్నికల వేళ మాత్రం వంతులడుగుతున్నారు. ‘వేణ్నీళ్లకు వెనక, విందుకు ముందు’ అన్నట్లు, వడ్డన ప్రారంభం కాగానే అదేదో సినిమాలో బాబూ మోహన్‌లా నిలువెత్తు అరిటాకు తెచ్చుకుని తయారయ్యారు. బాబుకి మండిందంటే మండదూ?

అమిత్ షా చేసిన ప్రతిపాదన విషయం గోప్యంగా ఉంది కాబట్టి, విశ్లేషకులు విజృంభిస్తున్నారు. తమ ఊహాశక్తికి పూర్తి పని కల్పించి, అమిత్ ఎన్ని అడుగుతున్నారో చెప్పేస్తున్నారు. 4:2:1 ఫార్ములా ఎక్కణ్నుంచి వచ్చిందో కానీ చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. దాని ప్రకారం 50 జనసేనకు, 25 బిజెపికి యిచ్చేస్తే టిడిపికి మిగిలేవి 100 మాత్రమే. ఈ ఫార్ములా చాలా అన్యాయమైన ఫార్ములా. తమ బలాబలాలు లెక్క వేసుకోకుండా అమిత్ యిలా అడిగి ఉంటారని ఎవరు నమ్మినా నమ్మకపోయినా వైసిపి అసంతృప్తులు మాత్రం నమ్మి ఉంటారనిపిస్తోంది. అందుకే కాబోలు వైసిపి నుంచి వలసలు ఆగాయి. అసలు టిడిపియే ఆశావహులతో కిక్కిరిసి ఉంది. వాళ్ల చేతిలో 100 సీట్లు మాత్రమే మిగిలితే తనవాళ్లకు సర్దగా మనలా లేటుగా బండెక్కే వాళ్లకు చోటెక్కడ చూపిస్తారు? అని లెక్కలు వేసుకుని వాళ్లు అక్కడే ఉండిపోయారు.

ఇది గమనించి కాబోలు, బాబు ‘టిక్కెట్ల కోసమైతే నేనే వాళ్లను రావద్దంటున్నాను. (టిక్కెట్ల కోసం కాకపోతే యింకెందుకు వస్తారిప్పుడు? సిద్ధాంతాల కోసం వచ్చే మాటైతే రెండేళ్ల క్రితమే వచ్చేవారు) పొత్తుల కారణంగా మనవాళ్లనే త్యాగాలు చేయమని అడగాల్సి వస్తోంది. అలాటప్పుడు వాళ్ల నెక్కడ ఎన్‌టర్టయిన్ చేయగలం?’ అని పార్టీ సమావేశంలో చెప్పారు. ఇంత ఓపెన్‌గా చెప్పేశాక వైసిపి అసంతృప్తులు యిటెందుకు వస్తారు? షర్మిల వైపు వెళదామంటే ఆ కాంగ్రెసు కళేబరం యిప్పట్లో లేచేట్లు కనబడటం లేదు. ‘మంచోచెడో యీ పార్టీలోనే ఉండిపోయి, అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తే, మన పార్టీ నెగ్గితే ఏదో ఒక సలహాదారు పదవి కట్టిపెట్టి ఊరుకో బెడతారు. ఇప్పుడు టిడిపికో, జనసేనకో టిక్కెట్టు ఆశించకుండా వెళ్లినా, వాళ్లు నెగ్గి అధికారంలోకి వచ్చినా మనకు ఏదైనా పదవి వచ్చే ఛాన్సు తక్కువ. ఎందుకంటే పొత్తుల కారణంగా టిక్కెట్లు రాని తమవాళ్లకు యిచ్చుకోవడానికే ఎన్ని పదవులూ చాలవు.’ అనుకుంటారు. ఆ విధంగా వైసిపి అసంతృప్తులే వైసిపి గెలుపు కోసం ప్రయాస పడే పేరడాక్స్ ఏర్పడుతుంది.

