తాడిప‌త్రిలో ఏం జరుగుతోంది?

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజకవర్గాన్ని సుమారు నాలుగు దశాబ్దాలుగా ఏక ఛత్రాధిపత్యం సాగించిన జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో అడ్డుక‌ట్ట పడడంతో 2024 ఎన్నికలు వారి కుటుంబానికి కీలకంగా మారాయి. జేసీ ఫ్యామిలీ పరిస్థితి…

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజకవర్గాన్ని సుమారు నాలుగు దశాబ్దాలుగా ఏక ఛత్రాధిపత్యం సాగించిన జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో అడ్డుక‌ట్ట పడడంతో 2024 ఎన్నికలు వారి కుటుంబానికి కీలకంగా మారాయి. జేసీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందంటే ఈసారి ఓడిపోతే ఇంకా రాజకీయంగా జేసీ ఫ్యామిలీ కనుమరుగవ్వడమే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దాంతో 70 పదుల వయసులో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని ఊరు.. ఊరు తిరుగుతూ ఇన్ని రోజులు తన అహంకారంతో దూరం చేసుకున్న కార్యకర్తలను కలుస్తూ తన కొడుకుని గెలిపించాలని వేడుకుంటున్నారు. త‌న కొడుకు అస్మిత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉండి అప్ప‌డ‌ప్పుడు నియోజ‌వ‌ర్గానికి వ‌స్తున్న‌ త‌ను మాత్రం నియోజ‌వ‌ర్గంలోనే ఉంటూ కొడుకు విజ‌యం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు

మరోవైపు పక్క నియోజవర్గంలోని ఎంపీపీ స్థాయి నాయకుడు ఆయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ అస్మిత్ రెడ్డిని ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు. తనకంటే ధనికుడు బలవంతుడైన వారిని ఓడించడంలో త‌న‌ రాజకీయ చతురతో పాటు అప్పట్లో జగన్ హావా కూడా కలిసి వచ్చింది. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్ప‌టి నుండి జేసీ ఫ్యామిలీ నుండి వ‌స్తున్న విమ‌ర్శ‌లు అన్నిఇన్ని కావు. తాడిప‌త్రి మున్సిపల్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత‌ 2024లో తాడిపత్రి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం.

తాడిపత్రి పేరుకు సిమెంట్ ఫ్యాక్టరీలు, నాపరాల ఫ్యాక్టరీలు అంటారు కానీ ముఖ్యంగా మోజారిటీ ప్ర‌జ‌లు ఆధారపడేది వ్యవసాయంపైనే.  వైయస్ జగన్ సీఎం అయినప్పుడు నుంచి బాగా వర్షాలు పడడంతో నియోజకవర్గంలో పంటలు బాగా పండాయి. నియోజ‌వ‌ర్గంలోని ముచ్చుకోట రిజర్వాయర్, పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు డ్యాం నీరు నింపడంలోనూ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని రైతులందరూ మెచ్చుకుంటున్నారు. కొంత మేర‌ పెద్ద‌ప‌ప్పూరు మండలానికి సంబంధించిన‌ రైతుల‌కు నీటి స‌మ‌స్య‌లు పెద్ద‌గా లేక‌పోయిన ఈ సారి మాత్రం వ‌ర్షాలు సరిగా ప‌డ‌క‌పోవ‌డంతో పెద్దవడుగూరు, యాడికి మండ‌లాల్లో ఇప్ప‌టికే మిర్చి రైతులు బాగా న‌ష్టపోయారు.

