ఈ నెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ఎన్నికల సన్నాహక భారీ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని భీమిలి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సభలో జగన్ తన శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సిద్ధం చేసేందుకు… తాను అభిమన్యుడుని కాదని, అర్జునుడిని అంటూ ఊపు తెప్పించే ప్రసంగం చేశారు.
భీమిలి సభ సక్సెస్‌తో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో రెండోసభ చేపట్టారు. దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండు సభలు వైసీపీ శ్రేణుల్లో మళ్లీ అధికారంపై భరోసా నింపాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడో సభ అనంతపురం జిల్లా రాప్తాడులో.. ఆ రెండింటికంటే మిన్నగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో 10 లక్షల మందితో సభను అత్యద్భుతంగా నిర్వహించి, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ సభకు అనంతపురం, ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణుల్ని తరలించేందుకు నాయకులు తలమునకలయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు నుంచి కూడా ఈ సభకు జనం వెళ్లనున్నారు. ఈ ఒక్క నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి ఇన్‌చార్జ్ కావడంతో, అక్కడి నుంచి కూడా పార్టీ శ్రేణుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాయలసీమ వైసీపీకి కంచుకోట. అందుకే రాప్తాడు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో ఈ దఫా టీడీపీ గ్రాఫ్ కొద్ది మేరకు పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే మరోసారి వైసీపీ ప్రభుత్వమే రాబోతోందనే సంకేతాలు ఇవ్వడం ద్వారా, పక్క చూపులు చూసేవారికి ఓ హెచ్చరిక ఇచ్చేందుకు ఈ సభను వాడుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది.