గతంలో పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. పోలీసులు అడ్డుకున్నా నిరసనకారులు మారువేషాల్లో వచ్చి మరీ విజయవాడ నగర వీధుల్లో బలప్రదర్శన చేశారు. సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వార్తలొచ్చాయి. కట్ చేస్తే ఆ తర్వాత ఏపీ డీజీపీ మారిపోవడానికి కూడా కారణం అదే అనే ప్రచారం జరిగింది.
మళ్లీ ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ అవుతుందా? ఈరోజు చలో సీఎంఓ పేరుతో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు విజయవాడకు తరలి వస్తున్నారు. పోలీసులు మాత్రం ఈసారి మరింత కఠినంగా ఉన్నారు. ఉపాధ్యాయులకు సెలవలు కూడా రద్దు చేశారు. మరి ఈరోజు ఏం ఏం జరగబోతోంది..?
ఉద్యోగుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్ని ప్రభుత్వం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం. ఒకవేళ అడ్డుకుంటే ఎలాంటి పరిణామాలుంటాయి. కోరి వారితో వైరం పెంచుకోవడం అవసరమా, లేక శాంతి చర్చలు జరిపి వారిని సముదాయించడం మంచిదా..?
ఇలా బుజ్జగిస్తూ పోతే అందరూ గొంతెమ్మ కోర్కెలు కోరుతుంటే రాష్ట్ర ఖజానా భరించగలదా..? ఇది ఓ పెద్ద డిస్కషన్ పాయింట్. అయితే ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ గురించే మా పోరాటమంతా అంటున్నారు. సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ నాయకులు కదం తొక్కుతున్నారు.
ప్రతిష్టకు పోతున్న ప్రభుత్వం..
ఈసారి విజయవాడలో మరో బలప్రదర్శన జరగడానికి వీలు లేదంటూ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లడానికి ఎవరికీ ఎలాంటి అనుమతి లేదని, విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు.
విజయవాడలో పోలీస్ యాక్ట్..
అల్లర్లు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా విజయవాడ నగరంలో పోలీస్ యాక్ట్-30, సీఆర్పీసీ 144 ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు పోలీసులు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశముంది. ఇప్పటికే కొంతమంది నాయకులకు నోటీసులిచ్చారు.
ఇక ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఈరోజు సెలవు కూడా రద్దు చేసింది. అయినా కూడా టీచర్లు ముందడుగు వేస్తే ఎలాంటి పరిణామాలుంటాయోననే ఆందోళన అందరిలో ఉంది. పీఆర్సీ సాధన కోసం ఆరోజు విజయవాడలో జరిగిన సీన్, ఈరోజు రిపీట్ అవుతుందా..? అప్పుడు ఆందోళనకారుల్ని చూసీ చూడనట్టు వదిలేసిన పోలీసులు, ఇప్పుడు ఎలా అడ్డుకోడానికి సిద్ధమయ్యారు. మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.