టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడేట్లే ఉందనే సంకేతాలు వచ్చాయి. టైమ్స్ గ్రూపు వేదికగా అమిత్ ఎన్‌డిఏను విస్తరించడానికి చూస్తున్నాం అని చెప్పాడు. టిడిపితో పొత్తు సంగతేమిటి అని నావికా కుమార్ అడిగితే ‘ఇప్పుడే అన్నీ వేదికపై చెప్పలేం కదా’ అన్నాడు. అందువలన ఒక ప్రాసెస్ అంటూ ప్రారంభమైంది, అది ఎప్పటికి పూర్తవుతుందో యిప్పుడే చెప్పలేం అని అనుకోవచ్చు. కూటమి అనే పిండం బయటపడడానికి ముందు ప్రసవ వేదన తప్పదు. ఒక్క పార్టీలోనే టిక్కెట్ల పంపిణీ సమయంలో ఎన్నో గొడవలు, రగడలు జరుగుతాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, బెదిరింపులు, పార్టీలోంచి నిష్క్రమణలు యివన్నీ తప్పవు. క్రమశిక్షణ పటిష్టంగా ఉన్న మహామహా పార్టీలకే యిది తప్పదు. ప్రస్తుతం వైసిపి పడుతున్న అవస్థలు కళ్లారా చూస్తున్నాం.
కూటమి విషయానికి వస్తే కలిసి కూర్చుని సీట్ల పంపిణీ ఖరారు చేయవలసిన మూడూ పార్టీలూ వేర్వేరు స్వభావాలున్నవి. టిడిపి 40 ప్లస్ పార్టీ. ఊరూరా క్యాడర్ ఉన్న పార్టీ. 2019లోనే 39శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ. నాయకుడు మహా స్ట్రాంగ్. 2024 ఎన్నికలు ఆయన పార్టీకి జీవన్మరణ సమస్య. ఇప్పటికే పరమ దుస్థితిలో ఉంది పార్టీ. తెలంగాణలో పోటీ చేయలేక పోయారు. రాజ్యసభకు పోటీ చేయటం లేదు. అక్కడ ఒక్క సీటూ లేకుండా పోతోంది. లోకసభలో ముగ్గురు ఎంపీలుంటే ఒక్కరే మిగిలాడు. ఒకాయన పార్టీ మారాడు, మరో ఆయన రాజకీయాల్లోంచే బయటకు వెళ్లిపోయాడు. 2024లో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే పార్టీ నాయకులు, క్యాడర్ పక్కచూపులు చూస్తారనే భయం ఉంది.
ఇక జనసేన విషయానికి వస్తే ప్రజలకు, పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ఉన్నంత సీరియస్‌నెస్ జనసేనాపతికి లేదు. ఆయన రాష్ట్రంలో ఉండేదే తక్కువ. పర్యటించేది, ప్రజల్లో తిరిగేది మరీ తక్కువ. పార్టీ నడిపించాలన్న ఆసక్తి ఉన్నట్లు కనబడదు. అస్తిత్వం కోసం సొంతంగా వ్యూహరచన చేస్తున్నట్లు కనబడదు. ఎవరో యిచ్చిన భూమికను తన శాయశక్తులా నిర్వహిస్తున్నట్లు కనబడుతుంది. సినిమా, రాజకీయం అంటూ రెండు పడవల ప్రయాణం కాబట్టి కార్యాచరణలో ప్రత్యక్షంగా ఉండడానికి సమయం కుదరదు. ఆ పని నాదెండ్లకు అప్పగించి ఎవరైనా కాదంటే ఖబడ్దార్ అన్నారు. నాయకులకు కూడా సమయం కేటాయించకుండా నెట్టుకొస్తున్నారు. ఆయన కున్న మొదటి ఎజెండా జగన్‌ను గద్దె దించడం. రెండో ఎజెండా అసెంబ్లీలో ఒక్కసారైనా అడుగు పెట్టడం!