కూటమి అభ్యర్థులందరికీ చోటు చూపించడమొకటి చాలా పెద్ద విషయం. బిజెపి అడుగుతున్న పార్లమెంటు స్థానాలివే అంటూ తెలుగు రాజ్యం టీవీ వారి వీడియో బయటకు వచ్చింది. పై ఫార్ములా ప్రకారం ఐతే బిజెపికి 3 స్థానాలు మాత్రమే రావాలి. కానీ వారు 10 దాకా అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నా అనుమానం 4:2:1 అసెంబ్లీ వరకే అనుకోవాలి. పార్లమెంటుకైతే 4:1:2 అని ఉంటారు. ఎందుకంటే జనసేనకు పార్లమెంటు ప్రవేశంపై పెద్ద మోజు లేదు. అసెంబ్లీలోకి వెళ్లి వీలైతే అధికార పక్షం లేదా విపక్షంలో కూర్చుని జగన్‌ను ఒక ఆటాడించాలని ఆశ. ఇక బిజెపికి అసెంబ్లీలో పెద్ద పని లేదు. పార్లమెంటు స్థానాలు ఎన్ని ఎక్కువ వస్తే అంత వారికి గొప్పగా ఉంటుంది. టిడిపికి కూడా జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పరిస్థితి యీనాడు ఎలాగూ లేదు. ఈ వాదన కరక్టనుకుంటే బిజెపి 7, జనసేన 3, టిడిపి 15 స్థానాల్లో పోటీ చేయాలి.

గమనార్హం ఏమిటంటే బిజెపి అడుగుతోందని చెప్తున్న స్థానాల్లో చాలా భాగం గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే ఉన్నాయి. అక్కడే జనసేనా అడుగుతోంది. అక్కడే టిడిపికి బలం ఉంది. అంకెల గురించి త్వరగానే సయోధ్యకు వచ్చినా స్థానాల దగ్గరకు వచ్చేసరికి పీటముడి పడే ప్రమాదం ఉంది. బిజెపి అడుగుతున్న పార్లమెంటు స్థానాలు అంటూ వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, విజయవాడ.. యిలాటి పేర్లు వినబడితే మతి పోయింది. ఇవి వాళ్లకిచ్చేస్తే టిడిపి, జనసేన క్యాడర్ ఊరుకుంటారా? అనిపించింది.  సంఘటిత బలంతో వైసిపిని కొట్టగలిగేది ఉభయ గోదావరి, విశాఖ మొత్తం మూడు జిల్లాలలో, గట్టి పోటీ యిచ్చేది కృష్ణా, గుంటూరులలో. అక్కడే భాగస్వాముల మధ్య అంతఃకలహాలు వచ్చి బలహీనపడితే లాభపడేది వైసిపియే. దాన్ని నివారించాలంటే చాలా బుజ్జగింపులు జరగాలి. దానికి సమయం పడుతుంది. అందువలన యీ ప్రక్రియ ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది.

పార్లమెంటు సీట్ల ఫార్ములా ఎలా ఉన్నా అసెంబ్లీ ఫార్ములా 4:2:1 గురించి ఆలోచిస్తే, టిడిపికి 100 సీట్లు మాత్రమే పోటీ చేయగలదు. స్ట్రయిక్ రేట్ 70 అనుకున్నా వాటిలో 70 గెలవగలదు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. ప్రతీ దానికీ భాగస్వాములపై ఆధారపడ వలసిందే! న్యాయంగా చూస్తే 8:2:1 ఫార్ములా రీజనబుల్ అని నా ఉద్దేశం. అదైతే బిజెపికి 15, జనసేనకు 30, టిడిపికి 130 వస్తాయి. స్ట్రయిక్ రేట్ 70 అనుకున్నా టిడిపి 91 గెలవగలదు, భాగస్వాములు తనను ఆడించలేరు. కానీ టిడిపి నా వాటా 4 కాదు, 8 ఉండాలి అని బిజెపిని ఒప్పించడానికి చాలా కష్టపడాలి. అలాగే జనసేనకు 2 ఎందుకు, 1.5 చాలు అనే తన క్యాడర్‌ను ఒప్పించడానికీ కష్టపడాలి. జనసేనానితో పెద్దగా కష్టాలు లేవు. 20 యిచ్చినా ఆయన తృప్తి పడతాడు. ఇంకా ఎక్కువ అడుగు అని ఎక్కవేసేవాళ్లను పట్టించుకోడు. బిజెపి అధిష్టానానికీ అలాటి చిక్కూ లేదు. వాళ్లు ఎంత చెపితే క్యాడర్‌కు అంత! ఎవరూ నోరెత్తరు. ఇప్పుడు ఒక్క సీటూ లేదు కాబట్టి ఎన్ని వచ్చినా లాభమే!

