నేను ఎన్నికల్లో పోటీ చేయను అని ఎప్పుడూ అనలేదు అంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు. అనకాపల్లి ఎంపీ సీటు విషయం తొందరలో తెలుస్తుంది అని ఆయన అంటున్నారు. కానీ నాగబాబే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి అని ప్రచారం సాగుతోంది. లిస్ట్ లేట్ గా రిలీజ్ అయినా ముందే నాగబాబు రంగంలోకి దిగిపోయారు అందుకే అంటున్నారు.
నాగబాబు వరసబెట్టి మీటింగ్స్ పెడుతున్నారు. పార్టీని సమాయత్తం చేస్తున్నారు. నాగబాబు ఎంపీగా పోటీ చేయడం తధ్యం అని తెలుస్తున్న క్రమంలో వైసీపీ నుంచి ఎవరు అభ్యర్థి అన్న దాని మీద ఆసక్తి పెరుగుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ని పోటీ చేయించాలని అనుకున్నా బీసీ అభ్యర్థుల వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గవర, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు గతంలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. వీరి నుంచే కొత్త అభ్యర్ధిని ఎంపిక చేసి నాగబాబుతో పోటీకి దించుతారు అని అంటున్నారు. మహిళా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆమె కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమెకు టికెట్ ఇస్తే మహిళా ఓట్లతో పాటు పాటు బీసీ సామాజిక వర్గ సమీకరణలు కూడా ప్లస్ అవుతాయని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అలాగే గవర సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని కూడా దించే ఆలోచన ఉంది అంటున్నారు. 2009లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎంపీగా ఇక్కడ నుంచి పోటీ చేసినపుడు వెలమ అభ్యర్ధి ఇక్కడ గెలిచారు. 2014లో కాపు అభ్యర్ధిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గెలిచారు. 2019లో గవర సామాజిక వర్గానికి చెందిన వారు గెలిచారు. దాంతో పాటు చూస్తే అత్యధిక శాతం గెలిచిన వారు గవర సామాజిక వర్గం నేతలే ఉన్నారు. దాంతో బీసీ కార్డుతో పాటు బలమైన సామాజిక వర్గం అండతో నాగబాబుని ఢీ కొట్టాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.