ష‌ర్మిల బ‌రిలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు త‌లెత్తాయి. కాంగ్రెస్‌లో విలీనం అవుదామ‌నుకున్నా.. చివ‌రికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. దీంతో ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్య‌త్…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు త‌లెత్తాయి. కాంగ్రెస్‌లో విలీనం అవుదామ‌నుకున్నా.. చివ‌రికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. దీంతో ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మైంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌క పోటీ చేస్తామ‌ని ఆమె దీర్ఘాలు తీశారు. తీరా ఆచ‌ర‌ణ‌కు వ‌స్తే… వైఎస్సార్‌టీపీలో ఆ వాతావ‌ర‌ణ‌మే క‌నిపించ‌లేదు.

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ అనే సొంత పార్టీని వైఎస్ ష‌ర్మిల పెట్టారు. నిరుద్యోగుల కోసం దీక్ష‌లు చేశారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తూ అధికార పార్టీ నేత‌ల‌పై ఇష్టానుసారం విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక ద‌శ‌లో ఎంతోకొంత తెలంగాణ‌లో ష‌ర్మిల ప్ర‌భావం చూపుతుంద‌ని అంతా భావించారు.

కేసీఆర్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఆమె దూకుడు ప్ర‌ద‌ర్శించడం ప్ర‌ధాన పార్టీల‌ను భ‌య‌పెట్టింది. ష‌ర్మిల ఏ పార్టీ కొంప ముంచుతారో అనే చ‌ర్చ కూడా జ‌రిగింది. అయితే క‌ర్నాట‌క మంత్రి డీకే శివ‌కుమార్ ద్వారా కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయ‌డానికి ష‌ర్మిల రాయ‌బారం న‌డిపారు. ఇక వీలీన‌మే త‌రువాయి అని అంతా అనుకున్న స‌మ‌యంలో బ్రేక్ ప‌డింది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అడ్డుకోవ‌డం వ‌ల్లే ష‌ర్మిల పార్టీ విలీనం కాకుండా ఆగిపోయింద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది.

త‌న‌ను కాంగ్రెస్ అవమానించింద‌ని ష‌ర్మిల రగిలిపోయారు. త‌న పార్టీ నాయ‌కుల‌తో ఆమె స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలి బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌కూడ‌ద‌ని అనుకున్నాన‌ని, అయితే కాంగ్రెస్ నుంచి త‌గిన చొర‌వ కొర‌వ‌డిందని ఆమె వాపోయారు. కావున బీఆర్ఎస్ లాభ‌ప‌డితే త‌మ త‌ప్పు లేద‌ని కాంగ్రెస్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ష‌ర్మిల ఎన్నిక‌ల బ‌రిలో వుంటార‌ని అనుకున్నారు. 

నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు గ‌డువు ముంచుకొస్తున్నా ష‌ర్మిల త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. మొద‌టి నుంచి ఖ‌మ్మం జిల్లా పాలేరులో తాను పోటీ చేస్తాన‌ని ష‌ర్మిల చెబుతూ వ‌చ్చారు. క‌నీసం తానైనా అక్క‌డి నుంచి పోటీ చేస్తారా? లేదా? అనేది తేల‌డం లేదు. కాంగ్రెస్ నుంచి త‌మ కుటుంబ స‌న్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తుండ‌డంతో ష‌ర్మిల త‌ప్పుకున్నారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏది ఏమైనా తెలంగాణ‌లో అనువుగాని చోట ష‌ర్మిల రాజ‌కీయ ప్ర‌యోగం విఫ‌ల‌మైన‌ట్టే క‌నిపిస్తోంది.