నాగబాబు అంటే మెగా బ్రదర్. జనసేన నేత. ఆయన ఏమిటి కేరాఫ్ ఎలమంచిలి ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా. అవుని ఇది నిజం. నాగబాబు ఎలమంచిలిలో నివాసం ఉండబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ఏపీకి వస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇక మీదట తన నివాసం అని చెబుతున్నారు.
నాగబాబు గత వారం కొన్ని రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆయన అనకాపల్లి నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపీగా పోటీ చేస్తారు అని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దానికి నో అని మాత్రం నాగబాబు చెప్పలేదు. పార్టీ అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది అని మాత్రమే అన్నారు. నాగబాబు అనకాపల్లి నుంచి పోటీకి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తూ సోదరుడిని ఢిల్లీలో ఉంచాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆలోచనలో భాగంగా నాగబాబు ఎంపీకి పోటీ చేయబోతున్నారు అని తెలుస్తోంది.
నర్సాపురం నుంచి గత ఎన్నికల్లో పార్లమెంట్ కి పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలు అయ్యారు. ఈసారి నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్ధి పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో నాగబాబు అనకాపల్లికి షిఫ్ట్ అవుతున్నారు. అని అంటున్నారు.
ఇప్పటి దాకా విశాఖ ఎంపీ సీటు మాత్రమే వలసవాదుల చేతులలో ఉంది. ఎక్కడ నుంచో వచ్చి ఎన్నికల వేల దిగిపోయి ఎంపీ అయిపోయాక ఎక్కడో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడమే జరుగుతూ వస్తోంది. ఇతర జిల్లాల వారంతా విశాఖ వైపు అందుకే ఆసక్తిని చూపిస్తారు. కానీ అనకాపల్లి ఎంపీ సీటు మాత్రం అందుకు భిన్నం.
ఇక్కడ పక్కా లోకల్ నే ఎపుడూ గెలిపిస్తారు. 2009లో ఇద్దరు స్థానికేతరులు పోటీ చేస్తే లోకల్ గా ఉన్నారనే కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించిన చరిత్ర అనకాపల్లికి ఉంది. ఇపుడు వాటిని పరిగణనలోకి తీసుకున్నట్లుంది నాగబాబు తాను ఎలమంచిలిలో నివాసం ఉంటాను అని ముందే ప్రకటన చేస్తున్నారు.
ఆయన ఎలమంచిలిలో ప్రజలకు అందుబాటులో ఉంటాను అని హామీ ఇస్తున్నారు. అయితే ఎంత ఇక్కడ ఉన్నా నాగబాబు స్థానికేతరుడే అన్న భావన వస్తే మాత్రం ఫలితాలు వేరే విధంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ కులం ప్రాధాన్యత కూడా ఉంటుంది. లోకల్ కార్డు గెలుస్తుందా కులం గెలుస్తుందా అన్నది కూడా చూడాలి.