తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారం అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు తరచూ స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. ఇది కొంత వరకూ నిజమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అనేక రాజకీయ జన్మను పొందారు. అయితే వారిలో నూటికి 90 మంది ఎన్టీఆర్ నాయకత్వంలో రాజకీయ జన్మను పొందిన వారు మాత్రమే! తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చాకా ఆ పార్టీ తయారు చేసిన నేతలు ఎంతమంది? అనేది అసలైన ప్రశ్న!
చంద్రబాబు టీడీపీ అధినేత అయ్యాకా.. తెలుగుదేశం పార్టీలో ప్రస్థానం ప్రారంభించి, జిల్లా స్థాయి నేతలుగా, రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగిన వారిని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. రాజకీయ వారసులను పక్కన పెడితే.. చంద్రబాబు తయారు చేసిన నేతలు ఎంతమంది?
కమ్మ సామాజికవర్గంలో చంద్రబాబు నాయుడు చాలా మంది నేతలను తయారు చేసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంకు అండగా నిలిచిన బీసీల్లో మాత్రం చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్న నేతల సంఖ్య చెప్పుకోవడానికి ఏమీ లేదు.
మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు టీడీపీ ని శాసిస్తున్నా… నియోజకవర్గ స్థాయిని మించిన బీసీ నేతలను చంద్రబాబు తయారు చేయలేదు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అదే కాలువ శ్రీనివాసులు, అదే పార్థ సారధి. ఇప్పటికీ వారే బీసీ నేతలు! వారేమో కనీసం సొంత నియోజకవర్గాల్లో నెగ్గలేకపోయారు. ఇప్పుడు వారే మళ్లీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ చార్జిలు.
చంద్రబాబు నాయుడు కథ ఇలా కొనసాగుతూ ఉంటే, బీసీల్లో కొత్త నేతలను తయారు చేస్తున్నారు వైఎస్ జగన్. మంత్రి పదవుల విషయంలో అయినా, జిల్లా స్థాయి నాయకత్వం విషయంలో అయినా.. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడంలో ముందుడటం గమనార్హం. మాటలతో కన్నా చేతలతో ఈ విషయంలో జగన్ నిరూపించుకుంటున్నారు.