చిన్న ఎగ్జిబిషన్ లేదా సంత జరిగితే చాలు, అక్కడ కచ్చితంగా కనిపించే పదార్థం పీచు మిఠాయి. ఇది కనిపిస్తే పిల్లలు మారాం చేయకుండా ఉండలేరు. పెద్దలు కూడా చవగ్గా దొరుకుతుందని పిల్లలకు కొనిస్తుంటారు. కానీ ఇందులో కలిపే రసాయనాల సంగతేంటి?
పీచు మిఠాయిని రకరకాల రంగుల్లో విక్రయిస్తుంటారు. పిల్లల్ని ఆకర్షించేందుకు ఎక్కువగా ఊదా రంగు, ఎరుపు రంగుల్లో పీచు మిఠాయిలు తయారుచేస్తుంటారు. అయితే ఈ రంగులు ఎంత సురక్షితం. చాలామంది ఫుడ్ కలర్స్ బదులు, ఎక్కువసేపు రంగు పోకుండా ఉండేందుకు అత్యంత ప్రమాదకరమైన రోడోమైన్-బి లాంటి కెమికల్స్ వాడుతున్నారు.
ఈ కెమికల్స్ ఎక్కడ వాడతారో తెలిస్తే, వెన్నులో వణుకు గ్యారెంటీ. రోడోమైన్-బి లాంటి కెమికల్స్ ను లెదర్ చెప్పులకు రంగులు వేసేందుకు వాడతారు. దీంతో పాటు దుస్తులు, ఫ్లెక్సీ ప్రింట్ లో ఉపయోగిస్తారు. ఇంతటి ప్రమాదకరమైన పదార్థాల్ని తమిళనాడులో పీచు మిఠాయిలో వాడుతున్నారు, పిల్లలకు వాటిని అందిస్తున్నారు.
తాజాగా నిర్వహించిన ల్యాబ్ టెస్టుల్లో ఈ హానికారిక రసాయనాల్ని వాడుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది.
రోడోమైన్-బి లాంటి కెమికల్స్ తో చేసిన పదార్థాలు తిన్నప్పుడు ఆ రంగు మన శరీరంలో 60 రోజుల పాటు అలానే ఉండిపోతుంది. ఇది శరీరం నుంచి బయటకు వెళ్లదు. మల-మూత్ర విసర్జక వ్యవస్థలు ఈ కెమికల్ ను బయటకు పంపించలేవు.
అలా శరీరంలో 2 నెలల పాటు ఉండే ఈ కెమికల్స్.. మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం చూపిస్తాయి. ప్రేగుల్లో నాన్-హీలింగ్ అల్సర్లుగా మారుతాయి. ఆ తర్వాత దశ కాన్సర్. రెగ్యులర్ గా పీచు మిఠాయి తినేవాళ్లు కాన్సర్ బారిన తొందరగా పడతారని వైద్యులు చెబుతున్నారు.
తమిళనాడులో జరిగిన పరిణామాలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పీచు మిఠాయి తయారీ, విక్రయాలపై అందరి దృష్టి పడింది. ఎన్ని ప్రాంతాల్లో పీచు మిఠాయిల్ని పరీక్షిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పుడో 2006లో తయారుచేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ ను కూడా మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇకనైనా పిల్లలతో బయటకు వెళ్లేటప్పుడు పీచు మిఠాయి కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.