టిక్కెట్ల పంపిణీ ఒక పెద్ద ప్రక్రియ. కానీ కథ దానితో ముగియదు. భాగస్వాముల మధ్య ఓట్ల బదిలీ అనేది పెద్దాతిపెద్ద ప్రక్రియ. నాయకులు తమ రాజకీయాల అవసరం కోసం గబగబా రంగులు మార్చేసుకుంటారు. కానీ పార్టీ అభిమానులు, తటస్థులు, మామూలు ప్రజలు అంత వేగంగా మారరు. 2019లో జనసేన-లెఫ్ట్-బియస్పీ కూటమి ఒక విఫలయత్నం. గణాంకాల ప్రకారం చూస్తే కాపులు, దళితులు కలిస్తే అక్కడికే 40శాతం అయింది. లెఫ్ట్ అంటే పేదల పార్టీ కాబట్టి వారూ కలిస్తే 50శాతంకి మించి ఓట్లు రావాలి. కానీ ఏ పార్టీ అభిమానులూ మరో పార్టీకి ఓటేసినట్లు కనబడలేదు. 2024లో టిడిపి కమ్మ ఓటు బ్యాంకు జనసేన కాపు అభ్యర్థులకు ఓటేస్తారా? అనే ప్రశ్న ఒకటి మెదులుతూనే ఉంది. 2014లో పవన్ అభ్యర్థులను నిలబెట్టలేదు కాబట్టి అప్పుడు ఆత్మీయుడే. కానీ యీ రోజు తమకు బలం ఉన్నచోట, మాక్కావాలి అంటూ సీటు ఎగరేసుకుని పోతున్నాడు కాబట్టి ఆ ఆత్మీయత నిలుస్తుందా అనేది సందేహం.  

ఇప్పుడు బిజెపి కూడా తోడవుతోంది కాబట్టి మరో కోణం కూడా వచ్చి చేరింది. హార్డ్‌కోర్ టిడిపి ఓటర్లు బిజెపికి వేస్తారా? అన్నది మొదటి ప్రశ్న. బిజెపి తమను ఎలా వేధించిందో 2018 నాటి ధర్మపోరాటంలో బాబు ఎంతో వివరంగా చెప్పారు. ప్రత్యేక హోదా యివ్వవలసినది, అది మానేసి ప్రత్యేక ప్యాకేజి అని మభ్యపెట్టి, అదీ యివ్వక, వెనకబడిన ప్రాంతాలకు యివ్వవలసిన నిధులివ్వక, బజెట్ లోటు పూరించక… యిలా అనేక అంశాలు అప్పుడు చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా టిడిపి అభిమానులు నమ్మారు. అంతా కలిసి 2019 ఎన్నికలలో బిజెపికి 0.8 శాతం ఓట్లతో సరిపెట్టారు. కానీ టిడిపి కూడా ఓడిపోయింది. దానికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్న బిజెపి తమను యిబ్బంది పెట్టడమే అని టిడిపి చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికలలో బిజెపితో పొత్తు అనివార్యం కావడానికి కారణం కూడా అదే అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్తున్నారు.