ఈ రెండిటిని సొంత పార్టీని బలోపేతం చేయడం ద్వారా సాధించాలని ఆయన అభిమానుల కోరిక, ఒత్తిడి. ఆ కార్యక్రమం 14 రీళ్ల సినిమా కాబట్టి చంద్రబాబు అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా తన కోరిక నెరవేరితే చాలు అని సేనాపతి ఊహ. ఆయన అల్పసంతోషానికి, అనుచరుల శిఖరస్థాయి ఆశలకు లంగరు వేయడం కష్టంగా ఉంది. ఓ 20 అసెంబ్లీ సీట్లు, ఓ 2 పార్లమెంటు సీట్లు యిచ్చినా సర్దుకుందామని సేనాపతి ఊహ. వాటికి రెట్టింపు యివ్వకపోతే కూటమిలో చేరవద్దు అని సైన్యం పట్టుదల. మీ అభిప్రాయాలతో నాకు పనేమిటి? నాకు వీలు పడేదే నేను చేస్తాను అని గట్టిగా అంటే ఆ సైన్యానికి కోపం వచ్చి ఆ 20లో కూడా ఒక డిజిటే (2 లేదా 0) వస్తుందన్న భయం. క్యాడర్ ఎదుట మర్యాద నిలుపుకోవడం పవన్ తక్షణ కర్తవ్యం.
ఇక బిజెపి – కూటమిలో ఏ చింతా లేని పార్టీ యిదే. 2024లో దేశం మొత్తం మీద 300 ప్లస్ సీట్లు సొంతంగా తెచ్చుకుని ఎవరిపైన ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎలాగూ లేదు. బాబు, పవన్‌లలాగ జగన్‌పై వ్యక్తిగత కక్ష లేదు. వైసిపి అవసరం వారిద్దరికీ లేదు కానీ బిజెపికి ఉంది. రాజ్యసభలో ఆంధ్రకు ఉన్న 11 స్థానాలూ వైసిపివే కాబోతున్నాయి. పైగా బాబు లాగ జగన్ కాంగ్రెసు వైపు వెళతాడన్న శంకా లేదు. దశాబ్దంగా నమ్మకంగా ఉన్నాడు. అతని పిలక తమ చేతిలో ఉంది. దేశమంతా వ్యాపించి, ఆంధ్రలో వ్యాపించక పోవడం బాగా లేదు కాబట్టి, స్థానిక బిజెపి నాయకులకు ఉత్సాహం రగిలించడానికి, యితర పార్టీల నుంచి దుమికేవారికి ఆకర్షణీయంగా ఉండడానికి, 2029లో ద్వితీయ స్థానానికైనా రావడానికి యీసారి పోటీ చేయాలంతే!
2019లో రాష్ట్రం మొత్తం మీద 1శాతం కంటె తక్కువ ఓట్లు వచ్చినా, కొన్ని నియోజకవర్గాల్లో అంతకంటె ఎక్కువే వచ్చాయి. 2024లో అయోధ్యా ప్రభావం చేత యింకా ఎక్కువ వస్తాయని ఆశించవచ్చు. మోదీ గ్లామర్ మధ్యతరగతిలో, ధనికుల్లో, పట్టణ జీవుల్లో పని చేస్తుంది కాబట్టి దాన్ని ఓట్లగా మార్చుకోవచ్చు. టిడిపి రంగంలో ఉంటే ఆ ఓట్లలో కొన్ని అటు పోవచ్చు కాబట్టి పొత్తు పెట్టుకుని నివారిస్తే మంచిదే! కేంద్ర బిజెపి రాష్ట్రానికి ఏమీ చేయటం లేదు, ప్రత్యేక హోదా యివ్వలేదు, రైల్వే జోన్ యివ్వలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదు.. యిలాటి నినాదాలు యీ పొత్తు ధర్మమాని వినబడడం మానేస్తాయి కాబట్టి ఆంధ్రుల్లో బిజెపి పట్ల వ్యతిరేకత తగ్గి, 2024 తర్వాతి నుంచైనా ఎదగడానికి ఆస్కారం ఉంది.
