ఆచార్య టీజర్ రిలీజైంది, కాజల్ కనిపించలేదు. టీజర్ కాబట్టి హీరోలకు ప్రాధాన్యం ఇచ్చారని అంతా అనుకున్నారు. తర్వాత ట్రయిలర్ రిలీజైంది, మళ్లీ కాజల్ కనిపించలేదు. మరో స్పెషల్ టీజర్ ఉందేమో అనుకున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా రాలేదు. ఆమె రీసెంట్ గా బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి గైర్హాజరైందని అనుకున్నారు. కానీ అసలు మేటర్ అది కాదు.
ఇన్నాళ్లూ ఆచార్యలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లు అనుకున్నామంతా. కానీ ఈ సినిమాలో పూజా హెగ్డే మాత్రమే హీరోయిన్. కాజల్ సినిమాలో లేదు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. ఫస్ట్ షెడ్యూల్ లోనే కాజల్ ను కట్ చేశారంట.
“కాజల్ ది ధర్మస్థలిలో ఉండే ఓ సరదా క్యారెక్టర్. సాధారణంగా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలుంటాయి. కానీ ఈ సినిమాలో ఆచార్య పాత్రకు ప్రేమ ఉండదు, కథ ప్రకారం ఉండకూడదు కూడా. అయినప్పటికీ కమర్షియల్ ఫార్మాట్ లో హీరోయిన్ ను పెడతాం కాబట్టి కాజల్ ను తీసుకున్నాం. ఫస్ట్ షెడ్యూల్ లో 3-4 రోజులు షూట్ చేశాం. కాజల్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే చిన్న డౌట్ ఉంది. షూట్ చేసిన తర్వాత చూసుకుంటే ఆ డౌట్ ఇంకా పెరిగింది.
అంత పెద్ద హీరోయిన్ ను పాటల్లేకుండా, కథతో సంబంధం లేకుండా, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టడం కరెక్ట్ కాదు. ఆ పాత్రకు కంక్లూజన్ కూడా సరిగా లేదు. అలా ఊరికే పెట్టడం తప్పు అనిపించింది. ఇదే విషయం చిరంజీవి గారికి చెప్పాను. ఆ తర్వాత కాజల్ కు కూడా వివరించాను. ఆమె సింపుల్ గా నవ్వి ఓకే అన్నారు. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆచార్య సినిమాలో కాజల్ లేదు.”
ఆచార్యకు సంబంధించి రిలీజ్ చేసిన లాహే లాహే సాంగ్ లో కాజల్ ఉంది. నవ్వుతూ, కొన్ని స్టెప్పులు కూడా వేసింది. మరి ఆ పాటలోనైనా ఆమె ఉంటుందా అనే ప్రశ్నకు సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు దర్శకుడు కొరటాల. మొత్తానికి ఆచార్యలో కాజల్ లేదనే విషయం మాత్రం స్పష్టమైంది.