‘గత ఐదేళ్లగా వైసిపి ఆటలు సాగనిచ్చింది బిజెపియే, ఆర్థిక క్రమశిక్షణ పాటించటం లేదనే కారణం చూసి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయకపోగా ఎప్పటికప్పుడు పరిమితులకు మించి అప్పులిస్తూ, ప్రభుత్వపు బండి నడిచేందుకు దోహదపడుతున్నదీ బిజెపియే! జగన్ బాబుని అరెస్టు చేయించాడంటే బిజెపి సహకారం లేనిదే జరిగేదా? వెనక ఉండి ఆడించినది వాళ్లే’ అని తెలుగు మీడియా టిడిపి అభిమానులకు యిన్నాళ్లూ నూరిపోసింది. బాబు అరెస్టు తర్వాత టిడిపి పార్టీ యంత్రాంగం చేష్టలుడిగి దిగాలు పడితే, నాటకీయంగా పవన్‌ వచ్చి రక్షకుడి అవతారం ఎత్తడం, ‘టిడిపికి అనుభవం ఉంటే, పోరాట పటిమ మాకుంది’ అని పవన్ ప్రకటించడం యివన్నీ టిడిపి హార్డ్‌కోర్ అభిమానులను చిర్రెత్తించాయి. బిజెపియే పవన్ చేత యీ డ్రామా ఆడించిందని, అందుకే పొత్తు గురించి అతను ఏకపక్షంగా ప్రకటించినా ఊరుకుందని వచ్చిన విశ్లేషణలు చికాకు కలిగించి ఉంటాయి. ఇలాటి ప్రచారంతో వాళ్ల మెదళ్లను ఒకలా మోల్డ్ చేసి యిప్పుడు హఠాత్తుగా బిజెపికి ఓటేయండి అంటే వారు సిద్ధపడతారా? బాబు క్షమించినంత మాత్రాన వాళ్లందరూ క్షమించాలని లేదు.

అదే విధంగా హార్డ్‌కోర్ బిజెపి ఓటర్లు ఓ పట్టాన టిడిపికి వేస్తారా అనేదీ ప్రశ్నే. ఆంధ్రలో బిజెపికి ఎంతో గొప్ప గతం ఉండేదని, వెంకయ్య నాయుడి సహకారంతో బాబు దాన్ని క్లుప్తం, ఆ పై లుప్తం చేసేశారని వారి ఆక్రోశం. వాజపేయి హయాంలో బాబు బిజెపితో ఆటలాడుకున్నారని, చేరదీయడం, ఛీకొట్టడం, మళ్లీ చేరదీయడం, మళ్లీ ఛీకొట్టడం, ఛీ కొట్టిన ప్రతీసారి పెద్దపెద్ద సిద్ధాంతాలు వల్లించడం, చేరదీసిన ప్రతీసారి పొత్తు పేర తన వాళ్లనే అక్కణ్నుంచి నిలబెట్టడం జరిగాయి. మోదీ వచ్చాక కూడా బిజెపి వారికి రాష్ట్ర కాబినెట్‌లో చోటు యిచ్చినట్లే యిచ్చి, అధికారం లేకుండా చేయడం, యిక 2018లోనైతే ఏకంగా చెలరేగి పోవడం.. యివన్నీ బిజెపి అధిష్టానం మర్చిపోయినా, ఆంధ్ర బిజెపి ఓటర్లు మర్చిపోవడం కష్టం.

ఐదేళ్లయింది కాబట్టి మర్చిపోవడానికి ఉద్యమిస్తూండగానే 2023 తెలంగాణ ఎన్నికలు గుర్తొస్తాయి. కాంగ్రెసు అధికారంలోకి రావడానికి వీలుగా తన పార్టీని పోటీ లోంచే తప్పించారు బాబు. తన పార్టీ అభిమానులున్న చోట కాంగ్రెసుకి ఓట్లేయించారు. కాంగ్రెసు సమావేశాల్లో టిడిపి కార్యకర్తలు జండాలతో పాల్గొన్నారు, గాంధీ భవన్‌కు కూడా వెళ్లారు. ఆంధ్ర టిడిపి నాయకులు, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వాన్ని తమదిగా భావిస్తున్నారని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇలాటి బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే బిజెపిని ఎంత లోతుగా పాతిపెడతారో తెలియదు. ఇప్పటికే ఆంధ్ర బిజెపి నాయకుల్లో సగం మంది టిడిపి పాట పాడుతూంటారు. ఇవన్నీ తెలిసి బిజెపి అధిష్టానం పొత్తు పెట్టుకోవడం దేనికి అని బిజెపి ఓటరు ఆవేదన.

