వంగవీటి మోహన రంగా ఏపీ రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ లీడర్. ఆయన పేరు ప్రస్తావన లేకుండా రాజకీయ పార్టీలు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఎన్నికల సీజన్ లో వంగవీటి రంగా హత్య గురించి కూడా ప్రస్తావిస్తున్న వారు ఉంటారు. వైసీపీ అదే విషయం మీద మాట్లాడుతోంది.
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు రంగా హత్య కేసులో ఉన్నారు అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాత విషయాన్ని కెలికారు. దాంతో వెలగపూడి పోటీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీకి సవాల్ చేశారు. ఆ కేసు ఎపుడో మూసేసారు. అందులో నా ప్రమేయం లేదని తేల్చారు. అయినా ఆ కేసు విషయం పదే పదే ఎత్తుతున్న ఎంవీవీ మీద పరువు నష్టం దావా వేస్తాను అని హెచ్చరించారు
ఎంవీవీకి సత్తా ఉంటే రంగా హత్య కేసు రీ ఓపెన్ చేసుకుని పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఎంపీల మధ్య మాటల యుద్ధం పుణ్యమాని మరోసారి రంగా హత్య కేసు చర్చకు వస్తోంది. గతంలో కూడా వెలగపూడి మీద వైసీపీ నేతలు ఈ తరహా ఆరోపణలు చేశారు. అయితే ఇపుడు మాత్రం వెలగపూడి సీరియస్ అవుతున్నారు.
తన పరువు తీస్తున్నారు అని దావా వేస్తాను అని హెచ్చరిస్తున్నారు. రీ ఓపెన్ చేయమని కూడా సవాల్ చేస్తున్నారు. రంగా హత్య కేసు వెలగపూడితో ముడిపెడుతూ ఇంతకాలం ఆరోపణలు చేస్తున్న వారు మాటలకే పరిమితం అవుతారా లేక ఈ కేసుని రీ ఓపెన్ చేయిస్తారా అన్నదే ఇపుడు ఆసక్తిని రేపుతోంది. వంగవీటి రంగా కాపులకు ఆరాధ్య దైవం. ఆయన పేరుని తెచ్చి ఓట్ల పంట పండించుకునేందుకే అన్ని పార్టీలు చూస్తున్నాయి.
ఇపుడు వెలగపూడి కూడా పరువు నష్టం దాకా వెళ్తున్నారు అంటే తన ప్రమేయం లేదని బలంగా చెప్పుకోవడానికే అని అంటున్నారు. రంగా హత్య జరిగింది 1988 డిసెంబర్ 26. ఇప్పటికి ముప్పై అయిదేళ్ళూ పై దాటింది. అయినప్పటికీ ఆయన హత్య సంఘటనను రాజకీయాల్లో ఏదో సందర్భంలో పార్టీలు తెస్తూనే ఉంటున్నాయి.
వెలగపూడి విషయానికి వస్తే ఆయన విజయవాడ వాస్తవ్యులు. వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చారు. మూడు దశాబ్దాలుగా విశాఖలో ఆయన ఉంటున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి మూడు సార్లు గెలిచారు. మరోసారి గెలవాలని చూస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉండే తూర్పు నియోజకవర్గంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. రంగా హత్య కేసు బయటకు తేవడం వెనక కూడా వ్యూహాలు ఉన్నాయి. తన తప్పు లేదని తాను నిర్దోషిని అని వెలగపూడి ఎంవీవీకి సవాల్ చేశారు. ఇపుడు ఎంవీవీ దీని మీద ఏమంటారో చూడాలి.