ఈ తరంలో మ్యారిడ్ లైఫ్ ను ఆనందం ఉంచడం సంగతలా ఉంటే, దాంపత్యంలో కొనసాగడం కూడా అంతే తేలికైన అంశం కాదు. ఏదో అడ్జస్ట్ అయిపోతూ లేదా బోలెడంత అసంతృప్తితో దాంపత్య జీవితాలను కొనసాగించే వారు, పెళ్లై ఎన్నేళ్లైనా పూర్తి స్థాయిలో పరస్పరం అర్థం చేసుకోలేని వాళ్లు ఎంతో మంది ఉండవచ్చు. మరి ఆనందకరమైన దాంపత్యం గురించి ఏం చేయాలి? అనే అంశం గురించి గూగుల్ గాలించే వారూ ఉండవచ్చు.
అయితే ఏం చేయాలో అనే సంగతలా ఉంచితే, ఆల్రెడీ తాము దాంపత్యంలో సుఖంగా ఉన్నామని చెప్పే వారి అనుభవాలు చాలా విలువైనవి! అనుభవపూర్వకంగా వీరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే.. మిగతా వారికి ఆ అనుభవాలు పాఠాలు కాగలవు. మరి ఇంతకీ దాంపత్యంలో ఆనందంగా ఉన్న వారు ఏం చేస్తున్నారో.. వారే చెప్పినవి ఏమిటంటే!
వీలైనప్పుడు వెకేషన్!
ఎంత బిజీగా ఉన్నా, వృత్తిలో వీలు చిక్కే అవకాశం తక్కువే అయినా… కనీసం ఏడాదికోమారు దంపతులు ఒక వెకేషన్ ను ప్లాన్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. పిల్లలతో కలిసి పక్కా ప్లాన్డ్ గా వెకేషన్ వెళితే అది దాంపత్య జీవితం సాఫీగా సాగేందుకు తన వంతు పాత్ర పోషిస్తుందని అంటారు.
వెకేషన్లు ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావొచ్చు, అలాగని ప్రతి ఒక్కరూ ఫారెన్ కంట్రీస్ కు వెళ్లనక్కర్లేదు కూడా! ప్లాన్ చేసుకోవాలి కానీ పరిమిత బడ్జెట్ లలో కూడా ఇలాంటి రిఫ్రెష్ మెంట్ ను పొందవచ్చు. ఇలాంటి సందర్భాలు దంపతులను మరింత దగ్గర చేస్తాయనేది అనుభవపూర్వకంగా చెప్పే వారి మాట.
ఆర్థిక విషయాల గురించి చర్చ తప్పనిసరి!
విడాకులు తీసుకునే జంటలకు సంబంధించి చాలా కీలకమైన అంశం ఆర్థికపరమైన వ్యవహారాలే ఉంటాయట! వైవాహిక జీవితం నుంచి వేరు దారులు చూసుకునే వారి మధ్యన ఆర్థిక పరమైన పరస్పర అవాగాహన లేకపోవడం కూడా కీలకమైన రీజన్ అట. మరి ఈ రకంగా చూసుకుంటే.. వీలైనంత తరచూ ఆర్థిక పరమైన అంశాల గురించి చర్చించుకునే వారు తమ వైవాహిక జీవితాన్ని సాఫీగా నడిపించేందుకు అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా తమ పరిస్థితి ఏమిటో పరస్పరం చర్చించుకోగలిగితే.. లేనిపోని ప్లాన్లు ఏకపక్షంగా చేసే అవకాశం కచ్చితంగా తగ్గిపోతుంది. అందుకే ఆర్థిక విషయాల గురించి చర్చ, పరస్పర అవగాహన దాంపత్యంలో కీలకమైన అంశం.
సెక్స్ వల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా!
వయసులో ఉన్నంత వరకూ తరచూ సెక్స్ అనేది దాంపత్యాన్ని ఆనందంగానే మార్చుతుంది తప్ప ఇందులో ఎలాంటి నెగిటివిటీకీ తావు లేవు. ఈ విషయంలో అపరిమితంగా, వీలైనంతగా, వీలైన చోట సెక్స్ అనేది దాంపత్య బంధాన్ని మరింత పటిష్టపరుస్తుంది.
ఈ విషయంలో చొరవ ఎవరిదైనా.. సెక్స్ వల్ గా ఎక్స్ పెరిమెంట్స్ చేయడం కూడా పరస్పరం ఆస్వాధించదగిన అంశం. సెక్స్ పట్ల ఎవరో ఒకరికి అనాసక్తి, వృత్తిలో బిజీగా ఉంటూ లేదా అలసిపోతూ సెక్స్ కు దూరం కావడం మాత్రం దాంపత్యంలో అసంతృప్తి పేరుకుపోవడంలో తీవ్రమైన పాత్రను పోషించవచ్చు.
కలిసి టీవీ షో లు చూసే వారు!
వేర్వేరు అభిరుచులు ఉండవచ్చు గాక, ఇద్దరూ కలిసి ఏ టీవీ షోనో, మరే వెబ్ సీరిస్ నో చూస్తూ ఉంటే, ఆ తరహా ఫ్రెండ్షిప్ మరింత పెరుగుతుంది. బహుశా దగ్గరి తనం పెంచుకోవడానికి ఇదొక చక్కటి మార్గం!
కలిసి ఇల్లు క్లీన్ చేసుకోవడం!
ఇల్లు క్లీన్ చేయడం అనేది ఆడవారి బాధ్యతగా చూడటం రొటీనే. ఒకవేళ ఇలాంటి అంశాల్లో చేదోడువాదోడుగా ఉంటే.. ఇది పరస్పర అవగాహన మంచి స్థాయిలో ఉందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ! ఇవీ ఆనందంగా దాంపత్యాన్ని సాగిస్తున్న వారు చెప్పే అనుభవాలు.