ఈ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ యొక్క ప్రస్తుత మనోభావాలు ఎలా ఉన్నా, ఒకసారి కూటమి ఏర్పాటు గురించి ప్రకటన వచ్చాక, క్రమేపీ ఆ పార్టీల ఓటర్లలో మెజారిటీ జనం సమాధాన పడతారు. తమంతట తమే పడరు. పార్టీ నాయకులు వచ్చి సమాధాన పరచాలి. దానికి సమయం పడుతుంది. ఎన్నికలకున్న సమయం రెండు నెలలు మాత్రమే! ఈ లోగానే నాయకులు అభిమానులకు పార్టీ పరంగా సంజాయిషీలు చెప్పుకోవాలి. టిక్కెట్టు ఎందుకు యివ్వలేక పోయామో అభ్యర్థులకు నచ్చచెప్పాలి. తక్కిన ప్రచారం సంగతి ఎలాగూ తప్పదు. ఇవన్నీ ప్రారంభించాలంటే పొత్తు ఖరారు కావాలి. కానీ బిజెపి ఆలస్యం చేస్తోంది. ఎందుకు? అనేదే ప్రశ్న. కారణం – బెట్టా? సాధింపా? వ్యూహమా?

2019 ఎన్నికల ఫలితం వచ్చిన దగ్గర్నుంచి బాబు నాలిక్కర్చుకుంటూనే ఉన్నారు – బిజెపితో పేచీ పెట్టుకున్నందుకు. అప్పణ్నుంచి దాన్ని పన్నెత్తి ఒక్క మాట అనలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేక పోయావని జగన్‌ను తిడతారు కానీ, అసలా ఆలోచన చేసినందుకు బిజెపిని ఏమీ అనరు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ప్రత్యేక హోదా తేలేదని జగన్‌ను దుమ్మెత్తి పోస్తారు కానీ, మీరెందుకు యివ్వరని బిజెపిని నిలదీయరు. ఇంత చేసినా బిజెపి దగ్గరకు రానీయలేదు. బిజెపితో పొత్తులో ఉన్న జనసేన మాతో కలిసి రావాలి, ప్రేమలేఖలు పంపాం అంటూ బాబు చెప్తూ వచ్చారు, చివరకు కత్తు కలిపారు. బిజెపి కూడా యింకేముంది వచ్చేస్తుంది, వచ్చేస్తోంది, ఆల్మోస్ట్ వచ్చేసినట్లే, మోదీ బాబు భుజం తట్టారు, అమిత్ చేతులు కలిపారు.. ఎన్డీయే కాబినెట్‌లో టిడిపికి రెండు బెర్త్‌లు బుక్కయి ఉన్నాయి.. యిలా తెలుగు మీడియాలో రెండేళ్లగా రాయిస్తూనే ఉన్నారు. ఆంధ్రలో అర్జంటుగా అధికారంలోకి వచ్చేసేటంత కుతూహలం టిడిపిది కానీ, బిజెపిది కాదు. అందువలన మోదీ, అమిత్ వర్ సిటింగ్ ప్రెటీ.

ఇన్నాళ్లకు మధ్యవర్తుల రాయబారం ఫలించి, బాబు వెళ్లి పొత్తు గురించి కదపగలిగారు. ఈయన అడగ్గానే ఒప్పేసుకుంటే, దీని కోసమే వాళ్లు చకోరపక్షుల్లా వేచి ఉన్నారని తెలుగు మీడియాచే రాయించగల ఘనుడు బాబు. అందుకని బెట్టు చేసి ఒప్పుకుందాంలే అనుకుంటూండవచ్చు. దీని వలన తమకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని వాళ్ల అంచనా. లోకసభలో బిజెపికి సొంతంగా 300కు పైగా సీట్లు వస్తూంటే ఆంధ్రలో వచ్చే సీట్లు అలంకారప్రాయమే. అయినా పొత్తుల గురించి మోదీ ఎందుకు ఆలోచిస్తున్నారో రాధాకృష్ణ తన ‘‘కొత్త పలుకు’’లో చెప్పారు. ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికలలో రాజీవ్‌కు 403 సీట్లు వచ్చాయట. దాన్ని బీట్ చేయడానికి ఎన్‌డిఏకు 404 రప్పించాలని మోదీ లక్ష్యమట!