ఇలాటి మూడు పార్టీల అధినేతలు ఒక చోట కూర్చుని సీట్ల పంపిణీ చేసుకోవడం, దాని వలన తమ కార్యకర్తలు, ఓటర్లు బాధపడకుండా చూడడం అంటే పెద్ద కసరత్తే. వీటిలో ఒకటి రాష్ట్రంలో మూలాలను పాతి పెట్టేసిన జాతీయ పార్టీ, మరొకటి నాయకులతో కిటకిట లాడే ప్రాంతీయ పార్టీ, యింకోటి పార్టీ నిర్మాణమే లేని కొన్ని జిల్లాల పార్టీ. మూడిటి వర్కింగ్ స్టయిల్ వేరు. నిర్ణయాలు ఒక పట్టాన తీసుకోవడం కష్టం. బిజెపి స్థానిక నాయకులకు అధికారాన్ని డెలిగేట్ చేయడం లేదు. బాబు ఓ పట్టాన తేల్చే రకం కాదు. పవన్‌కు కళాకళలు. 2014లో పొత్తు ఉందంటే అప్పుడు జనసేనది కేమియో రోల్. బిజెపిది జూనియర్ ఆర్టిస్టు రోల్. సప్లయిరు వెంకయ్య ఆయన మనిషే కాబట్టి అంతా బాబు చుట్టూనే తిరిగింది. తమ చిత్తం వచ్చినట్లు నడిపించారు.
ఇప్పుడు సినారియో మారిపోయింది కాబట్టి యీ మూడిటి మధ్య పొత్తు అంటే ఎంతో కసరత్తు, ప్రసవ వేదన తప్పదు. అందుకే ఆలస్యం. పైగా యిది మానవగర్భమో, గజగర్భమో తెలియదు. అందువలన ఫలానా టైముకి ప్రసవం అవుతుందని లెక్క వేసి చెప్పలేరెవరూ. అయితే యిక్కడో విషయం చెప్పుకోవాలి. గర్భధారణ జరిగాక ప్రసవం జరగడానికి ముందు వేవిళ్ల వంటి బాధలుంటాయి కానీ బిడ్డ పుట్టబోతోందన్న ఆనందం ఉంటుంది. కానీ బాధలే తప్ప యిక్కడ ఆనందం కనబడటం లేదు.
బిజెపి నాయకులు రాష్ట్రస్థాయిలో పెదవి విప్పటం లేదు. అంతా పై వాడికే ఎఱుక అంటున్నారు. ‘ప్రస్తుతానికి మా అధినాయకత్వం 175 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా ప్రచారం చేసుకోమని ఆదేశించారు, చేసుకుంటున్నాం.’ అంటున్నారు. మీడియా వాళ్లు అడిగినప్పుడు జనసేనతో మాకు పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు తప్ప వాళ్లను కలుపుకుని పోవడం లేదు. మామూలుగా అయితే ‘ఇది చారిత్రాత్మక ఘట్టం, ఆంధ్ర చరిత్రను తిరగరాసే సన్నివేశం. మూడు బలమైన శక్తులు రాక్షసపాలనపై ముప్పేట దాడి చేసే ముచ్చటైన దృశ్యం’ లాటి కవిత్వం వినబడాలి. వినిపించటం లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం నాటి పాత డైలాగులు వినిపిస్తున్నారు. వైసిపిని తిడుతున్నారు తప్ప ఎందుకైనా మంచిదని టిడిపి, జనసేనల జోలికి వెళ్లటం లేదు. కర్మం చాలక పొత్తు కుదరకపోతే ఆ పల్లవీ ఎత్తుకుంటారేమో!
టిడిపిని చూడబోతే – బాబు దిల్లీ వెళ్లి వచ్చాక కిమ్మనటం లేదు. అక్కడే కాదు, యిక్కడికి వచ్చాక కూడా ప్రెస్‌తో ముచ్చటించ లేదు. ఈ పొత్తు ఓ ముఖ్యమైన మైలురాయి వంటి ప్రకటనలు యివ్వలేదు. చిరునవ్వులు చిందించలేదు. పవన్‌తో ఫోన్లో మాట్లాడేరేమో కానీ ప్రత్యక్షంగా కలవలేదు. అంతా లీకులతోనే కాలక్షేపం చేస్తున్నారు. దిల్లీ మీటింగుపై అంతా సస్పెన్సే! ఇనీషియేటివ్ ఎవరిది దగ్గర్నుంచి, అక్కడేం జరిగింది దాకా అంతా గోప్యమే. తనంతట తనే వెళ్లి కూటమిలో చేరమని కోరానని అనిపించుకోవడం బాబుకి యిష్టం లేదు. ఓటర్లు ఏదో అనుకుని పోతారన్న భయం ఆయనకు లేదు. యూటర్న్ బాబు మరో టర్న్ తీసుకున్నారని, ఆంధ్రా నీతీశ్ అని నిక్‌నేమ్ పెడతారని ఆయనకు చింత లేదు. వెన్నుపోటు, యూ టర్న్, యూజ్ అండ్ త్రో, విశ్వసనీయత లేదు.. యిలాటి విసుర్లు ఎన్ని వచ్చినా ఆయన చలించడు. ఏ ప్రశ్న వేసినా ‘మేం ఉన్నాంగా..’ అంటూ ఒకే సమాధానం యిచ్చే ఉడెన్ బోర్డుల వ్యాపారిలా ‘నేను హైదరాబాదు కట్టానుగా…’ అంటాడాయన.
