ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో ముఖ్యమంత్రి వైఎస్ ఇవాళ భేటీ కానున్నారు. ఏపీ న్యాయ వ్యవస్థకు సంబంధించి ముఖ్యులతో భేటీ కానుండడం ఇదే మొట్టమొదటిసారి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ మొదటిసారి తన స్వస్థలానికి వచ్చిన సందర్భంలో ఏపీ సర్కార్ ఘన స్వాగత ఏర్పాట్లు చేసింది. ఎన్వీ రమణ దంపతులను జగన్ దంపతులు మొదటిసారి కలుసుకుని శుభాకాంక్షలు చెప్పారు.
స్టేట్ గెస్ట్ హౌస్‌లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు పీకే మిశ్రాతో జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు మరికొందరు న్యాయమూర్తులు, నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
న్యాయ వ్యవస్థ, ఏపీ సర్కార్ మధ్య ఘర్షణ వాతావరణ నెలకుంది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అసలు రాజధానిపై చట్టం చేసే హక్కు ఏపీ అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఏకంగా చట్టసభలో హైకోర్టు తీర్పుపై చర్చనే చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం భేటీ సర్వత్రా ఆసక్తి నెలకుంది.