1984లో కాంగ్రెసుకు వచ్చినవి 414, అదీ ఒంటరిగా. ఇప్పుడు ఎన్‌డిఏ అన్ని తెచ్చుకున్నా, అవన్నీ బిజెపి ఖాతాలో పడవుగా! 2029 మాట ఏమో కానీ 2024లో బిజెపి ఆ రికార్డు అందుకోవడం అసంభవం. కానీ యీ లాజిక్కులేవీ రాధాకృష్ణ గారికి తోచవు. ‘ఏవేవో టార్గెట్లు పెట్టుకుని బిజెపియే టిడిపితో పొత్తు కోసం వెంపర్లాడుతోంది తప్ప, టిడిపికి వాళ్లతో ఏ అవసరమూ లేదు. కానీ వాళ్లు నోరు తెరిచి అడిగాక కాదనలేని పరిస్థితి పాపం బాబుది’ అని టిడిపి అభిమానులకు నచ్చచెప్పడమే ఆయన ఉద్దేశం. పోనీ బిజెపియే ఏదో ఒక ప్రణాళికలో భాగంగా టిడిపిని పిలిపించిందని అనుకుందాం. టిడిపి వెంటనే వెళ్లింది కదా. ఇలా రప్పించుకున్న బిజెపి అట్టోపెట్టో వెంటనే తేల్చకుండా బెట్టు చేస్తోందా?

మోదీ కానీ అమిత్ కానీ చాలా సార్లు చెప్పారు. మేం ఎన్‌డిఏలోంచి ఎవర్నీ బయటకు పంపలేదు. వాళ్లే వెళ్లారు అని. 2018లో ప్రత్యేక హోదా అంశంపై బాబు బయటకు వెళ్లిపోతానన్నపుడు ‘ఇది వైసిపి వేస్తున్న ట్రాప్. ఈ పేరు చెప్పి జగన్ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. మీరు ఆ ట్రాప్‌లో పడకండి, మాతోనే ఉండండి.’ అని మోదీ స్వయానా నచ్చచెప్పారని బిజెపి నాయకులు అన్నారు. అంత నచ్చచెప్పినా బాబు మీతో లెక్కేమిటి అని బయటకు వచ్చేశారు కాబట్టి, యిప్పుడు తిరిగి ఎన్‌డిఏలో తీసుకోవడానికి వాళ్లు బెట్టు చేయడంలో విడ్డూరమేముంది?

నిజానికి ప్రత్యేక హోదా అంశం ప్రాధాన్యత పోనుపోను తగ్గిపోతోంది. 25 మంది ఎంపీలిస్తే వాళ్లను చూపించి, కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తా అన్న జగన్, ‘కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో అలాగే చేదును, కానీ దురదృష్టవశాత్తూ బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేసి, మన మద్దతుపై ఆధారపడే అగత్యం లేకుండా పోయింది. అందువలన అప్పుడప్పుడు గుర్తు చేయడం తప్ప యింకేం చేయలేం.’ అని చేతులెత్తేశాడు. 2019 కంటె 2024లో బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేట్లున్నాయి కాబట్టి అదే సాకు యిప్పుడూ పనికి వస్తుంది. హోదా మాట ఎత్తడానికి వైసిపి యిష్టపడదు. ఇప్పుడు కూటమిలో బిజెపిని చేర్చుకుంటే టిడిపి, జనసేన కూడా దాని మాట ఎత్తడం మానేస్తాయి, బిజెపికి యిబ్బంది అని. ఇక అది మరుగున పడుతుంది. 2018 ధర్మపోరాటం వ్యర్థపోరాటంగా మారినట్లే!  