ఆయన చింతంతా తన సహచరుల గురించి, కార్యకర్తల గురించి. ‘మనం బలంగా ఉన్నామని, వైసిపి తోస్తే పడిపోయే పేకమేడలా ఉందని, ఓటమి భయంతో వైసిపి నాయకులు పుంజాలు తెంపుకుని పారిపోయి మన గూట్లో చేరడానికి తహతహ లాడుతున్నారని మీడియా రాస్తోంది కదా, జనసేనతోనే మనకు పొత్తు అవసరమా? అని అనుకుంటూ ఉంటే యింకా యీ బిజెపిని కూడా నెత్తి కెత్తుకోవాలా?’ అని వారు అడుగుతున్నారు. ‘ఆ హైప్ ఓటర్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి క్రియేట్ చేయించినది, మీ కన్సంప్షన్‌కు కాదు, మన బలం తక్కువ, చెరో చంకలోనూ కర్రల ఊతం ఉంటే తప్ప మనం ముందుకు పోలేము’ అని బాబు ఓపెన్‌గా వారికి చెప్పలేరు కదా.
పొత్తు అనివార్యం అని వాళ్లను కన్విన్స్ చేయడమెలా అన్నదే బాబు ముందున్న పెద్ద టాస్క్. అందువలన ‘నేను కావాలని బిజెపి దగ్గరకు వెళ్లలేదు. వాళ్లే పిలిచారు, మాతో కలిసి నడు అని మొహమాట పెట్టారు, కాదనడం ఎలా?’ అని చెప్పడానికి చూస్తున్నారు. టిడిపి క్యాడర్‌కు నచ్చని విషయం కాబట్టి, ‘తప్పనిసరి తద్దినమై ఒప్పుకోవాల్సి వచ్చింది, అందుకే నేనేమీ సంతోషంగా ఎగిరి గంతేయడం లేదు’ అని చెప్పుకుంటూ పొత్తు సంగతి సింక్ కావడానికి వాళ్లకు కొంత సమయం యిస్తున్నారు. యథాప్రకారం ఆంధ్రజ్యోతి ఆ పనిలో ఉపయోగ పడుతోంది. ఫిబ్రవరి 11 నాటి ‘‘కొత్త పలుకు’’లో రాధాకృష్ణ ‘బాబు-అమిత్ సమావేశంపై రాష్ట్ర ప్రజల్లో (రాధాకృష్ణ భాషలో టిడిపి ఓటర్లే రాష్ట్ర ప్రజలు లెండి) మిశ్రమ స్పందన ఏర్పడింది. టిడిపి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ముస్లింల సంఖ్య అధికంగా రాయలసీమ వారు బిజెపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు.’ అని రాశారు.
అలా రాస్తూనే ‘బిజెపితో చేతులు కలపడం టిడిపికి అనివార్యంగా మారింది’ అంటూ ఆ పరిస్థితి బాబుకి ఎందుకు వచ్చిందో కారణాలిచ్చి, ఆయన పట్ల సహానుభూతి కలిగించాలని చూశారు. ఆయన వాదన సాగిన విధానమేమిటంటే – ‘మోదీ కేంద్రంలో అపరిమితమైన అధికారాన్ని చలాయిస్తూ, తమతో రాజీ పడని రాష్ట్ర ప్రభుత్వాలను యిబ్బందిపాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇతర పార్టీలు వృద్ధ నాయకత్వం కారణంగా మోదీని ఎదిరించే స్థితిలో లేవు. ఆంధ్ర ఎన్నికలలో నెగ్గడం బాబుకి ముఖ్యం. ఎన్నికలు సజావుగా సాగాలంటే కేంద్రం, ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ సహకారం అవసరం. లేకపోతే ప్రజల మద్దతున్నా వ్యర్థం. మోదీని నేరుగా ఢీకొంటే ఆత్మహత్య చేసుకోవడమే!’
