రాజధాని ఫైల్స్ అని సినిమా వచ్చింది. అది చాలా బాగుందని టీడీపీ నేతలు పొగుడుతున్నారు. అది సినిమా కాదు యధార్థ సంఘటనలకు ప్రతిరూపం అంటున్నారు. మీడియా మీటింగ్ పెట్టి మరీ రాజధాని ఫైల్స్ బ్రహ్మాండంగా తీసారు అని కొనియాడుతున్నారు. ప్రతీ సన్నివేశం ఎక్కడో అక్కడ టచ్ చేస్తుందని అంటున్నారు.
వైసీపీ నేతలు దీని మీద కౌంటర్ వేస్తున్నారు. అమరావతి రాజధాని పేరు మీద జరిగిన భూ దందా మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. అసలైన కధలు చెప్పాలంటే వంద సినిమాలు అమరావతి రాజధాని మీద తీయాలని కూడా అంటున్నారు ప్రజలకు అన్నీ తెలుసు అని కూడా టీడీపీ నేతల మీద సెటైర్లు వేస్తున్నారు.
రాజధాని ఫైల్స్ ఒక సినిమా. రాజకీయాలలో ఇపుడు ఒక్కో రాజకీయ పార్టీ ప్రత్యర్ధుల మీద సినిమాల మీద సినిమాలు తీసే పోటీ వాతావరణం నడుస్తోంది. అమరావతి రాజధాని మీద సినిమా వచ్చింది. అలాగే విశాఖ మీద సినిమా వస్తే బాగుంటుంది అని అంటున్న వారూ ఉన్నారు.
విశాఖ రాజధాని అన్నది ఈ రోజున కాదు 1953లోనే అనుకున్న మాట. ఉమ్మడి ఏపీ అన్న మాట లేకపోయి ఉంటే విశాఖ రాజధాని అన్నది చరిత్ర చెప్పిన నిజం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత అంతలా అభివృద్ధి చెందిన సిటీ విశాఖ. అయినా తగిన గుర్తింపు లేదు. పాలకుల నుంచి ప్రోత్సాహం లేదు అన్నది మేధావుల నుంచి విశాఖను ప్రేమించే వారి ఆవేదన.
విశాఖను 2014లో రాజధానిగా చేసుకుంటే ఏపీకి గ్రోత్ ఇంజన్ గా ఉండేది. కానీ విశాఖకు ఆ అదృష్టం రాకుండా చేసినది ఎవరు అనేది కూడా సినిమా తీస్తే బాగుంటుంది అంటున్నారు. విశాఖకు రాజధాని హంగులు ఉన్నాయి. రాజసం ఉంది. కానీ లేనిది రాజకీయ మద్దతు అని అంటున్నారు.
టీడీపీ అయిదేళ్ల పాలనలో విశాఖను చూపించే అన్నీ చేశారు. విశాఖ వాస్తవంగా ఉన్న రాజధాని అని అంటున్నారు. విశాఖ అందరికీ కావాలి. కానీ రాజధాని హోదా మాత్రం దక్కకూడదు, కనీసం పాలనా రాజధాని కూడా కాకూడదా అన్నది పక్కా లోకల్స్ గా ఉండే విశాఖ వాసుల ఆవేదన. విశాఖ వలస పాలకుల చేతిలో పడి కేవలం రాజకీయ అందలాలు అందిస్తూ తాను మాత్రం అమాయకంగా అలాగే ఉండిపోయింది అని అంటున్నారు.
తాను పుండై ఒకరికి పండై అన్నట్లుగా విశాఖ కూడా అదే రకమైన అవస్థ పడుతుంది అంటే అది నిష్టుర సత్యం కాదా అని ప్రశ్నించే వారు ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎంతో వెనకబాటుతనానికి గురి అవుతూ దశాబ్దాలుగా ఉంది. బ్రిటిష్ వారి టైం లో విశాఖ అభివృద్ధి చెందింది తప్ప ఆ తరువాత సొంత పాలకులు చేసిందేమిటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
విశాఖ ఇప్పటికి నూటా పాతికేళ్ల క్రితమే అతి పెద్ద జిల్లాగా ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. విశాఖ ఫైల్స్ పేరుతో సినిమా తీస్తే విశాఖ విధి వంచితగా రాజకీయంగా అన్యాయానికి గురి అయిన ప్రాంతంగా ఎలా ఉందో అందరికీ అర్ధం అవుతుంది అని అంటున్నారు.