బెట్టు కంటె సాధింపు యింకో మెట్టు ఎక్కువ. 2018లో ఎన్‌డిఏలోంచి బయటకు వెళ్లిపోవడానికి బాబు ప్రత్యేక హోదా సాకు చూపించినా, 2019లో బిజెపికి గతంలో కంటె తక్కువ స్థానాలు వస్తాయన్న తప్పుడు అంచనాతోనే వ్యవహరించారు. అందుకే మోదీని వ్యక్తిగతంగా ఎటాక్ చేశారు కూడా. అమిత్‌పై రాళ్ల దాడి వగైరాలు కూడా ఘర్షణ పెంచాయి. గోధ్రా అల్లర్ల తర్వాత మోదీని ఆంధ్రప్రదేశ్‌కు రానివ్వనని బాబు అనడాలు, ఎన్‌డిఏపై ఒత్తిడి తేవడాలూ అవీ నాకు తెలుసు. నాకు తెలియని ఒక విషయాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫిబ్రవరి 11నాటి ‘‘కొత్తపలుకు’’లో రాశారు. మోదీని ముఖ్యమంత్రి స్థానంలోంచి తీసేద్దామనుకుంటే వాజపేయికి అటు ఆడ్వాణీ అడ్డుపడ్డారు. ఇటు ఎన్‌డిఏ కన్వీనరు హోదాలో బాబు తీసేయమంటూ ఒత్తిడి తెచ్చారు.

చివరకు వాజపేయి ‘వెళ్లి బాబుని స్వయంగా కలిసి నచ్చచెప్పు’ అని మోదీని ఆదేశించారట. సరేనని మోదీ దిల్లీ పర్యటనలో ఉన్న బాబుని కలవడానికి ఎపి భవన్‌కు వెళ్లారట. కానీ బాబు ఆయనకు ఎపాయింట్‌మెంట్ కూడా యివ్వలేదట! కట్ చేస్తే – నేటి పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి అంటే యిదే కాబోలు. కానీ ఓడ ఐన బండి, పాత ఓడపై ఔదార్యం చూపుతుందా? పరిస్థితుల బట్టి చూపించినా, సాధించిసాధించి అప్పుడు ఔనంటుంది. బాబుకి అమిత్‌తో ఎపాయింట్‌మెంట్‌ని అర్ధరాత్రి దాకా సాగదీసి, రెండు రోజులు తిరగకుండా జగన్‌తో స్వయంగా గంటన్నర సేపు మాట్లాడడం బాబుని ఉడికించడానికే అనుకోవాలి. గతంలో అవమానించినందుకు యిప్పుడు సాధిస్తున్నారేమో! పద్యనాటకాల రోజులు కావు కాబట్టి ‘చెల్లియో చెల్లకో…’ పద్యం పాడటం లేదు కానీ మౌనంగా ఉంటూనే ‘తొల్లి గతించె’ అని కన్వే చేస్తున్నారు.

ఇక వ్యూహం విషయానికి వస్తే – ఒక ఫార్‌ఫెచ్‌డ్ ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను. రెండు ప్రాంతీయ పార్టీల బలాలను తగ్గించడానికి బిజెపి పూనుకుని ఉండవచ్చు. 2024లో చతుర్థ స్థానంలో ఉన్న బిజెపి లక్ష్యం 2029లో ద్వితీయ స్థానానికి రావడం అనుకుంటే, యీ ఎన్నికలలో ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న పార్టీలను క్షీణింప చేయాలి. విడిగా పోటీ చేస్తే వైసిపి మరింత బలపడుతుంది. 2029లో దాన్ని ఎదుర్కోవడం మరీ కష్టమౌతుంది. దాని సీట్లను తగ్గించాలంటే టిడిపితో చేతులు కలపాలి. ఆ కలపడం ఎలా ఉండాలంటే టిడిపికీ నష్టం కలిగి, దాని బలమూ క్షీణించాలి. నెగ్గే పక్షానికి ఓడే పక్షానికి తేడా కేవలం 10 సీట్లు మాత్రమే ఉంటే, 2029లో బిజెపిలో వారిలో ఒకరిని సులభంగా ఢీకొనగలదు.