ఏతావతా ఆయన తేల్చిందేమిటంటే ఎన్నికల వేళ కేంద్ర బిజెపితో పేచీ పెట్టుకుంటే నెగ్గలేరు. సఖ్యంగా ఉంటే ఎన్నికల కమిషనర్ కూడా సహకరిస్తారు అని. ఇది ఓ మేరకు నిజమనుకున్నా, పేచీ పెట్టుకున్న పార్టీలు ఎలా నెగ్గుతున్నాయన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. ఎల్లెడలా బిజెపియే నెగ్గటం లేదు కదా! బెంగాల్, పంజాబ్, హిమాచల్, తమిళనాడు, కేరళలలో బిజెపి ప్రత్యర్థులు గెలవలేదా? 2019లో ఆంధ్రలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటూ గెలవలేక పోయిందేం? అప్పటి కమిషనర్ మాట వినలేదా? పోనీ ఇటీవలే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెసు గెలిచింది కదా! బిజెపిని కాకుండా కాంగ్రెస్‌నే ప్రధాన శత్రువుగా పరిగణించిన కెసియార్‌ను బిజెపి గెలిపించ గలిగిందా? రేపు ఆంధ్రలో కూటమి గెలవకపోతే ఎన్నికల కమిషనర్ దగా చేశాడంటారా? కేంద్రంలోని బిజెపి మోసం చేసిందంటారా? 2014లో కూటమి నెగ్గినపుడు యుపిఏ హయాంలోని ఎన్నికల కమిషనర్ కుమ్మక్కు కావడం వలననే గెలిచారనే అర్థం తీయవచ్చా?
రాధాకృష్ణ ఎంతసేపూ ఎన్నికలను మేనేజ్ చేయడానికి బిజెపి అవసరం అంటున్నారు తప్ప రాజకీయ పరమైన ఆవసరం ఉందనడం లేదు. ‘నిజానికి యీ ఎన్నికల్లో బిజెపి అవసరం టిడిపికి గాని, ఆ పార్టీ అవసరం బిజెపికి గానీ లేదు.’ అని ఢంకా బజాయించి చెప్పారు. టిడిపి-జనసేన కూటమి కున్న బలం చాలని యీయన అనుకున్నా బిజెపి అనే రుక్మిణి వచ్చి తమ పళ్లెంలో తులసీదళం వేస్తే తప్ప త్రాసు తమ వైపు మొగ్గదని బాబు అనుకుంటున్నారు. అందుకే యీ తంటాలు. కానీ అది ఒప్పుకోవడానికి భేషజం. అందుకే యీ లీకులు, యీ రాతలు. బిజెపి వాళ్లే పిలిచి దేశ భవిష్యత్తు కోసం మీరు ఎన్‌డిఏలో చేరవలసినదే అని నచ్చచెప్పారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు ఆ దిశగా ఆలోచిస్తున్నారని తెలుగు మీడియాచే రాయిస్తున్నారు.
అక్కడి వరస చూస్తే అంత సీను ఉన్నట్లు కనబడటం లేదు. ఎవరు ఎవర్ని పిలిచారు స్పష్టంగా చెప్పండి అని అడిగితే సుజనా చౌదరి, ‘ఎవరు ఎవర్ని పిలిస్తే ఏముంది, సమావేశం జరిగిందా లేదా అది చూడండి చాలు’ అన్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అనే సామెత ఆయనకు వర్తిస్తుంది. ఆయన టిడిపి మనిషి, బిజెపిలో ఉన్నాడు. స్థానిక బిజెపి నాయకులు కొందరు ‘మేం పిలవడమేమిటి, ఎన్నోసార్లు అభ్యర్థనలు పంపిపంపి, పిలిచేట్లు చేసుకున్నారు’ అంటున్నారు. పురంధరేశ్వరి నా దగ్గర దేని గురించీ సమాచారం లేదని చెప్పి తప్పుకుంటున్నారు. సుజనా లాగానే టిడిపితో ఆవిడ మొహమాటాలు ఆవిడవి.