అలాగే నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఉద్యాన పంటలు విపరీతంగా ఉండడం వల్ల మెజారిటీ ప్రజలు ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ పై ఆధారపడతారు. జగన్ సీఎం అయినప్పుడు నుంచి డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీలు పట్టించుకోలేదనే అపవాద ఎమ్మెల్యేకి తగులుకుంది. దాంతో పాటు జేసీకి వ్య‌తిరేకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను ఎమ్మెల్యే ప‌ట్టించుకోలేద‌ని అప‌వాదు కూడా ఉంది. దీంతో పాటు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రోజు మీడియా ముందుకు వ‌చ్చి తాడిప‌త్రి ప‌ట్ట‌ణంలో ఎమ్మెల్యే అభివృధిని అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్న అధికార పార్టీ నుండి వాటికి కౌంట‌ర్ ఇచ్చే నాయ‌కులు క‌రువైయ్యారు. ఎమ్మెల్యే, త‌న ఇద్ద‌రు కొడుకులు నియోజ‌వ‌ర్గం మొత్తం తిరుగుతున్న గ‌తంలో జేసీ కుటుంబం చేసిన దోపిడిని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డంలో వెనుక‌బ‌డ్డార‌ని వైసీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. 

ఇంక జేసీ ప్రభాకర్ రెడ్డి విష‌యానికి వ‌స్తే త‌న అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రికి షాడో ఎమ్మెల్యేగా పని చేసేవారు. మాట‌కు ముందు మాట‌కు త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను తిట్టి.. నేనే పెద్ద రౌడీ అని బ‌హిరంగంగా చెప్పుకున్న ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న‌ నోటి నుండే స్వామి, అమ్మ‌, అయ్యా అనే మాటలు వింటున్నాం. రాష్ట్రం మొత్తం మున్సిపల్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తే ఎమ్మెల్యేగా చేసిన ఆయ‌న స్వ‌యంగా వార్డు మెంబ‌ర్‌గా గెలిచి తాడిప‌త్రి మున్సిపల్ ఛైర్మ‌న్ అయ్యాడు. మున్సిపల్ ఛైర్మ‌న్ అయిన‌ప్ప‌టికి నుండి త‌న‌లోని న‌టుడిని బ‌య‌టికి తీసి రోడ్డుపైనే స్నానం చేయ‌డం, ప‌డుకోవ‌డం చేస్తు రాజ‌కీయం ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఇన్ని రోజులు ఎవ‌రిని లెక్క‌చేయ‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌లు పిల‌వ‌క‌పోయిన వారి ఇంటికి వెళ్లి మ‌రి తాయిళాలు ఇస్తూ వారిని త‌న‌తో న‌డ‌వాల‌ని వేడుకుంటున్నారు. ఇటీవ‌లే యువచైతన్య బస్సుయాత్ర పేరుతో నియోజ‌వ‌ర్గంలోని గ్రామాల‌కు వెళ్లి కార్య‌క‌ర్త‌ల‌కు విందులు ఇస్తూ.. ఎక్కడికిక్కడ స్థాయిని బ‌ట్టి భారీ మొత్తంలో గ్రామ అభివృధి పేరుతో నాయ‌కుల‌కు డ‌బ్బులు కూడా ఇస్తున్నార‌నే వార్త‌లు కూడా విన‌వ‌స్తున్నాయి. 

మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచి జేసీ ఫ్యామిలీకి రాజకీయంగా సమాధి క‌ట్ట‌లాని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రోవైపు త‌న కొడుకును ఎమ్మెల్యే చేసి జేసీ ఫ్యామిలీ ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంకా ప్ర‌భాక‌ర్ రెడ్డి అన్న దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం ప్ర‌స్తుతానికి తాడిప‌త్రి రాజకీయ క్షేత్రంలో ఎక్క‌డ క‌న‌ప‌డ‌టం లేదు. జేసీ ప‌వ‌న్‌కు అనంత‌పురం ఎంపీ లేదా అనంత‌పురం ఎమ్మెల్యే టికెట్ అడిగిన చంద్ర‌బాబు నో చెప్ప‌డని అందుకే దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, జేసీ ఫ్యామిలీ అరాచ‌క‌లే త‌న‌ను గెలిస్తాయానికి ఎమ్మెల్యే భావిస్తుంటే.. ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌తో పాటు యాంటీ గ‌వ‌ర్న‌మెంట్ ఓటు త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని జేసీ ఫ్యామిలీ భావిస్తోంది. జేసీ ఫ్యామిలీ గెలిచి త‌న ప‌రువు నిల‌బెట్టుకుంటారా? ఓడిపోయి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటుందా? అనేది మ‌రో మూడు నెల‌ల్లో తెలుస్తుంది.