ఈ హైపోతిసిస్ ఒప్పుకుంటే బిజెపి టిడిపి కూటమిలో చేరి, దానికి విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు అడుగుతుంది. మహాభారత కృష్ణుడి గురించి రాజకీయ కోణంలో కొందరు విశ్లేషకులు చెప్తూంటారు – యాదవ రాజ్యం చిన్నది. హస్తిన ఏలుతున్న కురు సామ్రాజ్యం పెద్దది. కానీ ఆ కుటుంబంలో దాయాదుల పోరుంది. కృష్ణుడు ఆ దాయాదుల మధ్య చొరబడి, అండర్‌డాగ్‌గా ఉన్న పాండవుల పక్షాన నిలబడి, అర్జునుడికి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి, బంధం దృఢ పరుచుకున్నాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరిగేట్లు చేసి, దేశంలోని రాజులనేకులు పాల్గొనేట్లు చూసి, పెద్ద రాజులందరూ కనుమరుగయ్యేట్లు చేశాడు. చివరకు పాండవులకు దక్కినదీ పెద్దగా లేకుండా చేశాడు. ‘పాండవులు సంపాదించినది కౌరవుల తద్దినాలు పెట్టడానికే సరిపోయింది’ అనే సామెత ఉంది.

ఆధ్యాత్మిక పరంగా భూభారం తగ్గించడానికే కృష్ణుడు యిలా చేశాడు అని చెప్తారు. పాండవుల పక్షాన ఉంటూనే అభిమన్యుడు, ఘటోత్కచుడు వంటి బలశాలురు చనిపోయేట్లు చేశాడు. అదేమంటే ‘లేకపోతే వీళ్ల కోసం మళ్లీ యింకో అవతారం దాల్చాల్సి వచ్చేది’ అని చెప్తారు పౌరాణికులు. ‘‘మాయాబజారు’’ సినిమాలో కృష్ణుడికి అత్యంత ఆత్మీయుడు శకుని అని చూపించారు. ఎందుకంటే యిటు కృష్ణుడు పాండవుల పక్షాన ఉంటూనే యుద్ధానికి ప్రేరేపించి, వాళ్ల బలాన్ని తగ్గించినట్లు, అటు శకుని (‘‘శ్రీకృష్ణపాండవీయం’’ సినిమాలో చూపించిన ప్రకారం) కౌరవుల పక్షాన ఉంటూనే యుద్ధానికి ప్రేరేపించి, వాళ్ల బలాన్ని తగ్గించాడు. ప్రస్తుతం బిజెపి కృష్ణుడిగా, శకునిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుంది. ఒకరితో బాహాటంగా, మరొకరితో చాటుగా స్నేహంగా ఉంటూ యిద్దర్నీ బలహీన పరిచే పనిలో ఉన్నట్లుంది. పరాజితులైన కౌరవులెవరో, విజేతలైన పాండవులెవరో ఫలితాలు వచ్చాక తెలుస్తుంది.

ఈ ఊహలేవీ కరక్టు కావాలని లేదు. పొత్తు చర్చల ప్రారంభంలో కాలయాపనకు తగిన కారణం కనబడకపోవడంతో పరిపరి రకాలుగా ఆలోచించి చూడాల్సి వచ్చిందంతే! ఒకటి మాత్రం నిజం – పొత్తులోనే ఉన్నా భాగస్వాములందరికీ ఎవరి ప్లాన్లు వాళ్ల కుంటాయి. కూటమిలో చేరతానని చెప్పి, ఎటూ తేల్చకుండా భాగస్వాములను త్రిశంకు స్వర్గమో, నరకమో దానిలో వేళ్లాడదీయడం వలన బిజెపికి పోయేదేమీ లేదు. కానీ టైమ్ ఎడ్వాంటేజి పోతోందని రెస్టివ్‌గా ఉన్నదీ, కూటమి బీటలు వారుతుందని భయపడుతున్నదీ టిడిపి, జనసేన కార్యకర్తలే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2024)

[email protected]