చెప్పను బ్రదర్ అనగానే గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. ఓ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి ఏదైనా చెప్పమని అభిమానులు కోరినప్పుడు.. చెప్పను బ్రదర్ అన్నాడు బన్నీ. ఆ తర్వాత జరిగిన వివాదాలు, ప్యాచప్ లు అన్నీ తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో ఎపిసోడ్ మొదలైంది. ఈసారి రామ్ చరణ్ వంతు. ఈయన 'తెలియదు బ్రదర్' అంటున్నాడు.
ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఇందులో సిద్ధ అనే పాత్ర పోషించాడు చరణ్. సినిమాలో దాదాపు 40 నిమిషాల పాటు ఉండే ప్రత్యేకమైన పవర్ ఫుల్ రోల్ ఇది. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా మహేష్ బాబును అనుకున్నారు. మహేష్ కూడా ఓకే చెప్పాడు.
సిద్ధ పాత్రకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని అప్పట్లో దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. ఆ తర్వాత ఆ పాత్ర కోసం మహేష్ ను పక్కనపెట్టి, రామ్ చరణ్ ను తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఉన్న రామ్ చరణ్ ను, చిరంజీవి ప్రత్యేకంగా లాబీయింగ్ చేసి మరీ ఆచార్య కోసం తీసుకొచ్చారు. అది తన భార్య సురేఖ కోరిక అని కూడా చెప్పుకొచ్చారు చిరంజీవి.
ఆచార్యలో ఆ పాత్ర వెనక అంత కథ నడిచింది. ప్రపంచం మొత్తానికి అది తెలుసు. కానీ పాపం రామ్ చరణ్ కు తెలియదంట. తను సిద్ధ పాత్రను అంగీకరించడానికి ముందు నిర్మాతలు, ఏ హీరోలను సంప్రదించారో తనకు తెలియదన్నాడు చరణ్. ఈ ఒక్క విషయంలో తను కూడా ఆచార్య నిర్మాతనే అనే విషయాన్ని మరిచిపోయాడు.
మహేష్ ను సంప్రదించారనే విషయం తనకు తెలియదంటూ చరణ్ చేసిన ఈ ప్రకటన రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది ఆచార్య.