ఇక పవన్ విషయానికి వస్తే – బాబు-అమిత్ సమావేశం జరిగిన మర్నాడు ఆయన అక్కడ ఉండగానే పవన్ దిల్లీ వెళతారని వార్త వచ్చింది, అబ్బే బాబు వెనక్కి వచ్చి పవన్‌కు పరిస్థితులు వివరించి దిల్లీకి వెంట బెట్టుకుని వెళతారని మరో వార్త. పవన్ తన మంగళగిరి ఆఫీసు నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్లగానే యింకేముంది దిల్లీకే అన్నారు. తీరా చూస్తే బాబు వెనక్కి వచ్చేసరికి ఆయన హైదరాబాదు వెళ్లిపోయాడు. ఇప్పటిదాకా స్వయంగా కలిసినట్లు వార్త రాలేదు. అక్కడ కాదు, యిక్కడ కాదు, ఎక్కడా కలవలేరంటే పవన్ అలిగారనుకోవాలా? తనను పక్కన పెట్టి బాబు, అమిత్ మాట్లాడేసుకున్నారని ఫీలయ్యారా?
అమిత్‌తో ఎపాయింట్‌మెంట్ రాత్రి 8 గంటలకు అనుకున్నారు, 11.30కు జరిగింది. ఎప్పుడో ఒకప్పుడు సమావేశమంటూ జరిగింది కదా, బాబు వెళుతూ వెళుతూ తననూ వెంటపెట్టుకుని వెళ్లవచ్చు కదా, నాతో పొత్తులో ఉన్నానని చెపుతూ భాగస్వామితో చెప్పకుండా విడిగా వెళ్లడమేమిటని పవన్ చికాకు పడడంలో అర్థముంది. ‘అబ్బే అంకెలేవీ యిప్పుడే ఏమీ తేల్చలేదు. ఇది జస్ట్ ఐస్ బ్రేకింగ్ మాత్రమే. అసలైన చర్చలప్పుడు నువ్వు లేకుండా చేస్తామా?’ అని బాబు ఫోన్లో బుజ్జగించినా, యీ ఐస్ బ్రేకింగ్ నా ప్రమేయం లేకుండా జరిగిందనే భావన నా అనుయాయుల్లో కలిగితే నాకెంత డామేజి?’ అని పవన్ అనవచ్చు. అసలు యిప్పటికే ‘బాబుతో వ్యవహారం జాగ్రత్త, నిన్ను ఆటలో అరటిపండులా చూస్తున్నాడు, కరివేపాకులా వాడి పారేస్తాడు, సీట్ల విషయం గట్టిగా బేరమాడు’ అని ‘శ్రేయోభిలాషులు’, కాపు పెద్దలు ఊదర గొడుతున్నారు. దానికి తోడు యిప్పుడీ సంఘటన వాళ్ల హెచ్చరికలకు బలం చేకూర్చినట్లయింది. ‘చెప్పానా..’ అంటూ దెప్పడానికి పనికి వస్తుంది. అదీ పవన్ బాధ.
ఇలా కూటమిలోని మూడు పార్టీలూ మూడు రకాల బాధల్లో మునిగి ఉన్నాయి. ఎప్పణ్నుంచో ఆశిస్తున్న పొత్తు కనీసం గుడ్డు దశకైనా వచ్చినందుకు టిడిపి, జనసేన ఆనందాతిరేకంతో ఉబ్బి తబ్బిబ్బవ్వాలి. అమిత్‌తో సమావేశానికి బాబు వెళుతూంటే మినిట్-టు-మినిట్ కామెంటరీ యిస్తూ విపరీతంగా కవరేజి యిచ్చిన తెలుగు మీడియా తర్వాత గుంభనంగా, గంభీరంగా కనబడుతోంది. ఎందుకు? బిజెపి పెడుతున్న షరతులు దానికి కారణమా? అవి అంగీకరించలేక, తిరస్కరించలేక టిడిపి యిబ్బంది పడుతోందా? ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. కూటమి ప్రత్యర్థి ఐన వైసిపి దూసుకుని వెళ్లిపోతోంది. ఇక్కడ కూటమిలో చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లో తేలాలి, ఎక్కడో తేలాలి, అభ్యర్థి ఎవరో తేలాలి. ప్రతీదీ ప్రణాళికాబద్ధంగా చేసి, క్యాడర్‌ను చాలా ముందుగా చైతన్యవంతం చేసే బిజెపి ఎందుకింత జాప్యం చేస్తోంది. ‘‘బెట్టా? సాధింపా? వ్యూహమా?’’ అనే వ్యాసంలో చర్చిద్దాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2024)